Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Andhra Pradesh

విద్యా వికాసానికి ఆనం బాట!

Punnami Newsroom Published:
విద్యా వికాసానికి ఆనం బాట!

Story highlights

  • తరుణవాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు కార్యాచరణ సంగం ఐటీఐకి బిర్లా గ్రూప్‌ రూ.5 కోట్ల నిధులు

తరుణవాయిలో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు కార్యాచరణ

సంగం ఐటీఐకి బిర్లా గ్రూప్‌ రూ.5 కోట్ల నిధులు

ఆత్మకూరు, అక్టోబర్ 10 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గాన్ని విద్యా, సాంకేతిక, ఉపాధి రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఆయన కృషితో సంగం మండలం తరుణవాయి వద్ద ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. లగడపాటి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను విద్యాభివృద్ధికి వినియోగించే దిశగా కార్యాచరణ చేపట్టారు.జాతీయ రహదారికి సమీపంలోని తరుణవాయి వద్ద రూ.100 కోట్లకు పైగా విలువైన ఆస్తులను ప్రజాప్రయోజనాలకు ఉపయోగించాలన్నది మంత్రి లక్ష్యం. ఈ ప్రాంగణంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల, రెసిడెన్షియల్ విద్యాసంస్థలు, సాంకేతిక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఐటీఐ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు

మంత్రి ఆనం అభ్యర్థనకు స్పందించిన అల్ట్రాటెక్ సిమెంట్‌–ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంగం ఐటీఐ అభివృద్ధికి కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల నుంచి రూ.5 కోట్లు సమకూర్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నిధులతో అవసరమైన మౌలిక సదుపాయాలతో నూతన భవన బ్లాక్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది.ఈ నేపథ్యంలో శనివారం ముంబై నుంచి వచ్చిన బిర్లా గ్రూప్‌ ప్రతినిధులు అరుణ్ సింగ్, జయదేవ్ తరుణవాయి వద్ద అందుబాటులో ఉన్న భవనాలు, స్థల విస్తీర్ణం, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అదనపు భవన నిర్మాణానికి ఉన్న అవకాశాలను సంబంధిత అధికారులతో సమీక్షించారు.

కలెక్టర్‌తో నిర్మాణాలపై చర్చలు

అనంతరం నెల్లూరులో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో ప్రతినిధులు సమావేశమయ్యారు. సంగం ఐటీఐకి రూ.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో నూతన భవన బ్లాక్‌ నిర్మించేందుకు సంస్థ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన సాంకేతిక అంశాలు, శాఖల సమన్వయంపై చర్చించారు.ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే ఆత్మకూరు యువతకు సాంకేతిక విద్య, ఉపాధి అవకాశాలు మరింత చేరువ కానున్నాయి. నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి ఆనం చేస్తున్న ప్రయత్నాలకు పారిశ్రామిక సంస్థల సహకారం తోడవుతోంది. ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజనీరింగ్, రెవెన్యూ శాఖల అధికారులు, ఐటీఐ ప్రిన్సిపాళ్లు, సిబ్బంది, మంత్రి కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *