డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అక్రమాలను అరికట్టి, పారదర్శకంగా లాటరీ పద్ధతిలో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరుతూ హైదరాబాద్ మహానగర పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గురువారం తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వీపీ గౌతమ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఎల్బీనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్, మహేశ్వరం, అంబర్‌పేట నియోజకవర్గాల్లో ఇళ్ల కేటాయింపులపై వస్తున్న ఫిర్యాదులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రులు, అధికారుల సిఫారసులతో లాటరీ పద్ధతిని పాటించకుండా కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకుల ప్రభావంతో, ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం వల్ల నిజమైన పేదలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, అర్హులైన పేదలకు దక్కాల్సిన ఇళ్లను అక్రమంగా ఇతరులకు కేటాయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అర్హులకు న్యాయం జరగకపోతే, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారితో కలిసి సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, మర్రి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
