ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ ను మళ్ళీ మొదలుపెట్టిందా ? టీడీపీ నేతలను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆ పార్టీని మరోసారి ఆత్మరక్షణలో పడేసేందుకు ముఖ్యమంత్రి జగన్ మాస్టర్ ప్లాన్ చేశారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అందుకు కారణం తాజాగా టీడీపీ నేత, మాజీమంత్రి శిద్దా రాఘవరావు వైసీపీలో చేరడమే. పార్టీ మారడంతో తెలుగుదేశం పార్టీకి ప్రకాశం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇప్పటికే కదిరి బాబురావు వైసీపీలో చేరారు. ఇప్పుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు, మాజీమంత్రి శిద్దా రాఘవరావు టీడీపీకి గుడ్ బై చెప్పి సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం టీడీపీ రాజకీయాల్లో కలవరం మొదలైంది.
శిద్దా రాఘవరావు మంచి వ్యాపారవేత్త. వ్యాపారరంగంలో ఎంతో అనుభవం సంపాదించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి నుంచి చంద్రబాబుతో శిద్ధా రాఘవరావుకు ఎంతో అనుబంధం వుంది. పార్టీ ఆయనకు మంచి గుర్తింపును కూడా ఇచ్చింది.పొలిట్ బ్యూరో సభ్యుడిగా, టీడీపీ జాతీయ కోశాధికారిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపధ్యంలో శిద్దా టీడీపీని వీడి వైసీపీలో చేరడం పార్టీకే కాకుండా చంద్రబాబుకి పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. శిద్దా రాఘవరావు 2014లో దర్శి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు మంత్రి పదవిని కట్టబెట్టారు. రవణా, రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆయన నెల్లూరు జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు. 2019లో మాత్రం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఒంగోలు ఎంపీ స్థానంలో బరిలో శిద్దా నిలిచారు. ఎన్నికలకు ముందే టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి పోటీగా నిలబెట్టారు చంద్రబాబు. చంద్రబాబు మాటకు కట్టుబడి పోటీలోకి దిగిన ఆయన మాగుంటకు గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు. అయినా పార్టీ ఆయనకు సముచిత స్థానాన్ని ఇచ్చింది.
ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా సరే ఆపరేషన్ ఆకర్ష్ ని మొదలు పెట్టడం సహజమే. నయానో… భయానో… ప్రతిపక్ష నేతలను తనవైపుకి తిప్పుకోవడం, ప్రత్యర్ధులు లేకుండా చూసుకోవడం ఏ పార్టీకైనా వెన్నతో పెట్టిన విద్యే. అలాగే శిద్దా రాఘవరావును కూడా వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగానే తీసుకునట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లాలో గ్రానైట్, సిలికా, బైరటీస్, సున్నపురాయి, పలకలకు సంబంధించిన గనులు ఉన్నాయి. టీడీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉన్నాయి. ఇందులో శిద్దాకు భాగస్వామ్యముంది. వైసీపీ అధికారంలోకి రావడంతో గ్రానైట్ తవ్వకాలలో పాల్గొన్న టిడిపి నాయకుల చుట్టూ ఉచ్చు బిగించేసింది. అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కుపాదం మోపడంతో ఆయన తలొగ్గక తప్పలేదు. ప్రస్తుతం తన వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటానికి శిద్ధా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట.