(పున్నమి ప్రతినిధి) :
క్రితం వారం, కరోనా ప్యాండమిక్ సమయంలో ఉద్యోగులకు ఇవ్వ దగిన శెలవుల గురించి చర్చించుకున్నాం. ఉద్యోగుల ఆరోగ్యం అనేది, ఉద్యోగులకే కాక, సంస్థాగతంగా కంపెనీలకు కూడా చాలా ముఖ్యం.
చాలా సంస్థలలో మధ్య వయసు ఉద్యోగులు ఉంటారు. సీనియర్ హోదాలోనో, కీలకమైన పొజిషన్ లలోనో ఉంటారు. స్త్రీలు కానీ, పురుషులు కానీ, వారి వయసు ఒక 45 దాటి ఉంటుంది అనుకోండి. చాలా మంది మీకు చెప్ప లేని, చెప్పని, చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలతో సతమతమౌతూ, ఎలాగోలా ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూ, బండి ఈడుస్తూ ఉంటారు.
పెద్ద సంస్థలు అయితే, ఆరోగ్య బీమా ఇస్తాయి. చిన్న కంపెనీలు అవి కూడా ఇవ్వలేవు. అలా అని వారికి వైట్ రేషన్ కార్డు కూడా
ఉండదు. ఆరోగ్యశ్రీకి కూడా అర్హులు కారు. ఇటువంటి, ప్రభుత్వం నుంచో, కంపెనీ నుంచో సమాజం నుంచో ఎలాంటి సపోర్టూ లేని మధ్య తరగతి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు వస్తే. ఇటీవలి ఒక సర్వే ప్రకారం, 45 దాటిన ఉద్యోగు లలో, 60 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతూ ఉంటారట!
అలాంటి పరిస్థితులలో, మేనేజర్‌గా, లేక ఒక పై అధికారిగా మీరేమి చేయగలరో ఈ వారం కొన్ని సూచనలు.
(1) అందరూ వారి ఆరోగ్య సమస్యలను పై అధికారులతో పంచుకోవడానికి ఇష్టపడరు. వారిని బలవంతం చెయ్యవద్దు. వారు ఎంత చెబితే, అంత వినండి. మీ సంస్థ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లభిస్తాయో వారికి చెప్పండి.
కొన్ని కంపెనీలకి కొన్ని ఆసుపత్రుల వారు, లేక డాక్టర్లు తెలిసి ఉంటారు. కంపెని ద్వారా వెళితే, కొంత డిస్కౌంటుతో ఆరోగ్య పరీక్షలు చేయడమో, హాస్పిటల్ ఫీజు కొంత తగ్గించడమో చేస్తారు. అలాంటి అవకాశం మీ దగ్గర ఉంటే వారికి చెప్పండి. అతడి / ఆమె ఆరోగ్య సమస్యకి సంబంధించి మీకు బాగా తెలిసిన పేరున్న డాక్టర్ ఉంటే, వారి రిఫరెన్సు ఇవ్వండి.
(2) శెలవు ఇవ్వలేకపోతే, ఇంటి దగ్గర నుంచి పని చేసే అవకాశం ఉందేమో చూసి, అలాంటి పని కల్పించండి.
(3) వారు మార్కెటింగ్, సేల్స్ లాంటి ఫీల్డ్ వర్క్‌లో ఉంటే, ఆరోగ్య కారణాల వల్ల తాత్కాలికంగా తిరగ లేక పోతే, ఆఫీసులో కూర్చుని, టెలి మార్కెటింగ్, లేదా పేమెంటు ఫాలోఅప్ లాంటి పనులు అప్పగించవచ్చు.
(4) పూర్తి 8 గంటలు పని చేయలేకపోతే, రోజుకు ఒక నాలుగైదు గంటలు పని చేయగ్లరేమో అడగండి వారు కోలుకునే దాకా.
ఆరోగ్య సమస్య నుంచి బయట పడగలగడం అనేది ఒక మైండ్‌గేం. ‘‘ నాకు కంపెనీ సపోర్టు ఉంది. మా పై అధికారి సపోర్టు ఉంది’’ అనే భావంతో వారు త్వరగా కోలుకోగలుగుతారు. మందులు వారి శరీరం పై బాగా పని చేస్తాయి.
ఇక మీరు చెయ్య కూడనివి !!
ఒక ఉద్యోగి (ని) మీ దగ్గర ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టుకున్నప్పుడు, మీకు ఏమి చెయ్యాలో తెలియక పోతే, లేదా మీ అధికార పరిధుల గురించి క్లారిటీ లేక పోతే, మీ పై అధికారులను సంప్రదించండి. మీ పై సూపర్ వైజర్లకి తెలియకుండా, మీరు ఎలాంటి హామీలు ఇవ్వవద్దు, కంపెనీ తరఫున! వారు చెబుతున్నారు కదా అని, వారి దగ్గర మీ ఆరోగ్య సమస్యలు ఏకరువు పెట్టకండి ! అది వారికి ఏ విధంగానూ సహాయం చెయ్యదు!
ఇవి చేయకూడనివి.
వయసు రావడం, ఆరోగ్య సమస్యలు ఉండడం సహజం. కానీ, గత 20 సంవత్సరాలుగా మీ దగ్గర పని చేసే ఉద్యోగిని ఇలాంటి సమయాలలో ఎలాగోలా కాపాడుకోలేక పోతే, కంపెనీకి ఉపయోగ పడే దశాబ్దాల నైపుణ్యాన్ని, అనుభవాన్నీ కోల్పోతాం. దాని ప్రభావం వ్యాపారం మీద కూడా ఉంటుంది. వ్యాపారంలో లాభాపేక్షని, టార్గెట్ లని, కొంత ఉద్యోగుల సంక్షేమాన్నీ బ్యాలన్సు చేయడం, వ్యాపారస్థులకు ఒక ఛాలెంజ్! మీ మీ వ్యాపారాలలో మీరు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటూ.