खबर की मुख्य बातें
- Uploaded Video:
అమలాపురం, పున్నమి దినపత్రిక:
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా నిర్ణీత కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు అధికారులు ఆదేశించారు. సోమవారం డా.బీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీ ఆర్ఎస్) కార్యక్రమం అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, కొత్తపేట, రామచంద్రాపురం ఆర్డీవోలు జీవీవీ.సత్యనారాయణ, సరళావతి, ఎస్డీసీ డి.అచ్యుతా కుమారి, డీఆర్డీఏ పీడీ డి.రాంబాబు, స్వర్ణ గ్రామ, వార్డు అధికారి పి. రాజేశ్వరి, డ్వామా పీడీ జీఎస్.రామ్ గోపాల్ తదితరులతో కలిసి జిల్లా చుట్టూ ప్రక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. భూ రికార్డు ఆన్ లైన్ లో నమోదు, రీ సర్వే, భూ ఆక్రమణలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పారిశుధ్యం, మురికి కాలువలకు పుడికతీత, ఇంటిస్థలం, ఇళ్లు, పింఛను, సదరం సర్టిఫికెట్, రహదారులు మంజురు వంటి అంశాలపై మొత్తం 214 అర్జీలు అందాయి.ఈ అర్జీలను సంబంధిత అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని డీఆర్వో ఆదేశించారు. ఈ సందర్భంగా డీఆర్వో వి.సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. వివిధ శాఖలో నమోదైన అర్జీల పట్ల సంబంధిత అధికారులు అధిక ప్రాధాన్యత ఇచ్చి, తప్పనిసరిగా నిర్దిష్ట కాల వ్యవధిలోపు పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారులకు సూచించారు. వివిధ శాఖల్లో నమోదై అర్జీలకు సరైన పరిష్కార నివేదిక సిద్దం చేసి, ఆన్ లైన్ లో తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని డీఆర్వో అధికారులకు స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల కొరకు 1100 టోల్ ఫ్రీ నెంబర్, మీ కోసం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కూడా నమోదుకు అవకాశం ఉందని, అలాగే మండల, గ్రామ వార్డు స్థాయిలలో అధికారులకు సమర్పించవచ్చునన్నారు . రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సేవలను జిల్లా వాసులు సద్వినియోగ చేసుకోవాలని చేయాలని డీఆర్వో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్ లు ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video: