మళ్లీ వస్తాం..

    0
    138

    మళ్లీ వస్తాం..
    —————————-
    మేం నడిసెల్లి పోతున్నాం
    దుఖంతో,కోపంతో,ద్వేషంతో
    మేం మా పల్లె కెళ్ళి పోతున్నాం

    ఐదారేళ్ళ మా పిల్లలు,
    అరవై ఏళ్ల మా పెద్దలు,
    కడుపుతో ఉన్న మా ఆడాళ్ళు,
    చింకి పాతర్ల మా సామాను
    అన్నీ సర్దుకుని
    సాగెల్లి పోతున్నాం..

    కనికరం లేని మీ ముఖాన
    ఖాండ్రించి ఉమ్మేసి
    కన్నీళ్ళ తోనో,
    కాళ్ళ నొప్పుల తోనో,
    మేం కదిలెల్లి పోతున్నాం..

    నగరాలన్నీ నాగరిక మని,
    గ్రామాలన్నీ అనాగరికం అని,
    మీరు విర్రవీగుతారు కానీ,
    నిజం చెప్పండి.. ఏముందిక్కడ..

    విద్వేషంతో కడుపులో కుమ్మే
    మీ కత్తులు,త్రిశూలాల కంటే
    భూమిని చీల్చి అన్నం తీసే
    మా నాగలి గొప్ప..

    ఆడాళ్ళను బజారు సరుకు చేసి
    గుడ్డలిప్పిన మీ నగరాల కంటే
    పత్తి పండించే మా రైతులు గొప్ప
    బట్టనేసిన మా పల్లె మగ్గాలు గొప్ప

    బడికి పంపినా మా పిల్లలకు
    పాఠాలు చెప్పని మీ పంతుళ్ళ కంటే
    బతుకు పాఠాలు నేర్పిన
    మా అయ్యవ్వలు గొప్ప

    పేదలను పట్టించుకోని
    మీ ప్రగతి భవనాల కంటే
    కురుస్తున్నా,కూలుతున్నా
    కడుపులో పెట్టుకునే
    మా గుడిసె గొప్ప
    మా పల్లె తల్లి గొప్ప
    అంతెందుకు,
    మనుషుల్ని చంపే
    మీ మద్యం షాపుల కంటే
    చల్లని నీరా ఇచ్చే మా తాటి చెట్టు గొప్ప

    కరెన్సీ బాబుల కండకావరం
    మేం చూశాం కానీ,
    మీ మధ్య తరగతి
    మందహాసం కూడా
    మాకు అసహ్యమే..

    మా భుజాల మీదెక్కి
    పైకి ఎగ బాకాలనే యావ తప్ప
    మీరు క్రిందికి చూసిందెప్పుడు..
    మమ్మల్ని పట్టించుకున్నదెప్పుడు..

    వెలుగులు చిమ్మే మీ భవంతుల గోడ పక్క
    చీకట్లో మా వాడలుంటాయనీ,
    మేమక్కడ కిక్కిరిసి ఉంటామనీ,
    స్పృహ లేని పరాన్న జీవులు మీరు

    మీ అంట్లు తోమే ఆడ మనిషీ,
    మీ బంగ్లా కాపలా మనిషీ,
    మీ కారు తోలే డ్రైవరు,.
    మీ కార్ఖానలో కార్మికుడు,
    అంతటా, అన్నిటా మేమే కదా..

    మమ్మల్ని మీ సేవలు చేసే
    యంత్రాలుగా తప్ప,
    మనుషులుగా చూడరని
    మీ బంగ్లా కింద మా కోసం కట్టే రూమే చెబుతుంది.

    మీ లెక్కల మతలబు
    మాకు అర్థం కాదు కానీ,
    నిగ్గదీసి అడిగితే
    నిలువు గుడ్లేయడం తప్ప
    నిలబడి జవాబు చెప్పే
    నిజాయితీ ఉందా మీకు..

    మేము చెయ్యని దేమిటి..
    మీరు చేసిన దేమిటి..

    రోడ్ల వెంట మేము నాటిన
    మొక్కలు యెన్ని..
    రోడ్ల కోసం మీరు కూల్చిన
    చెట్లు యెన్ని..
    మీ బాగు కోసం మేము కార్చిన
    చెమట యెంత..
    అభివృద్ధి పేరిట మీరు పోసిన
    విషం యెంత..
    మీకోసం మేము కట్టిన భవంతులెన్ని..
    మీ ఆనందం కోసం
    మీరు కూల్చిన గుడిసెలు యెన్ని..

    కరెన్సీ నోట్ల వాసన మీకు ఇంపు
    కార్మికుల చమట వాసన మీకు కంపు

    తిండి పెట్టకుండా తరిమేస్తున్న నీతి మీది
    “తినిపో బిడ్డా” అని పిలిచే రీతి మాది

    మళ్లీ వస్తాం మేం..

    పట్నం లోనే ఆగిపోయిన
    మా పల్లె బిడ్డల కోసం,

    పగలూ రాత్రీ మాకోసం
    పరుగు లెత్తిన
    మంచి మనుషులు కోసం,

    ఈ సారి కన్నీళ్ళతో రాం..
    ప్రశ్నల కొడవళ్ళతో వస్తాం..

    కడుపు చేత పట్టుకుని రాం..
    కదన శంఖం పూరిస్తూ వస్తాం..

    పోగేసిన సంపదలో మా వాటా యెంత..
    హక్కుల పత్రంలో మా జాగా యెంత..

    – కన్నెగంటి రవి

    0
    0