అమరావతి, పున్నమి న్యూస్ బ్యూరో:
ఐఏఎస్ అధికారుల కొరతతో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తపరుస్తుండటం ప్రభుత్వానికి ఊరటనిచ్చే పరిణామంగా మారింది. ఇప్పటికే కొందరు ఆంధ్రా క్యాడర్‌కు చెందిన అధికారులు పలు కారణాలతో నిష్క్రమిస్తుండగా, ఇప్పుడు ఇతర రాష్ట్రాల IASలు అమరావతిలో డిప్యూటేషన్ మీద సేవలందించేందుకు ముందుకొస్తున్నారు.
కర్ణాటక నుంచి హెబ్సిబా కొర్లపాటి – కీలక భాద్యతలకై సిద్ధం
కర్ణాటకకు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి హెబ్సిబా కొర్లపాటి ఇటీవల డిప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం కర్ణాటకలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆమెను ఇప్పటికే అక్కడి ప్రభుత్వం రిలీవ్ చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఆమె అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ADC) ఎండీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
రాజధాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న ఆమెకు సంబంధించి ప్రభుత్వ వర్గాల్లో విశ్వాసం ఎక్కువగా ఉంది. నిజాయితీ, దృఢ సంకల్పం, వేగవంతమైన పనితీరు వంటి అంశాల పరంగా ఆమెకు మంచి పేరుంది. ఒకవేళ ADC బాధ్యతలు అప్పగించకపోతే, ఆమెకు AP Maritime Board వంటి ఇతర కీలక సంస్థ బాధ్యతలు అప్పగించే అవకాశమూ ఉందని సమాచారం.
పత్తిపాడు ఎమ్మెల్యే అల్లుడైన IAS కూడా రానున్నాడా?
ఇంతలో మరో ఆసక్తికర పరిణామం ఏపీ పాలనలో చోటుచేసుకోనుంది. గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే కొమ్మినేని రామాంజనేయులు అల్లుడు కూడా ఐఏఎస్ అధికారి కావడం, ఆయన త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు డిప్యూటేషన్‌పై రావాలని ఆసక్తిగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశం ఏమిటంటే, రామాంజనేయులు స్వయంగా గతంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నారు. 2019లో ఉద్యోగ విరమణ అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి టీడీపీలో చేరారు. 2024 ఎన్నికల్లో పత్తిపాడు నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
ఇప్పుడు ఆయన అల్లుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో సేవలందించేందుకు సిద్ధమవడం, ప్రభుత్వానికి అవసరమైన నిపుణుల సమీకరణలో మేలు చేస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.