సిద్ధవటం మండలంలోని సాయినగర్ గ్రామంలో శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి, సీతారామ లక్ష్మణ ఆలయంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.పీఆర్బీ హ్యాండ్లూమ్ అధినేత పుత్తా రామభద్రయ్య కుటుంబ సభ్యులు దుర్గామాత విగ్రహాన్ని సమర్పించడంతో పాటు గత ఎనిమిదేళ్లుగా దసరా ఉత్సవాలకు సహకరిస్తున్నారని అర్చకులు తెలిపారు. గ్రామ ప్రజలకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.టీడీపీ సీనియర్ నాయకుడు పుత్తా బాబు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి రైతులు పంటలు సమృద్ధిగా పండించాలని ఆకాంక్షించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
