CHITTOR:ఆపరేషన్ వికటించి పురిటి బిడ్డ మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు . ఇందుకు బాధ్యులైన ఆసుపత్రి యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఈ ఘటన మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది . చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రిలో పురిటిబిడ్డ చనిపోయింది . పుంగనూరు వాండ్లపల్లికి చెందిన ముబారక్ బేగం ( 23 ) పురిటి నొప్పులతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం చేరింది . సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడం వల్ల మహిళా డాక్టర్ ఆపరేషన్ చేసుకోవాలని సూచించింది . అయితే అంత సమయం లేకపోవడం వల్ల సాధారణ కాన్పు చేస్తున్నట్లు ఆసుపత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపారు . అనంతరం కొద్దిసేపటికే మగ బిడ్డకు బేగం జన్మనిచ్చింది . అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయి ఉండటం , పురిటి బిడ్డకు గాయాలు ఉండటాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు గమనించారు . ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా పురిటి బిడ్డ చనిపోయిందని బంధువులు ఆరోపించారు . ఆసుపత్రి సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి బంధువులు తెలిపారు