పిల్లలకు మాదకద్రవ్యాలపై అవగాహన అవసరం – సఖీ రమాదేవి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన సఖీ ఉమెన్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ, డ్రగ్స్ ముప్పు ఎక్కువగా చిన్నపిల్లలపై పడుతోందని, చాక్లెట్ల రూపంలో డ్రగ్స్ అందించి మైనర్లను బానిసలుగా మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమగ్రంగా జాగ్రత్తలు తీసుకుని వారిని కాపాడాలని సూచించారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ 1908కి సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులకు రిహాబిలిటేషన్ కేంద్రాల్లో చికిత్స అందించేందుకు ప్రభుత్వం అనేక సదుపాయాలు కల్పించిందని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకొచ్చేలా ఆమె పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్ తులసి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.