‘స్వరాజ్య’ ఎడిటర్‌  ఖాసా సుబ్బారావుకు విలువలే ఊపిరి 

0
476

గూడూరు, పున్నమి విలేఖరి ( షేక్‌ రసూల్‌ అహ్మద్‌)
గాంధేయవాది నిష్కళంక దేశభక్తుడు విలువలే ప్రాధాన్యంగా జీవించిన పత్రికా సంపాదకుడు ఖాసా సుబ్బారావు నెల్లూరు నెల్లూరు జిల్లా కావలిలో 1896 జనవరి 23వ తేదీన జన్మించారు. సర్వేపల్లి రాధాక ష్ణన్‌ పని చేస్తున్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్రం అభ్యసించి పట్టభద్రుడై నారు. తర్వాత కొంతకాలం ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయులుగా పని చేశారు. ఆ తర్వాత పల్లెపాడు లోని ఆశ్రమంలో ఉంటూ మహాత్మా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ స్వాతంత్ర సమరంలో పాల్గొని అనేకసార్లు జైలు శిక్షను కూడా అనుభవించారు.శాసనోల్లంఘన ఉద్యమంలో పోలీసులు లాఠీలతో దారుణంగా కొట్టిన సందర్భంలో ఆయన స్ప హ తప్పి పడిపోవడం జరిగింది. ఈ అంశం తీవ్ర దుమారం రేపి చివరకు బ్రిటీష్‌ పార్లమెంటు లో ప్రస్తావనకు వచ్చి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసా సుబ్బారావును కలిసి పోలీసు దుర్మార్గపు చర్యలను ఖండిస్తూ ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదిక ఫలితంగా అప్పటివరకు లాఠీలకు ఉండే లోహపు పిడిలను మొదటిసారిగా తొలగించడం జరిగింది.
ఇలా స్వరాజ్య పోరాటంలో సుబ్బారావు పాల్గొంటూ ఓసారి జాతీయ భావాల ప్రచార కార్యక్రమంలో భాగంగా మద్రాసులోని స్వరాజ్య పత్రిక కార్యాలయానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు ఖాసా సుబ్బారావు గారి లోని దేశభక్తిని గమనించి తన బదులు స్వరాజ్య పత్రికలో సంపాదకీయం రాయడానికి సుబ్బారావును కోరారు.అది మొదలు సుబ్బారావు గారు పత్రికా లోకంలో తన వైభవాన్ని విశేషంగా చాటుకున్నారు. భాష, భావవ్యక్తీకరణ, స్పష్టత, నిర్భీతి ఇలాంటి సుగుణాల వల్ల సుబ్బారావును పాఠక లోకం విశేషంగా అభిమానించింది. ఇలా ఖాసా సుబ్బారావు చివరకు జర్నలిజం లోనే స్థిరపడిపోయారు. చక్రవర్తి రాజగోపాలచారితో సహా అనేకమంది ఆయన కలం పోటుకు గురి అయినా ఆయన్ని అభిమానించడంలో ముందుండేవారు.స్వరాజ్య పత్రికకు సహాయ సంపాదకుడిగా 1924 నుంచి 1936 దాకా పని చేశారు. కోల్కతా నుంచి వెలువడే ఇండియన్‌ ఫైనాన్స్‌ మరియు ముంబై నుంచి వచ్చే ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌ కు సహాయ సంపాదకులుగా పని చేశారు.1940 లో ఇండియన్‌ ఎక్స్ప్రెస్‌ పత్రిక లో జాయింట్‌ ఎడిటర్‌ గా తర్వాత మెయిన్‌ ఎడిటర్‌ గా పని చేయడం జరిగింది. తెలుగులో ఆంధ్రప్రభ కు వీరు తొలి సంపాదకులుగా పనిచేశారు. 1946లో స్వతంత్ర వార పత్రిక ప్రారంభించారు. మధ్యలో ఆగిపోయిన స్వరాజ్య పత్రికను తిరిగి ప్రారంభించి మూడేళ్లు నడిపి తర్వాత వేరొకరికి అప్పగించారు.
ఇలా తన సంపాదకీయాలతో పాఠకలోకాన్ని విశేషంగా ఆకట్టు కొనడమే కాకుండా ఆలోచనాత్మకమైన విశ్లేషణలతో ఖాసా సుబ్బారావు గారు రాసిన ”సైడ్‌ లైట్స్‌” అనే శీర్షిక ఆయనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. తన జీవిత చరమాంకం వరకు నైతిక విలువలతో జీవించిన ఖాసా సుబ్బారావు గారు 1961 జూన్‌ 16 వ తేదీన మరణించారు.