నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రించేంత వరకు మనం ఎన్నో రకాల వస్తువులు, సేవలు ఉపయోగిస్తుంటాం. తమనం వాటికి వినియోగదారులం. తల్లి గర్భంలో ఊపిరి పోసుకున్నప్పటి నుంచి సమాధిలో నిదురించే జీవిత కాలమంతా ప్రతి మనిషి వినియోగదారుడే! గతంలో ‘కొనుగోలు దారుడా జాగ్రత్త!’ అనే హెచ్చరిక ఉండేది.
అమ్మేవారు ఏమిచ్చినా జాగ్రత్తగా కొనవలసిన బాధ్యత వినియోగదారునిపై బాధ్యతగా ఏకపక్షంగా ఉండేది. 1962 మార్చి 15న ఆనాటి అమెరికా అధ్యక్షుడైన జాన్ ఎఫ్.కెనడీ ఆ దేశ పార్లమెంట్‌లో వినియోగ దారుల హక్కులను ప్రకటించారు. తదనంతరం వినియోగదారుల చట్టం అమెరికాలో తయారైంది. ఆ మార్చి 15వ తేదిని ‘ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం’గా 1983 నుంచి పాటిస్తున్నారు. ‘కన్సూమర్ ఇన్టర్నేషనల్’ పేరిట ఉన్న వినియోగదారుల సంఘాల ప్రపంచ స్థాయి ఫెడరేషన్ వారు వినియోగదారుల హక్కుల ప్రచారం నిర్వహిస్తున్నారు. భారతదేశంలో వినియోగదారుల పరిరక్షణ చట్టం, 1986 అమలులో వుంది. ఈ చట్టం క్రింద జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో జిల్లా ఫోరముల, రాష్ట్ర, జాతీయ కమిషను ఏర్పాటు చేయబడి వినియోగదారుల ఫిర్యాదుల్ని విచారించి పరిష్కరిస్తున్నాయి.