Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Health Tips

బీపీ కొలతలో చిన్న పొరపాటు.. రీడింగ్‌లో పెద్ద తేడా!: డాక్టర్ ఎం.వి. రమణయ్య

Punnami Newsroom Published: Updated:
బీపీ కొలతలో చిన్న పొరపాటు.. రీడింగ్‌లో పెద్ద తేడా!: డాక్టర్ ఎం.వి. రమణయ్య

Story highlights

  • బీపీ రీడింగ్ కచ్చితంగా రావాలంటే..
  • పరీక్షకు ముందు పాటించాల్సిన జాగ్రత్తలు దేశంలో అధిక రక్తపోటు (హై బీపీ) ఒకముఖ్యమైన ఆరోగ్య సమస్య.
  • చాలామందికి బీపీ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు.

బీపీ రీడింగ్ కచ్చితంగా రావాలంటే.. పరీక్షకు ముందు పాటించాల్సిన జాగ్రత్తలు
దేశంలో అధిక రక్తపోటు (హై బీపీ) ఒకముఖ్యమైన ఆరోగ్య సమస్య. చాలామందికి బీపీ ఉన్నా ఎలాంటి లక్షణాలు కనిపించవు. అందుకే బీపీని క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. అయితే బీపీ కొలిచేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోతే ఫలితాల్లో తేడాలు రావచ్చు.
బీపీ పరీక్షకు ముందు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవి.

బీపీ కొలిచే ముందు..
ఐదు నిమిషాలు విశ్రాంతి: బీపీ కొలిచే ముందు కనీసం ఐదు నిమిషాలు ప్రశాంతంగా కుర్చీలో కూర్చోవాలి. ఆ సమయంలో మాట్లాడకూడదు.

టీ, కాఫీ, పొగకు విరామం: పరీక్షకు ముందు 30 నిమిషాల పాటు టీ, కాఫీ వంటి కెఫీన్ ఉన్న పానీయాలు తాగకూడదు. పొగ తాగడం, వ్యాయామం చేయడం కూడా మానుకోవాలి.

మూత్ర విసర్జన చేయాలి: మూత్రాశయం నిండుగా ఉంటే బీపీ కొంతసేపు ఎక్కువగా ఉండవచ్చు. అందుకే పరీక్షకు ముందు మూత్ర విసర్జన చేయాలి.

వెన్నుకు ఆసరా: వెన్నుకు మంచి ఆసరా ఉన్న కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. పరీక్ష సమయంలో వంగి కూర్చోకూడదు.

పాదాలు నేలపై: రెండు పాదాలను నేలపై సరిగా ఉంచాలి. ఒక కాలుపై మరొక కాలు వేసుకోకూడదు.

చేయి గుండె ఎత్తులో: బీపీ కొలిచే చేతిని బల్లపై ఆనించాలి. కఫ్ మధ్యభాగం గుండె ఎత్తులో ఉండాలి. చేయిని కిందకు వేలాడదీయకూడదు.

సరైన కఫ్ ఎంపిక: చేతి చుట్టుకొలతకు సరిపోయే కఫ్‌ను ఉపయోగించాలి. కఫ్ చిన్నదైతే బీపీ ఎక్కువగా, పెద్దదైతే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

చర్మంపై కఫ్: చొక్కా లేదా ఇతర దుస్తులపై కాకుండా, నేరుగా పైచేయి చర్మంపై కఫ్ పెట్టాలి. పరికరం సూచించిన విధంగా కఫ్‌ను సరిగ్గా బిగించాలి.

మోచేతి దగ్గర సరైన స్థానం: కఫ్ కింది అంచు మోచేతి మడతకు కొద్దిగా పైన ఉండాలి. పరికరం సూచనల ప్రకారం కఫ్‌ను అమర్చాలి.

మాట్లాడకూడదు: బీపీ కొలుస్తున్నప్పుడు మాట్లాడటం, నవ్వడం, ఫోన్ చూడటం లేదా శరీరాన్ని కదపడం చేయకూడదు.

రెండుసార్లు కొలవాలి: కనీసం ఒక నిమిషం విరామంతో రెండు సార్లు బీపీ కొలవాలి. రెండు ఫలితాలను నమోదు చేసి, వాటి సగటును పరిగణనలోకి తీసుకోవాలి.

రెండు చేతుల్లో పరీక్ష: మొదటిసారి బీపీ పరీక్షించేటప్పుడు రెండు చేతుల్లోనూ కొలవడం మంచిది. తేడా ఉంటే వైద్యుడి సూచన మేరకు ఎక్కువ ఫలితం వచ్చిన చేతిలోనే తర్వాతి కొలతలు తీసుకోవాలి.

పరీక్షకు ముందు రోజు ఏం చేయాలి?
బీపీ పరీక్షకు ముందు రోజు నుంచే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.

ఉప్పు: ఊరగాయలు, అప్పడాలు, ఎక్కువ ఉప్పు ఉన్న ప్యాకెట్ ఆహారాలను తగ్గించాలి. రోజువారీ ఆహారంలో ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోవాలి.

నిద్ర: తగినంత నిద్రపోవాలి. నిద్రలేమి, ఒత్తిడి బీపీపై ప్రభావం చూపవచ్చు.

మద్యం: మద్యం బీపీని ప్రభావితం చేయవచ్చు. బీపీ కొలవడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు మద్యం తీసుకోకూడదు.

వ్యాయామం: అలవాటు లేని తీవ్రమైన వ్యాయామం చేసిన వెంటనే బీపీ కొలవకూడదు. కనీసం 30 నిమిషాలు విశ్రాంతి తీసుకోవాలి.

మందులు: ఇబుప్రోఫెన్, డైక్లోఫెనాక్ వంటి కొన్ని నొప్పి నివారణ మందులు, జలుబు మందుల్లోని కొన్ని పదార్థాలు బీపీని పెంచవచ్చు. అయితే వైద్యుడు సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. మీరు వాడుతున్న మందుల గురించి వైద్యుడికి చెప్పాలి.

ఇన్ని జాగ్రత్తలు నిజంగా అవసరమా?
“బీపీ కొలిపించుకోవడానికి ఇన్ని నియమాలా?” అని అనిపించవచ్చు. కానీ బీపీ కొలిచేటప్పుడు జరిగే చిన్న పొరపాట్లు కూడా ఫలితాన్ని మార్చవచ్చు. వెన్నుకు ఆసరా లేకపోవడం, కాళ్లు ఒకదానిపై మరొకటి వేసుకోవడం, చేయిని సరైన ఎత్తులో ఉంచకపోవడం వంటి కారణాలతో రీడింగ్ మారవచ్చు.

బీపీ సాధారణంగా ఉన్నప్పుడు ఈ పొరపాట్ల ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ బీపీ సాధారణ స్థాయికి లేదా ఎక్కువ స్థాయికి దగ్గరగా ఉన్నప్పుడు, ఈ తేడాలు వైద్యుడి నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు.

ఒక్కసారి బీపీ ఎక్కువగా వచ్చినంత మాత్రాన అధిక రక్తపోటు ఉన్నట్లు చెప్పలేం. సరైన పద్ధతిలో పలుమార్లు తీసిన రీడింగ్‌లు, అవసరమైతే ఇంట్లో తీసిన కొలతలు, వైద్యుడి పరిశీలన ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.
గుర్తుంచుకోండి: బీపీ కొలవడం మాత్రమే కాదు, సరిగ్గా కొలవడం కూడా ఆరోగ్య సంరక్షణలో భాగమే!
డాక్టర్ యం. వి.రమణయ్య
ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *