నైటీలే అసలుకు ఎసరు
చీరకట్టు ఎవరు కట్టినా అందంగా ఉంటుంది
మందు తాగని వారు వెధవలంటున్న కుర్రకారు
ప్రపంచీకరణ(గ్లోబలైజేషన్) వల్ల ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా తెల్సిపోతోంది. ఇంతవరకు ఇబ్బందిలేదు. మనం ఇప్పుడు ప్రపంచ పౌరులం. ఇది గొప్ప భావన. ఎవరూ కాదనలేనిది. మానవత్వంతో బతకడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీతల్లి భూమి భారతిని అన్నది మహనీయుని మాట. ఇప్పుడు విదేశాల సంగతి దేవుడెరుగు స్వదేశంలోనే మనల్ని మనం మరచిపోయాం. అద్భుతమైన సంస్కృతిని ధ్వంసం చేసుకుంటున్నాం. మన ఆచారాలు, ఆహారపు అలవాట్లు, పండుగలు, కట్టు బొట్టు ఇదంతా మన సంస్కృతి. మన వారసత్వం. తరతరాలుగా లభించిన గొప్ప సంపద. తరగని ధనం. మనం తెలుగువాళ్లం. గొప్ప సంస్కృతికి వారసులం. కులమేదైనా మతమేదైనా మనమంతా ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడున్నా మన ఆచారాలు, పండుగలు ప్రత్యేకం.
ఏమిటి ప్రత్యేకత: తెలుగు సంస్కృతి గురించి అంతగా బాధపడాల్సిన అవసరం ఏమిటి?. ఏముంది ఇందులో అని కొందరు ప్రశ్నించినా ఆశ్యర్యం లేదు. నాగరికత ముసుగులో మన సంస్కృతి ధ్వంసమవుతోంది. పాతికేళ్ల కిందటి పరిస్థితులతో పోలిస్తే మనం చాలా మారిపోయాం. ఏవిధంగా అనేది పరిశీలిద్దాం. ఇప్పుడు మన కట్టుబొట్టూ మారిపోయింది. పట్టణాల్లోగాని, పల్లెటూళ్లలోగాని చక్కటి చీరకట్టు, లంగావోణిలు కనిపించేవి. మరిప్పుడో చీర మరుగున పడిపోయి పంజాబి డ్రస్సులు, నైటీలే కనిపిస్తున్నాయి. పంజాబి డ్రస్సుల వల్ల నష్టమేమిలేదు.
నైటీలే అసలుకు ఎసరు తెచ్చే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇవి పాశ్చాత్యులు రాత్రి మాత్రమే ధరిస్తారు. పగలు నిషిద్ధం. మరి మనమో పగలు కూడా ఇవే ధరిస్తున్నాం. ఇది కేవలం నగరాలు, పట్టణాలకే కాదు పల్లెలకూ సోకింది. ఇప్పుడు ఏ నీళ్ల పంపు దగ్గర చూసినా , ఏ నలుగురు ఆడంగులు చేరినా ఎక్కువ మంది నైటీలు ధరించే కనబడుతున్నారు. ఇది చూస్తే మనస్సు కలుక్కు మంటోంది. ఏమిటిది మనం ఎక్కడికి చేరిపోయాం, ఎటువైపు పయనిస్తున్నామో అర్థం కావడం లేదు. చీరకట్టు ఎవరు కట్టినా అందంగా ఉంటుంది.
అదే నైటీ ఊబకాయులు, వృద్ధులు ధరిస్తే వికారంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనో, అది ఇంటి వరకైతే కొంతమేలే. కాని వీధుల్లో అదీ పగలు దర్శనమిస్తే ఎంత దారుణంగా ఉంటుంది. ఇదిప్పుడు సర్వసాధారణంగా మారుతోంది. చక్కటి చీరకట్టుకు లంగావోణికి మంగళం పాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇది మనసును కలచివేసే విషయం. మన కట్టూబొట్టూ సంస్కృతిపై దాడి. ఈసందర్భంగా ఒక ముఖ్యమైన నా గతాన్ని చెప్పాలి. నేను ప్రాధమిక పాఠశాల బిట్రగుంటలో చదువుకున్నాను. అప్పుడు మా స్కూలు చుట్టు ఆంగ్లో ఇండియన్స్ ఇళ్లుండేవి. వాళ్లు రాతుళ్లు నైటీలు, పగలు గౌన్లు ధరించేవాళ్లు. అవి మా చిన్న్నికళ్లకు విచిత్రంగా కనిపించేవి. మేము ఉదయాన్నే స్కూలుకు వెళ్లేటప్పటికి వాళ్లు నైటీలపైనే ఉండే వాళ్ల వేషధారణ గురించి మా వయసులో ఉన్న వాళ్ల పిల్లల్ని మేము వెక్కిరించేవాళ్లం. వాళ్లు పాపం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అది వాళ్ల సంస్కృతి. వాళ్లేం చేస్తారు. కాని మస సంస్కృతి అది కాదే. మన చీరకట్టు అద్భుతమైనది. లంగావోణి ప్రశస్తమైంది. మనకా సంగతి తెలియడం లేదు. పగలు నైటీలేంటంటే సుఖంగా ఉందని కొందరు చెబుతున్నారు. నెల్లూరు మూలాపేటకు చెందిన సుబ్బమ్మ అనే ఒకావిడను ప్రశ్నిస్తే ఏం చెప్పిందంటే అది సుఖం కాదు బాబు వళ్లు బద్దకమని.
ఇక తాగుడు: గతంతో పోలిస్తే ఇప్పుడు మద్యం వినియోగం బాగా పెరిగింది. ఇది మన సంస్కృతిలో లేనిది. పండుగలు పబ్బాలకు కల్లు, కాచిన సారానే తాగేవాళ్లం. అదీ అరుదు. గిరిజన తెగలను మినహాయిస్తే మిగతావారు తాగితే అతన్ని తక్కువ భావనతో చూసేవారు. తాగుబోతని పిలిచేవారు. పిల్లనిచ్చేవారు కాదు. మరిప్పుడు దీనికి ఎవరూ అతీతులు కాదన్నట్లు మారిపోయింది. ప్రభుత్వాలకు డబ్బులు కావాలి, జనం నాశనమైనా పర్వాలేదు. ఆ వచ్చిన డబ్బులతో వారికి అభివృద్ధి చేస్తారట. తాగుబోతుల కుటుంబాల్లో ఇల్లాలు, పిల్లలు పడే బాధలు ఇప్పటి నేతలకు ఎలా అర్థమవుతాయి.వారు పడే నరకయాతనను ఎలా విలువ కడతారు.
షేక్ ఫయాజ్ బాషా, నెల్లూరు
నైటీలే అసలుకు ఎసరు ఆర్టికల్ చాలా బాగుంది. పాశ్చాత్య సంస్కృతికి పట్టణాలే కాదు, పల్లెలుకుడా అలవాటుకు లోనుకావడం విచారకరం. మన సంష్కృతి సంప్రదాయాలకు ప్రపంచ దేశాలు నీరాజనాలు పడుతుంటే, మన వాళ్ళు మాత్రం విదేశీ మోజులో పడి,ఇదే అభివృద్ధి అని భ్రమలో కాలం గడుపుతూ, నీచ సంష్కృతికి నిదర్శనంగా నిలవడం విచారకరం. ధన్యవాదములు.
Comments are closed.