Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Vizianagaram

గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి — ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు – జిల్లా

Punnami Newsroom Published:
గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి — ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు – జిల్లా

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి**

*ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు**

*అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశాలు**

విజయనగరం, జిల్లా బ్యూరో రమణ, నవంబర్ 02. పున్నమి ప్రతినిధి

జిల్లాలో జరగనున్న రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి శనివారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎన్నికల పరిశీలకుల సూచనలు, ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 27 మండలాల పరిధిలోని 775 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 7,312 వార్డులు, 7,388 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 12,83,983 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వివరించారు. న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్న గరివిడి మండలంలోని రెండు గ్రామ పంచాయతీలను మినహాయించి మిగిలిన పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

**మూడు విడతల్లో ఎన్నికలు**

మొదటి విడతలో 9 మండలాల్లోని 237 గ్రామ పంచాయతీలకు నవంబర్ 26న, రెండో విడతలో 9 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీలకు నవంబర్ 29న, మూడో విడతలో 9 మండలాల్లోని 283 గ్రామ పంచాయతీలకు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

**పోలింగ్ కేంద్రాలు, భద్రతపై ప్రత్యేక దృష్టి**

సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. జిల్లాలో గుర్తించిన 181 సున్నిత, 111 అతి సున్నిత, 36 సమస్యాత్మక గ్రామ పంచాయతీల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

**సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, వాహనాల సమీకరణ**

ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బందిని ముందుగానే గుర్తించి విధుల కేటాయింపు చేపట్టాలన్నారు. సిబ్బంది ర్యాండమైజేషన్ ఎన్నికల నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

మూడు విడతలకు కలిపి 8,866 బ్యాలెట్ బాక్సులు అవసరమని, ఇందులో 20 శాతం అదనపు నిల్వ కూడా ఉండేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి రవాణాకు అవసరమైన 121 వాహనాలు, 53 ఫ్లయింగ్ స్క్వాడ్ వాహనాలు సహా ఇతర రవాణా సదుపాయాలను సమకూర్చుకోవాలన్నారు.

**నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు**

మూడు విడతల్లో మొత్తం 222 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పర్యవేక్షించాలని, వ్యయ పరిశీలన, ఎన్నికల నివేదికలను నిర్దేశిత సమయంలో సమర్పించాలని అధికారులకు సూచించారు.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశాన్ని నిశితంగా పర్యవేక్షిస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జున రావు, ఎన్నికల నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి — ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వొద్దు – జిల్లా

Leave a comment

Your email address will not be published. Required fields are marked *