మన ఉద్యోగం ప్రమాదంలో పడింది అని చెప్పడానికి 10 సంకేతాలు
(పున్నమి ప్రతినిధి) :
ఛా ఛా ఛా! ఎలా అయిపోయింది నా జీవితం!!? ఒక్క సంవత్సరంలో! ఎలాంటి ఆర్టికల్ రాయాలని మొదలు పెట్టినా, ‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ అని మొదలు పెట్టాల్సి వస్తుంది. ఈ ఆర్టికల్ కూడా!
‘‘అసలే ఈ కరోనా కష్టకాలంలో’’ ఎన్నో ఇండస్ట్రీలు, పారిశ్రామిక రంగాలు, ఐటీ నుంచి, తయారీ రంగం, నిర్మాణ రంగం మొదలైన వాటిలో పని మందగించి, లాభాలు తగ్గి, ఉద్యోగాల కోత ప్రారంభం అయింది. దీనికి ఎవరూ అతీతం కాదు! అయితే, వేటు మన మీద పడక ముందే, ఆ సంకేతాలు ఆ ‘కళలు’ మా తెలంగాణా భాషలో చెప్పాలి అంటే, ఆ ‘శకలు’ ఎలా ఉంటాయో ఈ వారం ఆర్టికల్‌లో చూద్దాం. వేటు పడక ముందే, మనం పెట్టే బేడా సర్ధుకుని మరో అవకాశం కోసం ప్రయత్నించడం కోసం.
కంపెనీ శకలు / పోయే కాలం వచ్చిన కళలు :
(1) సడన్‌గా బాసుల కఠినమైన భాష ఇంక్రిమెంటులు ఉం డవు. రివ్యూలు కర్కశంగా ఉంటాయి. బెదిరింపుల భాష ! ‘మరొక్క సారి ఇలాంటి తప్పు చేశావో’ భాష ! వారి పై అధికారులు వాడమన్న భాష.
(2) మెర్జర్ : మీ కంపెనీని ఇంకొక కంపెనీ కొనుక్కోవడం. ఇలా అయితే, కనీసం 40 శాతం మంది ఉద్యోగాలు పోతాయి. కానీ, మీ కంపెనీ, మరొక కంపెనీని కొనేస్తే, మీరు సేఫ్! మీకు ఏమీ కాదు!
(3) హఠాత్తుగా మానవ వనరుల శాఖ (హెచ్చార్)లో కొత్త వారిని, మరీ సీనియర్ పొజిషన్‌లో (అనగా, జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంటు) తీసుకోవడం. కంపెనీ నష్టాలలో ఉన్నా!
(4) హెచ్చార్‌లో కొత్త ముఖాలు కనబడితే, మన ఉద్యోగానికి గండమే ! మేకను నరకాలంటేనే కదా, కసాయి వారిని పిలుస్తారు?
(5) హెచ్చార్‌లో ఎక్కువ జూనియర్‌లని తీసుకుంటే, కంపెనీ ఎక్కువ మంది కొత్త వారిని తీసుకోవడానికి సిద్ధంగా ఉంది అని అర్ధం. మొదటి రౌండు ఇంటర్‌వ్యూలు, స్క్రీనింగ్ కోసం వీరిని తీసుకుంటారు.
(6) కానీ, కంపెనీ సంక్షోభంలో ఉన్నప్పుడు అనుభవజ్ఞులైన హెచ్చార్‌లని నియమించుకుంటే, అది నిలువునా నరకడానికే అని భావము. కత్తి మన మెడ మీద పడక ముందే మనం బయటి దిక్కు చూడడం మంచిది.
(7) కంపెనీలు కొత్త వారిని తీసుకోవడం (ఏ పొజిషన్‌లో నయినా) పూర్తిగా బంద్ పెట్టినప్పుడు. ఒక 2 సంవత్సరాలు ఒక్క కొత్త పురుగు కూడా కంపెనీలోకి రాలేదు ( బయటికి పొయ్యే వారు పోతున్నారు కానీ!), అంటే, మనకి గండం ఉంది అనే!
(8) ఎప్పుడూ లిబరల్‌గా ఉండే కంపెనీ వారు, ఖర్చుల మీద నియంత్రణ పాటించాలి అని సర్‌క్యులర్‌లు పంపినప్పుడు ! పెన్ను లు, జిరాక్సులు, పేపర్‌లు. కంపెనీ పొదుపు మంత్రాలు పఠించినప్పుడు. ప్రయాణించే సేల్స్ వారికి సెకండ్ ఏసీ కోసేసి స్లీపర్‌లో వెళ్ళాలి అనడం, తక్కువ బడ్జెట్ హోటల్‌లో ఉండమని చెప్పడం.
(9) ఆర్ధిక పరమైన సంకేతాలు : జీతాలు రావడం ఆలస్యం కావడం. బిజినెస్ ట్రావెల్ చేసిన వారి డబ్బులు రిఇంబర్స్ కావడంలో ఆలస్యం. మీ కంపెనీకి సరుకు అమ్మిన వారికి చెల్లింపులు లేట్ కావడం వగైరా..
(10) ‘‘కొంతమందిని తీసేస్తారట!’’ అంటు రూమర్‌లు వ్యాపింప జేయడం. వాటిని కంపెనీ ఖండించక పోవడం. మౌనం పాటించడం.
ఏదైనా ఒక్క సంకేతం ఉంటే భయపడే అవసరం లేదు కానీ, 3 లేక 4 సంకేతాలు కలిపి ఒక మూడు నెలల పాటు కనిపిస్తే, ప్రమాద సంకేతాలు అని అర్ధం. మరో ఉద్యోగం కోసం బయటి చూపులు చూడడం బెటర్, మన ప్రస్తుత ఉద్యోగం సిన్సియర్‌గా చేస్తూనే ! జీతానికి న్యాయం చెయ్యాలి కదా?