బాస్‌లతో సత్సంబంధాలు

0
163

(‌పున్నమి ప్రతినిధి) :
ఈ ఆర్టికల్‌ ‌ముఖ్యంగా 25 ఏళ్ళలోపు, యువతీ యువకులకు చాలా ఉపయోగం! మరియు ఒక 10 ఏళ్ళ అనుభవం ఉండి, కొందరు మంచి అధికారులతోనూ, కొందరు చండ శాసనులైన – పై అధికారుల (‘బాస్‌’అం‌దాము) తోనూ, పని చేసి వేగిన వారికి కూడా, కొంత ‘‘ఇంటర్‌ ‌పర్సనల్‌ ‌స్కిల్స్’’ ‌పెంపొందించుకునే విషయంలో ఉపయోగపడుతుంది.
ఇక, మిడిల్‌ ‌మేనేజిమెంటు, ఆ పైన ఉండి, ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలలో పని చేస్తున్న అధికారులకు కూడా ఉపయోగం.
ఈ వారం మన టాపిక్‌, ‘‌బాసులతో సత్సంబంధాలు’. మన జీవితంలో మనశ్శాంతిని రెండు సంబంధాలు ప్రభావితం చేస్తాయి. జీవిత భాగస్వామితో సత్సంబంధాలు, ఒక 25 శాతం. మీ పై అధికారి (ణి)తో సత్సంబంధాలు మరొక 25 శాతం.
నేను సొంత కంపెనీ ప్రారంభించక ముందు, వివిధ కంపెనీ లలో పని చేసి, మిడిల్‌ ‌మేనేజిమెంటు వరకూ వెళ్ళి బయటికి వచ్చిన అనుభవాన్ని, ఈ శీర్షిక ద్వారా మీతో పంచుకుందాము అని ఉద్దేశ్యము. ఈ అవకాశం నాకు ఇచ్చి, వెన్ను తట్టి ప్రోత్సహించిన సర్వేపల్లి కోటేశ్వరరావుకి నా ధన్యవాదాలు!
సో, మిడిల్‌ ‌మేనేజిమెంటు దాకా పోయిన నాకు, పైన కూడా రిపోర్టు చేసే బాసులు చాలా మంది ఉండే వారు. క్రింద కూడా నాకు రిపోర్టు చేసే వారు చాలా మంది ఉండే వారు. నా ర్యాంకులోనే టీం మేట్స్ ఉం‌డే వారు. వీరందరినీ సమన్వయం చేసుకునే క్రమంలో – నేను తప్పులు చేశానా? అంటే ఓ! చాలానే చేశాను! శిశుపాలుడి కంటే ఎక్కువ సంఖ్యలోనే. చాలా ఎదురు దెబ్బలు కూడా తిన్నాను, నిలదొక్కుకున్నాను అది వేరే కధ.
అదే విధంగా, ‘మనం యవ్వనంలో, అంత అవగాహన , పరిపక్వత లేని రోజుల్లో చేసిన తప్పులు ఇప్పటి యువత చెయ్యకూడదు కదా? చెయ్యక పోతే, వారు ఉద్యోగ సోపానంలో నా కంటే త్వరగా పైకి ఎదుగుతారు కదా (ఎదగాలి కూడా!) అన్న ఉద్దేశ్యం కూడా, నేను ఇచ్చే ట్రెయినింగ్స్‌లోనూ, రాసే ఆర్టికల్స్‌లోనూ కనిపిస్తోంది. ఇవి పాటిస్తే మీరు మీ ఉద్యోగ వ్యాపారా స్వయం ఉపాధిలో మరింత స్పీడుగా ముందుకు పోగలరు!
ఇప్పుడు మళ్ళీ అసలు టాపిక్‌కి వద్దాం. ‘బాస్‌లతో సత్సంబంధాలు’ ఈయన ఏంటీ? చెంచా గిరీ / చెక్క భజన చెయ్యమంటున్నాడా ఏమిటి? అని అనుకోవద్దు! ఇప్పుడొక చిన్న డిస్‌క్లెయిమర్‌!
‌బాస్‌తో సత్సంబంధాలు అంటే ఏవేవి కావు? ఏవి వాటిలోకి రావు?
పై అధికారి(ణి)తో మంచి రిలేషన్‌ అం‌టే, వారి పిల్ల చీమిడి ముక్కుతుడవడం కాదు. ‘ఆహాహా ఓహోహో!’ అని వారు చెప్పే ప్రతిదానికీ ‘ఓ బ్రిలియంట్‌’ అనడం కాదు! చిడతలు వాయించడం కాదు.
నిజానికి మీ పై అధికారి అభిప్రాయాల్తో మీరు విభేదించ వచ్చు కూడా! మీదైన అభిప్రాయాన్ని వినిపించ వచ్చు కూడా. అలా చేసి వారి మన్ననలను పొంద వచ్చు కూడా! అయితే, అది సగౌరవంగా, మర్యాదగా, మీటింగులలో పబ్లిక్‌గా కాక్కుండా వ్యక్తి గతంగా చేయాలి.
ఒక టీం మేట్‌గా, ఒక సబార్డినేట్‌గా, మీ ఆత్మ గౌరవం నిలుపు కుంటూనే, అధికారం అనేది కొన్ని విభజన రేఖలు గీచి తీరుతుంది కాబట్టి ఆ లైను మనం దాటకుండా, అవతలి వారిని దాట నీయకుండా, మనం సత్సంబంధాలు నెరపవచ్చు. అది ముఖ్యం కూడా! అది ఎలానో చూద్దాం.
ఇప్పుడు కోవిడ్‌ ‌వచ్చి, ఇంటి నుంచి పని చేసే వర్క్ ‌ఫ్రం హోం కల్చర్‌ ‌కంపెనీలలో అలవాటు అయినాక, మనం కొలీగ్స్‌ని కానీ, బాసులని కానీ వ్యక్తిగతంగా కలిసే అవకాశాలు సన్నగిల్లాయి . ముఖాముఖి ఎన్నో విషయాలు వ్యక్తం చేసే వారము, ఇప్పుడా పరిస్థితి లేదు. అయినా, పై అధికారులందరితోనూ సత్సంబంధాలు తప్పని సరి!
దానికోసం (అ) వారి పని చేసే తీరుకి అనుగుణంగా మనని మనం కొంత అడ్జస్ట్ ‌చేసుకోవడం (మనకి సౌకర్యంగా లేక పోయినా!) (ఆ) క్రమం తప్పకుండా, నైపుణ్యంతో కమ్యూనికేట్‌ ‌చేస్తూ ఉండడం, (ఇ) ఇచ్చిన పని సమయానికి పూర్తి చేస్తూ వారి నమ్మకాన్ని పొందడం, మనం మొదటగా చేయాల్సినవి.
మన బాసులకూ, పైన వారి బాసులు ఉంటారు కదా? వారి పై అధికారులు, మన బాసుల నుంచి ఏమి ఆశిస్తున్నారు? మన పై అధికారి పైన ఉన్న టార్గెట్‌లు ఏమిటి? వాటిని ఆమె / ఆయన పూర్తి చేయడంలో మనం ఎంతవరకు సహాయ పడగలము? ఇది అర్ధం చేసుకోవడం ద్వారా కూడా, మీరు మీ పై అధికారి నమ్మకాన్ని సంపాదించగలరు.
మరిన్ని మార్గాల కోసం వచ్చే వారం ఇదే శీర్షికలో కలుద్దాం, శెలవు.

0
0