మతసామరస్యానికి చిహ్నం శ్రీ కృష్ణదాసుమఠం

0
185

(పున్నమి ప్రతినిధి గూడూరు): అవధూత కృష్ణదాసు స్వామి మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని ప్రముఖ పురావస్తు శాస్త్రజ్ఞులు ఏసుబాబు గారు చెప్పారు. శుక్రవారం నాటి సాయంత్రం గూడూరులోని రాణీపేట పరిసరాల్లో ఉన్న శ్రీకృష్ణదాసు మఠాన్ని దక్షిణ భారతదేశ పురావస్తు శాఖ, చెన్నై తెలుగు శాసన అధ్యయన విభాగానికి చెందిన అధిపతి ఎం.ఏసుబాబుగారు సందర్శించారు. మఠానికి చెందిన అరుణ్ కుమార్, సాయివరప్రసాద్ల అభ్యర్ధన మేరకు వారు తమ బృంద సభ్యులైన యుగంధర్, సత్యలతో  రావడం జరిగింది. వీరు మఠంలోని శాసనాన్ని కాపీ చేసి దాని విశిష్టతను వివరించడం జరిగింది.

ఈ శాసనం కలియుగ సంవత్సరం 5005 నాటిదని, ద్వాదశ గురుపాద పారంపర్యానికి చెందిన అన్నవదూత స్వామి వారి శిష్యులు మరియు హుస్సేన్ గారి శిష్యులు అయిన శ్రీకృష్ణదాసు గారు మాఘమాస బహుళ నవమి జేష్టానక్షత్రమున, గూడూరులో వారి శిష్యులు అయ్యపనేని ఆదెమ్మ గారిచే సమాధి కైంకర్యమును పొందినట్లు ఈ తెలుగు శాసనంలో పేర్కొనబడిందని ఏసుబాబు గారు చెప్పారు. కృష్ణదాసు గారు ఒక మహమ్మదీయుని శిష్యునిగా ఉండటం ఆదర్శనీయమైన అంశమని తెలిపారు.

నాటి గొప్ప ఆదర్శాలు నేడు అత్యంత ఆవశ్యకమని కృష్ణదాసులాంటి మహనీయుల చెప్పిన బాటలో అందరూ నడవడం సమాజానికి శ్రేయస్కరమని చెప్పారు. మఠంలో జరుగుతున్న భక్తి కార్యక్రమాల్లో కులమత రహితంగా ప్రజలు పాల్గొనడం ఆనందదాయకమని ఏసుబాబు సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, శశి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.

0
0