వాలంటీర్లను కట్టడి చేయండి: టిడిపి

0
246

వాలంటీర్లను కట్టడి చేయండి: టిడిపి

వెంకటాచలం, ఏప్రిల్ 15 (పున్నమి విలేఖరి):

నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వలంటీర్లను కట్టడి చేయాలని నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. గురువారం వెంకటాచలంలో సర్వేపల్లి నియోజకవర్గ ఏఆర్వో దినేష్ కుమార్ ని కలసి వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా నగదు పంపిణీ చేస్తున్నారని,వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల కమిషన్ ఎన్ని నిబంధనలు విధించినా అధికారులు అమలు చేయలేకపోతున్నారని మండిపడ్డారు.
వైసీపీ కరపత్రాలు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వలంటీర్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోకుండా అభ్యంతరాలు తెలిపిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్న వలంటీర్లను కట్టడి చేయందే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగే పరిస్థితి లేదన్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ముత్తుకూరు మండలం పొట్టెంపాడులో పోలింగ్ కు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పై సమస్యల పై ఏఆర్వో సానుకూలంగా స్పందించారని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. లేనిపక్షంలో తమ పార్టీ తరపున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు.