– వరుసగా విఫలమైన లావాదేవీల తర్వాత పక్కాగా అమలు చేసిన మోసం
– రూ.50 వేలు, రూ.49 వేల చొప్పున ఖాతా నుంచి నగదు మాయం
– 1930కు ఫిర్యాదు చేసినా న్యాయం కోసం ఎదురుచూపులు
– మీడియాను ఆశ్రయించిన బాధితుడు.. స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి
విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి):
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల బ్యాంకు ఖాతాలకు కన్నం వేస్తున్నారు. తొలుత చిన్న మొత్తంతో లావాదేవీని పరీక్షించి, ఆ తర్వాత భారీ మొత్తంలో నగదును కాజేస్తున్న ఘటనకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఖాతా నుంచి ఏకంగా రూ.99 వేలు కోల్పోయానని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
బాధితుడు అందించిన లావాదేవీల స్క్రీన్షాట్ల వివరాల ప్రకారం.. తొలుత రూ.99 వేలు, అనంతరం రూ.96 వేలు, ఆ తర్వాత రూ.89 వేలు బదిలీ చేసేందుకు ప్రయత్నించగా లావాదేవీలు విఫలమయ్యాయి. అయితే ఆ తర్వాత రూ.10తో చేసిన లావాదేవీ విజయవంతం కావడంతో, నిందితుడు ఖాతా లావాదేవీలు సజావుగా జరుగుతున్నాయని నిర్ధారించుకున్నట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అనంతరం రూ.50 వేలు ఒకసారి, రూ.49 వేలు మరోసారి బదిలీ చేసి మొత్తం రూ.99 వేలు కాజేసినట్లు ఆరోపిస్తున్నాడు.
ఈ ఘటనపై బాధితుడు 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయగా, ఎన్సీఆర్పీ నుంచి 30211260021031 అనే అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జారీ అయింది. అయినప్పటికీ తన సమస్యకు ఇప్పటివరకు పరిష్కారం లభించలేదని బాధితుడు వాపోతున్నాడు.
తనకు జరిగిన ఆర్థిక నష్టంపై సంబంధిత సైబర్ క్రైమ్ అధికారులు తక్షణమే స్పందించి, లావాదేవీలను పరిశీలించి నగదు రికవరీకి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతోనే మీడియాను ఆశ్రయించినట్లు తెలిపాడు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి బాధితుడికి న్యాయం చేయడంతోపాటు, ఇలాంటి సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.





