రెవెన్యూ డివిజన్, ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, డయాలసిస్ సెంటర్ మంజూరు చేయాలి
నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ–రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.
బోథ్ మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో అందుబాటులోకి వస్తే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగంగా అందుతాయని ఎమ్మెల్యే కోరారు. అలాగే ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గతంలో బోథ్‌కు మంజూరైన డయాలసిస్ సెంటర్ తరలిపోవడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బోథ్‌లోనే డయాలసిస్ సెంటర్‌ను పునరుద్ధరించాలని కోరారు. అదేవిధంగా ఇచ్చొడలో పెరుగుతున్న వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నెరడిగొండ, బజార్‌హత్నూర్ మండలాల్లో అటవీ శాఖకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించాలని, అటవీ అధికారుల వైఖరి కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన గిరిజనేతరులకు అటవీ హక్కు పట్టాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
బోథ్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంత్రులను కోరారు.


