खबर की मुख्य बातें
- తెలంగాణలో సన్నబియ్యం ధరలకు కళ్లెం..
- గరిష్ట ధరలు ఖరారు!
- రకాన్ని బట్టి కిలో రూ.66 నుంచి రూ.79 వరకు ధరల నిర్ణయం..
తెలంగాణలో సన్నబియ్యం ధరలకు కళ్లెం.. గరిష్ట ధరలు ఖరారు!
రకాన్ని బట్టి కిలో రూ.66 నుంచి రూ.79 వరకు ధరల నిర్ణయం.. దుకాణాల్లో ధరల పట్టిక ప్రదర్శన తప్పనిసరి
హైదరాబాద్, నవంబర్ 3:
తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ధరల నియంత్రణకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. మార్కెట్లో బియ్యం ధరలు ఇష్టానుసారంగా పెంచి విక్రయించకుండా వివిధ రకాల సన్నబియ్యానికి గరిష్ట విక్రయ ధరలను నిర్ణయించింది. ఈ మేరకు బియ్యం మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు నిర్ణయించిన ధరలకు మించి విక్రయాలు జరపకూడదని స్పష్టం చేసింది.
రకాల వారీగా గరిష్ట ధరలు ఇలా ఉన్నాయి:
– BPT, KNM రకం సన్నబియ్యం కిలో రూ.66.
– తెలంగాణ సోనా, RNR రకం కిలో రూ.74.
– HMT, JSR రకం కిలో రూ.79.
ఈ ధరలకు మించి బియ్యం విక్రయిస్తే సంబంధిత మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ప్రతి బియ్యం దుకాణంలో రకం వారీగా నిర్ణయించిన ధరల వివరాలను వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించింది.
సన్నబియ్యం కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ధరలను పరిశీలించి, నిర్ణీత ధరల కంటే అధికంగా వసూలు చేస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ధరల నియంత్రణతో సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గడంతో పాటు మార్కెట్లో బియ్యం విక్రయాల్లో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు.
నిర్ణీత ధరలకు మాత్రమే బియ్యం విక్రయించాలి.. వినియోగదారులను అధిక ధరలతో ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
समाचार स्रोत
- Punnami Reportingस्वयं की रिपोर्टिंग