పత్రికలు, టీవీలు, ఫేస్ బుక్ లు, వాట్సాప్ లలో విపరీతంగా చర్చ జరుగుతున్న అంశం ‘ కరోనా‘. ప్రస్తుతం ప్రతి నోట వినిపిస్తున్న మాట కూడా ‘కరోనా‘. కరోనా దెబ్బకి ప్రపంచమంతా అట్టుడికి పోతోంది. ఈ వ్యాది నివారణకు ప్రభుత్వాలు పాఠశాలలకు,సినిమాహాళ్ళకు మూతలు వేస్తుంటే ప్రజలు తమ మూతికి మాస్కులు వేసుకుంటున్నారు. మూతికి మా స్కూలు కట్టుకోవడం ప్రారంభంకాగానే వాటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూడు రూపాయలకు అమ్మే మాస్కు 60 రూపాయలకు కూడా దొరకడం లేదంటే మాస్కుల డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఈ మాస్కులు కరోనా వ్యాదిని నివారించ గలవా?.మాస్కులను కట్టుకోవడం అవసరమా? మాస్కు ల వల్ల ప్రయోజనం ఉందా? లేదా?.ఎవరు వాడాలి?ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అనే విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా మన ముందుకు వచ్చింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మరియు భారతీయ వైద్య పరిశోధనా మండలి జారీ చేసిన సూచనల ప్రకారం కరోనా నివారణ కొరకు దేశంలోని ప్రజలందరూ మూతికి మాస్కులు కట్టుకోనవసరం లేదు. వాటిని కట్టుకోవడం ద్వారా ఈ వ్యాది నుండి రక్షించుకోవచ్చు అనే అభిప్రాయంతో లక్షలాది మంది మూతికి మాస్కులు కట్టుకుంటూ అనేక రకాల వైరస్ లను కూడా తెచ్చు కుంటారు.
అది ఎలా అని అనుకుంటున్నారా?
ఒకసారి మాస్క్ కట్టుకున్న తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేతితో ఆ మాస్క్ ను తాకరాదు. మాట్లాడేటప్పుడు చేతితో మాస్కును కిందికి పైకి లాగడం చేస్తుంటారు.దీని వలన చేతికి అంటుకుని వున్న రకరకాల క్రిములను, వైరస్ లను మాస్కులకు అంటించుకుంటారు. ఇలా మాస్కులకు అంటుకున్న వైరస్ నోరు, ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరే ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి కట్టుకున్న మాస్క్ ఆరు గంటలు మాత్రమే పని చేస్తుంది. ఆ తర్వాత దాన్ని తీసివేసి వేరే మాస్కును వాడుకోవాలి కానీ సాధారణ ప్రజలు ఓకే మాస్కును రోజుల తరబడి వాడుతున్నారు . ప్రమాదాలను పెంచుకుంటున్నారు.ఇలా ప్రతి 6 గంటలకు ఒక మాస్క్ ను మార్చుకోవడం సాధారణ ప్రజానీకానికి వారి వృత్తి మరియు ఆర్థిక పరిస్థితి రీత్యా సాధ్యం కాదు.వ్యయ ప్రయాసలకు ఓర్చి కట్టుకున్నా రక్షణ ఉండదు.వీటికంటే తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
కరోనా రోగికి వైద్యం చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి, కరోనా వ్యాదిగ్రస్తుల శుభ్రతకు ఉపయోగపడే శానిటరీ సిబ్బందికి, దగ్గరుండి చూసుకునే సహాయకులకు కరోనా వ్యాది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారిని హైరిస్క్ గ్రూపు అంటారు. వీరు మాత్రం ఈ మాస్కులను తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే పేషెంట్ నుండి ఆ వైరస్ వీరికి సోకకుండా ఉండడానికి.
*పేషెంట్ కు సహాయకులుగా ఉండేవారు, పేషెంట్ ని పరామర్శించుటకు వచ్చే వారు కూడా మాస్క్ కట్టుకోవాలి.కరోనాతో బాధపడుతున్న రోగి తప్పకుండా మాస్క్ వాడాలి. రోగి మాస్కు కట్టుకోవడం వల్ల రోగికి ఉపయోగం ఏమీ లేదు కానీ అది సమాజానికి ఉపయోగపడుతుంది.తన నోరు మరియు ముక్కు నుంచి వెలువడే వైరస్ ను ఇతరులకు వ్యాపించకుండా ఈ మాస్క్ పనిచేస్తుంది.
సర్జికల్ మాస్కులని, రెండు లేయర్ల మాస్కులని, మూడు లేయర్ల మాస్కులని, N95 మాస్కులని అనేక రకాల మాస్కులు అందుబాటులో ఉన్నాయి. N95 మాస్క్ ఎక్కువ ఉపయోగం. కానీ వాటి ఖరీదు ఎక్కువ.
మాస్కులను వాడిన తరువాత తీసివేసే ఉత్తమ పద్ధతులను కొన్నింటిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అవి ఏమంటే:-
మాస్కును కట్టుకునే ముందు చేతులను సబ్బుతో గాని ఆల్కహాల్ తో కూడిన స్టెరిలైజర్ తో గాని 40 సెకండ్లపాటు శుభ్రం చేసుకోవాలి.
మాస్కును కట్టుకున్న తర్వాత దానిని ఎట్టి పరిస్థితులలోనూ చేతులతో పైకి కిందకి లాగడం, మాస్కును సర్దుకోవడం లాంటివి చేయకూడదు. మాస్కును ఎట్టి పరిస్థితిలో కూడా చేతితో తాకరాదు.ఏదయినాఅవసరమై మాస్కులను తాక వలసి వస్తే చేతులను తప్పనిసరిగా సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాతే తాకాలి.చేతులు శుభ్రం చేసుకోకుండా తాకితే ఆ మాస్కును తీసివేయాలి. అలా జరగకపోతే చేతికున్న క్రిములు మాస్కుకు అనవసరంగా పాకవచ్చు. దీని వల్ల వ్యాది సోకవచ్చు.
.మాస్కులు తీసేటప్పుడు దానిని వెనక నుండి తీసివేయాలి. మాస్కులు తీసివేసిన తర్వాత చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి.
వాడి తీసివేసిన మాస్కును ఎక్కడంటే అక్కడ వేయరాదు.దానిని ప్రత్యేకమైన వేస్ట్ బుట్టలో వేయాలి. తగలబెట్టడం కానీ భూమిలో పూడ్చిబెట్టడం కానీ చేయాలి. అలా చేయకపోతే ఈ మాస్కుల కారణంగా కరోనా వ్యాది మరికొందరికి వచ్చే అవకాశం ఉంది.
కరోనా నివారణకు ప్రజలందరూ మాస్కులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటివారు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయ్యే గాలి తుంపర్లు మన మొఖం మీద పడకుండా ఉండేందుకు మాస్కులు ఉపయోగపడుతాయి అనే భావనతో మాస్కును కట్టుకుంటారు.మాస్కుని సరైన పద్ధతిలో వాడకపోతే కరోన వైరస్ ని నిరోధించడం సాధ్యం కాక పోగా కరోనా వ్యాది వ్యాప్తి జరిగే అవకాశమే ఎక్కువ. మాస్కులను సరైన పద్ధతిలో వాడలేకపోతే మాస్కు లను వాడకపోవడం మంచిది. గంటకోసారి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం ద్వారా కూడా కరోనా వ్యాప్తిని నిరోధించగలం.
డాక్టర్ యం. వి. రమణయ్య
ప్రజారోగ్య వేదిక
రాష్ట్ర అధ్యక్షులు
9490300431