ఓరి దేవుడోయ్! ఎంతలా వెంతలా వెంతలావు! ఆమె ని చూసి ఆశ్చర్య పోయాడు ఆనంద రావు. అలా ఆశ్చ ర్య పోవడం అదే మొదటి సారి అతని జీవితంలో అంతలా ఎందుకా అశ్చర్య పోయాడంటే? అంతలావున్న ఆడదాన్ని చూడ్డం అదే మొదటిసారి అతని జీవితంలో ఓరినాయనోయ్ ! ఈవిడసలు మనిషేనా? అని అనుకోకుండా ఉండలేకపోయాడామెని చూస్తూ కానీ, రాక్ష సజాతి అనేది ఈభూమ్మీద అంతరించి పోయి చాలా కాలమైంది కాబట్టి, ఆమె మనిషేనని నమ్మక తప్పలేదతగాడికి
ఈమెతో పోలిస్తే కల్పనారయ్, ఐరన్‌లెగ్ శాస్త్రీ ఏపాటి? ఒక ‘పేద్ద’ తక్కెడ తీసుకుని ఒకవైపు ముగ్గురు ఐరన్‌లెగ్ శాస్త్రుల్ని వేసి, ఇంకోవైపు ఈమెని ఒక్క దాన్నే వేస్తే… అప్ప టికీ… ఆ ఊహనే నవ్వొచ్చేసిందతగాడికి.
అయినా ఎలాగో తమాయించుకున్నాడు. తను నవ్వడం ఆవిడగాని చూసిందంటే ఇంకే మన్నాఉందా? నన్నుచూసే నవ్వుతున్నావ్ గదూ? అని ఒక్క లెంపకాయగాని ఇచ్చిందో – నా ముఖం పచ్చడి కింద నలిగిపోదూ!
అట్టి ప్రమాదాన్ని శంకించినవాడై అతి కష్టం మీద నవ్యుని ఆపుకుని ఆమె మీదనుంచి దృష్టిని మరల్చు కోవడానికి ప్రయత్నించాడు ఆనందరావు.
అయినప్పటికీ దృష్టి మరలనని మొండి కేసింది ఏదైనా విచిత్రాన్ని చూస్తున్నప్పుడు చూపు మరల్చు కోలేక పోవడం సహజమే కదా !
అంతలో ఆమె అతనికేసి చూసింది.ఆమె తనవైపే చూస్తుండటం చూసి కంగారు పడ్డాడు ఆనందరావు. కానీ, అంతలోనే ఆమె ఆమె తననేం చేస్తుందిలే అని సరి పెట్టుకున్నాడు. తానామెను ఏమన్నా అంటే కదా, తననామె ఏమైనా చెయ్యడానికి? మనసులో సవాలక్ష, అనుకుంటాం ఆవి ఎదుటి వాళ్లకు వినిపించవు కదా!
అలా తనకి తానే సర్దిచెప్పుకుని, ధైర్యం తెచ్చుకుని ఆటోకి ఆనుకుని నిలబడ్డాడు ఆనంద రావు. పర్వతం కదిలొచ్చినట్టుగా ఆమె అతన్ని సమీపించింది.
‘‘ ఏమ్ ఆటో ! వస్తావా? ’’ శరీరం అంత లావుగా ఉన్నా కంఠం మాత్రం పాపం పీలగానే ఉంది.ఆ మాటవొస్తే పీలగా ఉం డటం కాదు- మృదు మధురంగా ఉంది.
ఇంత మధురమైన కంఠ స్వరమున్న ఈస్త్రీ మూర్తికి ఆ దేవుడింత లావు శరీరాన్ని ఎందు కిచ్చాడా ? అనుకున్నాడు బాధగా ఆనందరావు.
‘అబ్బే ! రానండీ ! అన్నాడు భయం భయంగా
ఆమెని తన ఆటోలో ఎక్కించుకుంటే ఇంకే మైనా ఉందా? బ్యాక్‌టైర్స్ రెండూ పగిలిపోవూ! బ్యాక్‌టైర్స్ అనే ఏముంది? సీటుతో సహామొత్తం ఆటోనే తుక్కు తుక్కు అయిపోయినా ఆశ్చర్యం లేదు.
‘‘ఏం? ఎందుకు రావు ? కావాలంటే మీటర్ మీద ఎంతో కొంత ఎక్స్‌ట్రా తీసుకో అందామె ఉదారంగా.
ఎక్స్‌ట్రా అంటే ఎంత ? యాభై ఇచ్చేను, వంద ఇచ్చేను, ఒకవేళ ఆటో తుక్కుతుక్కుయి పోతే – ఆ యాభై, వందలతో తిరిగి బాగవు తుందా? అసలే బ్యాంక్‌లోన్ కూడా తీరలే దింకా
అదేమాట పైకి అంటే బాగుండదు కాబట్టి, అసలు అనేంత ధైర్యం కూడా లేదు కాబట్టి – అహ అది కాదు మేడమ్ ! బండి రిపేరులో ఉంది ’’ అని బొంకేశాడు చటుక్కున
అలాగే అన్నట్టు తల పంకించి, ఓ మారు నిట్టుర్చి ఆ మీదట అటు ఇటు చూసిందామె బహుశా ఇంకో ఆటో కోసం కావచ్చు.
‘మా బాగా చూస్తూన్నావేలే గానీ .. తల కాయలో మెదడున్న ఏ వెధవయినా నిన్నసలు ఆటోలో ఎక్కించుకుంటాడా? అనుకున్నాడు ఆనందరావు మనసులో .విపరీతమైన స్థూల కాయంవల్ల నడివయస్కురాల్లా అనిపిస్తుందే తప్ప, నిజానికామె వయసు పాతికేళ్లలోపే
ఉంటుంది.
మెడలో మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు లేకపోవడం వల్ల ఆమె ఇంకా అవివాహితే అని గ్రహించిన వాడై- బాప్‌రే ! ఈమెను (కు) వరుడు (తగినవాడు) ఈ భూలోకంలో దొరుకుతాడా అసలు ? ఇతర గ్రహాలనుంచి తీసుకురావాల్నా ? అన్యగ్రహాల మీద ఇంత కన్నా లావుగా ఉండే వాళ్లు ఉండటం సులభవమే (!) కాబట్టి ఈమెకు గ్రహాంతర వివాహమే’ శరణ్యం అనుకున్నాడు ఆనంద రావు.
ఈ ఊహక్కూడా అతనికి నవ్వొచ్చేయ బోయింది గాని- ముఖాన్ని ముఖంలాగే ఉం చుకోవాలి తప్ప పచ్చడిగా మార్చు కోవటం మంచిది కాదన్న ఉద్దేశ్యంతో ఈసారి కూడా అతి కష్టమ్మీద ఆ నవ్వుని ఆపుకున్నాడు .
అంతలో… ఓ ముప్పమ్ ఏళ్లో వివాహిత మెరుపు తీగె అటుగా నడుచుకుంటూ వచ్చింది.
స్థూలకాయురాల్ని చూసి ‘‘నువ్వానీలిమా? అంటూ ఠక్కున నిలబడి పోయింది- ఆనందంగా !
ఆ ( నేనేనక్కా ! గుర్తు పట్టలేనంతగా మారిపోయాను కాదూ ? ‘‘అంది నీలిమ నా మధేయురాలైనట్టి సదరు స్థూలకాయురాలు
‘‘ అవున్నీలూ ! చాలా మారిపోయావ్’’ చాలా కాదూ. చాలా చాలా మారిపోయావ్’’ అంది మెరుపు తీగై స్థూలకాయురాలి కేసి నఖ శిఖ పర్యంతం ఆశ్చర్యంగా చూస్తూ.
‘‘ నువ్వో ఒక్కదానివే కాదక్కా ! ఈమధ్య నన్ను చూసి అందరూ ఇలాగే ఆశ్చర్య పోతు న్నారు. ఒక్క ఆరునెలల్లోనే ఇంత మార్పొచ్చే సింది నాలో….
‘‘అవును మరి ! ఆశ్చర్యపోకుండా ఎలా ఉండగలుగుతారు? ఆ నీలూ ఈనీలూ ఒక్కరే అంటే నమ్మడం కష్టం..వండర్ జరిగి నట్లుంది…
మెరుపు తీగె అలా అలా అంటుంటే స్థూలకాయురాలి మీద తెగ జాలివేసింది ఆనందరావుకి.
అంటే-పాపం ఓ ఆర్నెల క్రితం దాకా ఈ అమ్మాయి సన్నగానే ఉండేదన్నమాట ! ఈ మధ్యనే ఇలా లావైపోయిందన్న మాట ఇలా స్థూలకాయంతో బాధపడే బదులు డైటింగ్ చేసి సన్నబడొచ్చుగా ? అనుకున్నాడు ఆనం దరావు .
అతనలా అనుకుంటూ ఉండగా ఆ స్థూల కాయురాలు అంది ‘‘ఇదంతా నీ పుణ్యమే నక్కా! నువ్ చెప్పబట్టే నాకా ఒబెసిటీ సెంటర్ గురించి తెలిసింది లేకపోతే నేనందులో చేరి ట్రీట్‌మెంట్ తీసుకునుండేదాన్నా ? నేనిపుడు బరువు తగ్గి ఇంతిదిగా సన్నబడ్డగలిగానూ అంటే అది పూర్తిగా నీ చలవే ! ఇపుడు నా ప్రాణానికెంత హాయిగా ఉందో తెలుసా ?’’
ఆమె అలా మాట పూర్తి చేసిందో లేదో ‘ దభేల్ ’ మన్న శబ్దం వినిపించింది. ఏమిటో అని చూసేసరికి ఆటో ప్రక్కన స్పృహతప్పి పడి పోయున్న ఆనందరావు కనిపించాడా అతివ లిద్దరికీ.‘‘ పాపం మూర్ఛరోగి కాబోలు’’ అంది నీలిమ జాలిగా- ఆనందరావు వంక చూస్తూ ‘‘అవుననుకుంటా పాపం అంది మెరుపు తీగ అంతకన్నా జాలిగా.
కోలపల్లి ఈశ్వర్
నెల్లూరు.