Story highlights
- అల్లూరి జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PC & PNDT Act–1994)ను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.
- ఎం.
- రియాజ్ బేగ్ ఆదేశించారు.
అల్లూరి జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం (PC & PNDT Act–1994)ను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎం. రియాజ్ బేగ్ ఆదేశించారు. మంగళవారం పాడేరులోని DM&HO కార్యాలయంలో జిల్లా, సబ్-డిస్ట్రిక్ట్ స్థాయి సలహా కమిటీల సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, నిర్వహణ, చట్ట నిబంధనల అమలుపై సమీక్షించారు. ప్రతి కేంద్రం తప్పనిసరిగా చట్ట నిబంధనలు పాటించాలని, రికార్డులు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, లింగాన్ని వెల్లడించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడపిల్లల సంరక్షణ, లింగ వివక్ష నివారణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్యులు, స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులకు చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఆడపిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
News Sources
- Punnami ReportingOfficial statement