ఖానాపురం, పున్నమి (ప్రతినిధి):
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో భాగంగా ఖానాపురం మండలంలో ఇప్పటివరకు 2,057 దరఖాస్తులు అందినట్లు తహసీల్దార్ సంగసాని రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలవ్యాప్తంగా పట్టభద్రుల ఓటరు నమోదుకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫారాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 701 దరఖాస్తులను పరిశీలించి ఆమోదించగా, మరో 1,356 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉందన్నారు.
ఈ నెల 6వ తేదీలోపు మిగిలిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అర్హులైన పట్టభద్రులను ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదుపై అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.
