శిల్పకళా శోభితం – మల్లాం దేవాలయం

0
1052

ఆంధ్ర రాష్ట్రంలోని శిల్పకళా వైభవానికి నిదర్శనంగా ఉన్న దేవాలయాల్లో మల్లాంలోని సుబ్రమణ్య దేవాలయం ఒకటి. ఈ గుడి నెల్లూరు జిల్లాలోని చిట్టమూరు మండలంలో వెలసి గూడూరుకు తూర్పున 50 కి.మీ. దూరంలో బంగాళాఖాతానికి దగ్గర్లో ఉంది. మల్లాంగా సంస్కృతీకరించబడ్డ ఈ ప్రాంతం మొదట్లో తిరువాన్బూరుగా తరువాత తిరుగుడుమల్లాంగా, తిరుమూరు మల్లాంగా ప్రసిద్ధికెక్కింది. పల్లవులు తమ శాసనాల్లో ఈ గ్రామాన్ని తిరువాన్బూరుగా ప్రకటించారు. శిల్పకళా వైభవానికి పరాకాష్టగా ఇక్కడ చెక్కబడిఉన్న రాతిరధ నిర్మాణం ఇద్దరు శిల్పుల మధ్య భేదాభిప్రాయానికి గుర్తుగా ఇద్దరు శిల్పులు ఉత్తర, దక్షిణ దిశల్లో రధం ముందు భాగాన్ని చెక్కారు. ఉత్తర దిశ శిల్పి, దక్షిణం వైపు రథం ఇరుసుల్ని పీకి, గుర్రం ముంగాళ్ళు నరికాడట. రథం తిరగబడి తిరుగుడు మల్లాం అయ్యింది.

మరో కథనం ఏమిటంటే సుబ్రహ్మణ్యస్వామికి కంచిలో ప్రేయసి ఉండేది. అక్కడికి తాను వెళుతుంటే శివుడికి కోపం వచ్చి రథం చీలలు పీకించి వేసాడు. రథం తిరగబడింది. అందువల్ల తిరుగుడు మల్లాం అయింది. మరో కథనం ప్రకారం తారక, పద్మాసుర, మాల్లాసుర, కొల్లాసుర, రాక్షస సంహారం తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తుండగా చుట్టూ వెదురు చెట్లు పెరిగాయి. అప్పటి చాళుక్యరాజు పాండ్య భూపతి తన పల్లకికోసం వెదురుల్ని నరకమనగా , సైనికులు వెదురుతో పాటు సుబ్రహ్మణ్యుడి రెండు చేతులు నరికారు.గాయపడ్డ స్వామి ఆగ్రహానికి గురైన పాండ్య భూపతికి కళ్ళు పోయాయి. తన తప్పు తెలుసుకొన్న భూపతి ఇక్కడ ఆలయం కట్టించి, పోయిన తన కళ్ళను తిరిగి పొందాడని పురాణ కథ ప్రచారంలో ఉంది. ఇలాంటి కథలు చాలానే ఉన్నాయి.

ఇలాంటి పురాణాలు పక్కనపెట్టి నిశిత పరిశీలనతో శోధించినపుడు ఈ ప్రాంతం ఒక్కప్పుడు వైభవోపేతమైన ప్రసిద్ధ వాణిజ్యక్షేత్రంగా, జైనులకు కేంద్రంగా ఉండేదని తెలుస్తుంది. శాతవాహన కాలంలో ఇక్కడి సముద్ర తీరప్రాంతం నుంచి చిన్న చిన్న కాలువల ద్వారా సరకు రవాణా జరుగుతూ అందులో జైనుల పాత్ర ప్రముఖంగా ఉండేది. ఈ ప్రాంతం చుట్టూ ఉన్న కాలువలతో పాటు ఒకప్పుడు పెద్ద మట్టి కోట కాలగర్భంలో కలిసిపోయిన ఆధారాలు ఈ ప్రాంతం వ్యాపార కూడలిగా ఉండిందనడానికి అవి తిరుగులేని సాక్షాలుగా చెప్పవచ్చు. ఈ వాదనకు బలం చేకూర్చుతూ ఇటీవల భారతీయ కేంద్ర పురావస్తు బెంగళూరు శాఖ అధికారి శ్రీలక్ష్మి గారి, ఆధ్వర్యంలో గొట్టిప్రోలు గ్రామంలో జరుగుతున్న తవ్వకాల్లో నౌకాశ్రయ ఆనవాళ్లు బయటపడినవి. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు నౌకా వాణిజ్యంతో విరాజిల్లందని ప్రముఖ కేంద్ర పురావస్తు తెలుగు శాసన విభాగ అధిపతి ఎం.ఏసుబాబు గారు స్పష్టం చేశారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు డి.డి. కోశాంబి వెల్లడించినట్టు ప్రసిద్ధ వాణిజ్యకూడళ్ళన్నీ దేవాలయా ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఈ ప్రాంతం ఇందుకు మినహాయింపు కాదు. కోశాంబి చెప్పినట్టు ఆహారసేకరణ దశనుంచి వ్యవసాయ దశలోకి మార్పు చెందే క్రమపద్ధతిలో గ్రామనిర్మాణం కలిగి ఉంది. నాలుగువైపులా చక్కని వీధులు, తూర్పు- పడమర వీధులను కలుపుతూ మధ్యన రెండు సమాంతర వీధులను కలిగి ప్రాచీన గ్రామ వ్యవస్థకు అద్దం పట్టినట్టు అనగా 2 వేల సంవత్సరాల క్రితం నాటి వర్తక కేంద్రమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. గ్రామం చుట్టూవున్న అగడ్తకు, గ్రామాన్ని దేవాలయాన్ని కలుపుతూ ఒకే దారి వుంది. ఈ అగడ్తకు చాలానే కథలున్నాయి. ఈ ఆలయ నిర్మాణానికి కావలసిన రాయి ఇక్కడ లేకపోవడంతో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆదేశం మీదట గ్రామం చుట్టూ తవ్వగా ఆలయనిర్మాణానికి కావలసిన రాయి దొరికిందని, ఆ రాయి తీసిన ప్రదేశమే యీ అగడ్తగా మొదటి కథ ప్రచారంలో ఉంది. మల్లాసుర, కొల్లాసురులు కోట నిర్మించుకొని శత్రువుల బారినుండి తమను తాము కాపాడుకొనేందుకు తవ్విన అగడ్త అని మరొక కథ ప్రచారంలో ఉంది. వాస్తవానికి ఇదొక చారిత్రక ప్రదేశంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఎప్పుడో సెలవిచ్చారు.



ఇక శాసనాల ఆధారంగా క్రీ .శ . 907 – 953 లో పల్లవుల ఆధీనంలోని నెల్లూరు నుంచి కంచివరకుగల ప్రాంతం మొదటి పరాంతకుడి పాలనకిందకు వచ్చింది. ప్రస్తుత ఆలయ నిర్మాణం క్రీ .శ . 13 వ శతాబ్దిలో జరిగినట్టు చరిత్రకారులు వెల్లడించారు. దాదాపు 100 శాసనాల దాకా ఉన్న ఈ ప్రాంతంలో అన్ని తమిళ శాసనాలే. ప్రముఖమైనవి మూడవ రాజరాజు కాలానికి చెందినవి 11 శాసనాలు, మూడవ కుళోత్తుంగ రాజువి 5 శాసనాలు. మూడవ కులోతుంగ కాలంలో క్రీ.శ . 1178 – 1216, మొదటి మనుమసిద్ధి తమ్ముడు నల్లసిద్ధి, ఆ తర్వాత అతని తమ్ముడు తమ్ముసిద్ధి, క్రీ.శ. 1204 -08 కాలంలో ఆలయ అభివృద్ధి జరిగింది. నెల్లూరు పాలకుడైన ఎర్రసిద్ధి 1105 – 18, తిక్క 1219 – 1248, గండగోపాల (తిరుకాలత్తిదేవ) కాలంలో ఆలయ అభివృద్ధికి కొన్ని పనులు చేపట్టారు. విజయ గండగోపాలుడి ( 1250 – 1285 ) శాసనం ఒకటి ఈ ఆలయంపై వుంది, తర్వాతి నవీన శాసనం క్రీ. శ. 1314 – 15 కి చెందినది. ఇక ధూపదీప నైవేద్యాలకు దేవాలయానికి 110 ఎకరాల మాన్యం కూడా కలుగచేసారు.



ఇక ఆలయానికొస్తే సువిశాలమైన ప్రాంగణము, ప్రహరీ ఉన్నాయి. ఈ ఆలయంలో బలిపీఠం, ధ్వజస్థంభం, మహా మండపం, ముఖ మండపం, ప్రదక్షిణం, అంతరాళం, గర్భగుడి ఉన్నాయి. శైవ, వైష్ణవ విగ్రహాలను బట్టి ఇక్కడ రెండు కల్ట్ ల మధ్య జరిగిన ఆధిపత్య పోరుకు సాక్షాలుగా విగ్రహాలున్నాయి. అద్భుత శిల్పకళా పాటవానికి ప్రతీకగా శతస్తంభ మండపం అలరాలుతోంది. ఉత్తర, దక్షిణ దిశల్లో రథ చక్రాలను, గుర్రాలను మలిచారు. చోళ వాస్తుకళకు చక్కటి ప్రతిబింబమే ఈ శతస్తంభ మండపం. విఘ్నేశ్వర, ఉమామహేశ్వర, నరసింహ, సదాశివ, యోగనారసింహ, వేణుగోపాల, లక్ష్మి సమేత వరాహమూర్తి తదితర విగ్రహాలతో పాటు కాలక్రమంలో చుట్టుపక్కల దొరికిన విగ్రహాలన్నీ ఇక్కడ వున్నాయి.



ప్రతి సంవత్సరం భాద్రపదశుద్ధ పౌర్ణమికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. లోక సంరక్షణ కొరకు కుమారస్వామి మల్లాసుర, కొల్లాసురులను సంహరించిన రోజునే ఉత్సవం జరుగుతుంది. ఆ పౌర్ణమి నాటి ఉత్సవాన్ని కొర్ల ఉభయమంటారు. అరకొర సౌకర్యాలున్నప్పటికీ ఈ ఉత్సవాలలో భక్తులు పోటెత్తుతారు.
ఒకప్పుడు వెంకటగిరి జమీందారిలో భాగమై వారి ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఈ ఆలయం ఉండేది. జమీందార్లకు వ్యతిరేకంగా జరిగిన రైతుల సమావేశాలకు, ఆనాటి తిరుగుబాటులకు ఈ దేవాలయం సాక్షిభూతమైంది. 1930 సంవత్సరంలో ఒకేసారి 10 వేలమంది రైతులు ఈ దేవాలయ ఆవరణంలో గుమికూడి సమావేశాలు జరపడం అప్పట్లో సంచలనం సృష్టించి దేవాలయ ఇమేజ్ ని మరింత పెంచింది. అంతటి విశాలమైన దేవాలయ ఆవరణలోని ధ్వజస్థంభం, అతిపెద్ద గోపుర ముఖ ద్వారం 1927 నవంబర్ 1 వ తేదీనాటి పెద్ద గాలివానకు పడిపోయింది. పడిపోయిన ధ్వజస్తంభాన్ని కోయించి తలుపులకు వాడుకొన్నారు. మనవాళ్ల చారిత్రక తెలివి ఏపాటిదో ఈ సంఘటనతో మనకు అర్ధం అవుతుంది. అంతటి ఘనులు మన వాళ్ళు. ఏదిఏమైనా ప్రజల ఆశ్రద్ధో, ప్రభుత్వ తెలివి తక్కువతనమో తెలియదు కాని ఇప్పుడిప్పుడే మల్లాం దేవాలయం యొక్క శిల్ప సంపద పట్ల అవగాహన ఏర్పడటం శుభపరిణామంగా పేర్కొనవచ్చు.