మన పనిలో పరమార్ధం కనుక్కోవడం

0
112

(పున్నమి ప్రతినిధి) :
ఇప్పుడున్న కరోనా కష్ట కాలంలో, పనిలో ఉత్సాహం తెచ్చుకోవడం చాలా కష్టం అయి పోయింది! ఉద్యోగంలో ఉన్న వారికి (అది ప్రభుత్వోద్యోగం అయితే తప్ప!) అది ఎంత కాలం
ఉంటుందో తెలియదు. వ్యాపారం నడిపే వాళ్ళ పరిస్థితీ, అంతకు మెరుగ్గా ఏమీ లేదు! కనుగోలు దారులు తగ్గి పోయారు. సరుకు నిలవలు పెరిగి పోయాయి. సరుకు తీసుకున్న వాళ్ళు సమయానికి డబ్బు చెల్లించడం లేదు. మార్కెట్‌ ‌లో డబ్బులు లేవు. వ్యాపారం లాభ సాటిగా సాగినా సాగక పోయినా, జి ఎస్టి 18 శాతం కట్టక తప్పదు.ఇలా!
ఇలాంటి సమయంలో మన దైనందిక జీవితంలో ఉత్సా హం కొని తెచ్చుకుని పని చేయటం కష్టమే కానీ, అవసరం! మన పనిలో నాణ్యత తగ్గినా, మన ఉత్పాదక శక్తి తగ్గినా, దాని వల్ల మనకి కలిగే రిస్కు అధికం!
మనని ఉత్సాహపరిచే పరిస్థితులు బయట లేనప్పుడు, మనకి మనం మోటివేట్‌ ‌చేసుకోవడంలో చిన్న చిట్కాలు, ఈ వారం చూద్దాం.
చాలా మందిని అడిగాము . ‘‘మీ పనిలో ఏమి చూసి మోటివేట్‌ అవుతారు ? ‘‘ అని . ‘‘ ఆర్ధిక అవసరాలు, కుటుంబం నడుపుకోవడం కోసం, ఖర్చులు, అప్పులు, ఇఎమ్మైలు ‘‘ ఇలా చెప్పుకొచ్చారు . ఇవి అవసరాలే కానీ, ఇవి మనిషి కి ఉత్సాహం కలిగించ లేవు !
ఎలా కలగజేసుకోవాలో చూద్దాం .
ప్రపంచంలో ఎన్నో పనులు ఉండగా, ఇప్పుడు మీరు చేస్తున్న పని ఎందుకు ఎంచుకున్నారో ( కొన్ని సంవత్సరాల క్రిందట ) గుర్తు తెచ్చుకోండి! మరియు, మీరు చేసే పని చక్కగా చేయ గలిగితే, దాని వల్ల, మీరే కాక, ఇంకా ఎవరెవరు లాభపడతారో ఆలోచించండి.
ఒక వేళ మీరు సేల్స్‌లో ఉంటే, మీరు చేసే సేల్స్ ‌వల్ల కంపెనీ లాభాల బాట పట్ట వచ్చు . కొన్ని ఉద్యోగాలు, జీతాలూ, జీవితాలూ నిలబడవచ్చు. ఇదే విధంగా మీరు కష్టమర్‌ ‌సర్వీసులలో ఉన్నా, అకౌంటింగ్‌లో ఉన్నా, మీ పని చక్కగా కరెక్టుగా జరిగితే, దాని వల్ల ఎవరెవరికి లాభమో ఆలోచించండి !
‘‘ ఓహ్‌! ‌మన పని ఇంత ముఖ్యమా? ఇంతమందికి ఉపయోగమా అనిపించి, మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. కొత్త ఉత్సాహం వస్తుంది.
మీరు గత 15 ఏళ్ళుగా పని చేస్తూ, రిపీట్‌గా అదే పని చేస్తూ కొంత ఆసక్తి సన్నగిల్లుతోంది అనుకోండి. మీ సంస్థలో చేరిన కొంత మంది జూనియర్‌లకి కోచింగ్‌ ఇవ్వండి . వారి పనిలో పూనుకుని సహాయం చెయ్యండి . మీ అనుభవాలు పంచుకోండి. ఆ రోజు చిన్న తప్పు చేసి బాస్‌తో తిట్లు తిని మనసు చిన్న బుచ్చుకున్న జూనియర్‌ ‌సహోద్యోగిని టీకి తీసుకు వెళ్ళి ఉత్సాహ పరచండి, ఓదార్చండి . కెరీర్‌లో ఎవరైనా, తమ పై అధికారితో అక్షింతలు వేయించుకోని ఉగ్యోగి (ని) అసలు ఉండరని చెప్పండి. ఇది అంతా కామన్‌ అని చెప్పండి.

పనిలో వారి నైపుణ్యం పెంచడంలో సీనియర్‌గా మీ వంతు పాత్ర నిర్వహించండి. కెరీర్‌ ‌మొదటి లొ మనకి పని నేర్పించిన వారిని మనము మరిచి పోలేము!
ఇతరులకు సహాయం చెయ్యడం వల్ల మనకి పనిలో పరమార్ధం కనిపిస్తుంది.
ప్రపంచంతో కనెక్ట్ ‌కాకుండా ఉండ లేము. కానీ, మనం చూసే, చదివే వార్తలు, సోషల్‌ ‌మీడియాలో చదివే పాక్షిక వాస్తవాలు, అర్ధ సత్యాలు, అనవసర వాగ్యుద్ధాలు, ఇవన్నీ మన మనసు మీద నెగెటివ్‌ ‌ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడండి.

మీ పనికి సంబంధిన కొత్త కొత్త కోర్సులు, సర్టిఫికేషన్‌ ‌లు ఏమైనా చేయగలరేమో ఆలోచించండి. ఇప్పుడు యూడెమీ, అప్‌ ‌గ్రాడ్‌లాంటి సైట్‌ల వల్ల, వారం, 2 వారాల కోర్సులు కూడా లభ్యం .
ఈ మధ్యనే నా పనికి అనగా ఉద్యోగుల ట్రెయినింగ్‌కి , సంబంధించి యూడెమీలో ఒక వారం కోర్సు తీసుకున్నాను . రూ 800 మాత్రమే కట్టి . ఆ కోర్సులో నాకు సగం తెలిసిన విషయాలే అయినా, మరొక సగం పూర్తిగా కొత్త విషయాలు ! మీకు వీలున్న సమయంలోనే అధ్యయనం చేసేలా ఆన్‌ ‌లైన్‌ ‌కోర్సులను డిజైన్‌ ‌చేస్తున్నారు. మరియు, మీ కంపెనీ మీటింగు లలో చురుకుగా పాల్గొనండి. మీ అనుభవాన్ని ఉపయోగించి, మీ కంపెనీలో ఆదాయం మరికొంత ఎలా పెంచాలో, ఖర్చు మరి కొంత ఎలా తగ్గించాలో, కష్టమర్‌లని మరింతగా శాటిస్‌ ‌చేయడానికి ఇంకా ఏమేమి చేయ వచ్చో మీ యాజమాన్యానికి సూచించండి. ఇలా, నాకు తట్టని మరెన్నో ఆలోచనలు మీకు కూడా తట్ట వచ్చు . ఆలోచించండి. ఇప్పుడున్న కష్ట కాలంలో, దైనందిక పని జీవితం లో ఉతాహంగా పని చేయడం, మన పనిలో పరమార్ధం చూడడం, మన అందరికీ అవసరం.

0
0