డ్రగ్స్‌పై టెక్నాలజీతో నిఘా అభినందనీయం.
-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
గంజాయి నిర్మూలనకు ఇబ్రహీంపట్నం పోలీసుల వినూత్న చర్యలు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 3:
డ్రగ్స్, గంజాయి అక్రమ కార్యకలాపాలపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేస్తూ ఇబ్రహీంపట్నం పోలీసులు చేపడుతున్న చర్యలు అభినందనీయమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలో పోలీసుల ఆధ్వర్యంలో కొనసాగుతున్న డ్రోన్ నిఘా వ్యవస్థ పనితీరును ఎమ్మెల్యే పరిశీలించారు.
గంజాయి సాగు, వినియోగం, విక్రయాలను అరికట్టేందుకు డ్రోన్‌ల సహాయంతో చేపడుతున్న నిఘా చర్యలను ఇబ్రహీంపట్నం సీఐ ఎ. సుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యేకు వివరించారు. గంజాయి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన మూలాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ.. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి పోలీసులు చేపడుతున్న చర్యలకు ప్రజలు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
గంజాయి వినియోగదారులు, విక్రయదారులు, అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలని కోరారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై సమాచారం అందించి, నిందితులను పట్టుకునేందుకు సహకరించే వారికి రూ.1,500 నగదు బహుమతి అందించడం మంచి చర్య అని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు అభినందించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం పోలీసు శాఖ, ప్రజలు సమన్వయంతో పనిచేసినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు.
ఈ సందర్భంగా డ్రోన్ నిఘా వ్యవస్థ పనితీరును పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారికి ఇబ్రహీంపట్నం సీఐ ఎ.సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదాలు తెలిపారు.

