కొద్దిసేపటి క్రితం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సి-47ను రోదసిలోకి దిగ్విజయంగా పంపింది. శాస్త్రవేత్తల ఉత్కంఠకు తెరదించుతూ నిర్ధిష్ట లక్ష్యం వైపు దూసుకెళ్లింది. వినువీధుల్లో ఇస్రో ఘనకీర్తిని చాటింది మన పిఎస్‌ఎల్‌వి సి-47 రాకెట్.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో గగన కీర్తిని తమ ఖాతాలో వేసుకొంది. అచ్చొచ్చిన వాహక నౌక పిఎస్‌ఎల్‌వి నుంచి సి-47 రాకెట్ కొద్దిసేపటి క్రితం నిప్పులు చెరుగుతూ నింగిలోకి వెళ్లింది. నిర్ధిష్ట కక్ష్యలో చేరింది. అత్యాధునిక రెసల్యూషన్ కలిగిన కెమెరాలతో భూవాతావరణ పరిస్థితులను 0.28 మీటర్ల కంటె మెరుగైన రెసల్యూషన్‌లో ఫోటోలు తీసే కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని నిర్ధిష్ట సమయంలో నిర్దేశించిన కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 12 నానో శాటిలైట్లను మన పిఎస్‌ఎల్‌వి వాహక నౌక రోదసిలోకి పంపింది.
భారత సమాచార సాంకేతిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే కార్టోశాట్ – 3 ఉగ్రహం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తల్తో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. దేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు జాతీయ అంతర్జాతీయ ప్రముఖుల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రసంశలు కురుస్తున్నాయి. ఇస్రో శాస్త్రవేత్తల ఘనకీర్తిని సర్వత్రా కొనియాడుతున్నారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇమిడివుండే కార్టోశాట్-3 దేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది. ప్రత్యేకించి భారత సైన్యానికి అభివృద్ధి ప్రణాళికలకు ఈ ప్రయోగం దిక్సూచిగా మారనుంది. దాదాపు 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన స్లోక్-4పి అనే నానో ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనేమరో బుల్లి ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి సి-47 దిగ్విజయంగా కక్ష్యలోకి పంపింది. దాదాపు పదేళ్లపాటు ఈ ఉపగ్రహం భారతదేశానికి అత్యంత విలువైన సమాచారాన్ని అందించనుంది.