(పున్నమి ప్రతినిధి గూడూరు) : నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంది. కాలక్రమంలో పరిస్థితులను బట్టి అనేక కొత్త దేవతలు వెలిసి పాత కొత్త మేలుకలయిక వల్ల ఎవరు ముందు ఎవరు వెనుక నిర్ణయించడం కాస్త కష్టంగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ వెంకటిగిరిలోని కలిమిలమ్మ గ్రామదేవతే అని చెప్పవచ్చు.
ఈ కలిమిలమ్మను నేడు కలివేలమ్మగా కూడా భక్తులు కొలుస్తుంటారు. పూర్వం యతిరాజు తిమ్మరాజు అనే గొబ్బూరి వంశస్థుల వారి హయాంలో కలిమిలమ్మ ప్రాచుర్యంలో ఉండేది. అప్పుడు ఈ ప్రాంతాన్ని వెంకటగిరి అని కాకుండా కలిమిలి అనేపేరుతో పిలిచేవారు. వెలుగోటివారు 1628 లో గొబ్బూరి వంశస్తులను ఓడించి కలిమిలిని (వెంకటగిరి) ఆక్రమించి ఆప్రాంతాన్ని వెంకటగిరిగా పేరుమార్చారు. ఈగొబ్బూరి కులదైవం ఐన కలిమిలమ్మ దేవాలయం నేడు కైవల్యగా పిలవబడుతున్న గుంటిమడుగు నదికి దగ్గర్లో ఉండేది. అలాగే వెలిగొండలలో ఉన్నదుర్గంపైన కూడా కలిమిలమ్మఅనే ఆలయం ఇంకొకటి కూడా ఉండేది. ఈదేవతల పేరుతోనే ఈప్రాంతానికి కలిమిలి అని పేరు వచ్చిఉండొచ్చు. వెలుగోటి రాజు అయిన వెంకతపతి నాయుడు హయాంలో ఈ ప్రాంతము వెంకటగిరిగా మారినట్టు తెలుస్తోంది. అయితే ఈ గ్రామదేవత ఏ కాలానికి చెందినది ఎవరి ప్రాతినిధ్యం కింద ఉండిందో తెలుసుకోవడానికి కావలసిన ఆధారాలు 205 సంవత్సరాయలు క్రితం అగ్నికి ఆహుతి అయినట్లు మెకంజీ స్థానిక చరిత్రలో (కైఫీయతుల్లో) రికార్డు అయివుంది.
మెకంజీ కైఫీయతులో ఈ కలిమిలమ్మకు సంభందించి ఒక ఆసక్తికరమైన విషయం ప్రస్తావించబడి ఉంది.
వెంకటగిరి కోటకు ఎదురుగా ఉన్న కలిమిలమ్మ దేవాలయంలో మొదట్లో దారు ప్రతిమ ఉండేదట . ఈ ప్రతిమనే భక్తులు కొలిచేవారు. 1815 వ సంవత్సరంలో దేవాలయ పూజారికి కలలో కన్పించిన కలిమిలమ్మ తాను వెంకటగిరిని వదిలి వెళుతున్నానని చెప్పిందట. ఆ మరుసటి రోజే కలిమిలి ఆలయంలో నిప్పంటుకుని దేవతావిగ్రహం చాలా వరకు కాలిపోయింది. దీన్ని అరిష్టంగా భావించిన ప్రజలు, జమీందార్లు పూజాదికాలు నిర్వహించి పాత ప్రతిమ స్థానంలో కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని మెకంజీ గుమస్తా నారాయణరావు రికార్డు చేయడం జరిగింది. ఇప్పుడున్న విగ్రహం బహుశా కొత్తది కావచ్చు. మరియు ఎలాంటి పురాతన సాక్ష్యాలు అక్కడ లేకపోవడంతో కలిమిలమ్మను గురించిన సరియైన ఆధారాలు లేకుండా పోయాయి. దీంతో కలిమిలమ్మ ఏ కాలానికి చెందిందో చెప్పడానికి వీలు లేకుండా పోయింది. రాజుల జమానాలో వైభవోపేతంగా వెలిగిన కలిమిలమ్మ కాలక్రమేణా తన వెలుగులను కోల్పోయింది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లు కాలక్రమంలో వెంకటగిరి పోలేరమ్మకు ప్రాధాన్యం పెరగడంతో కలిమిలమ్మ దేవత వైభవం మరుగున పడిపోయింది.