కార్తీక దీపాలతో శివాలయం దేదీప్యమానం
మరిపెడలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు – విశేషంగా లింగపూజలు, దీపారాధనలు
మరిపెడ: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మరిపెడ మండల కేంద్రంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి శివాలయంలో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి భక్తులు, శివ స్వాములు, శివ భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో మట్టి ప్రమిదలతో దీపాలను వెలిగించి దీపాలంకరణ చేశారు. ఆలయ పరిసరాలు దీపాల వెలుగులతో దేదీప్యమానంగా మారాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో పుష్పాలతో ప్రత్యేక అలంకరణలు చేసి, దీపాలు వెలిగిస్తూ కార్తీక మాస విశిష్టతను చాటారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, లింగపూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వయంగా శివలింగ పూజల్లో పాల్గొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయమంతా శివనామస్మరణ, భక్తి పాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
హిందూ సంప్రదాయం ప్రకారం కార్తీక మాసంలో దీపారాధన చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలుగుతాయని విశ్వసిస్తారు. శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో పూజించడం, దీపదానం చేయడం వల్ల అనేక జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురాణ సంప్రదాయాల్లో గొప్పగా చెబుతారు.
భక్తితో వెలిగించిన ప్రతి దీపం శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తూ భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరిపెడ శివాలయం కార్తీక దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
పున్నమి రిపోర్టర్: భూక్య రాము నాయక్
మరిపెడ బంగ్లా, మహబూబాబాద్ జిల్లా.





समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग