పున్నమి న్యూస్ – వైఎస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నడిబొడ్డులో డాక్టర్ ప్రసాదరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై స్థానిక ప్రజలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “ప్రొద్దుటూరు చరిత్రను పాతరేయకండి..!” అంటూ పలువురు సాహితీవేత్తలు, బుద్ధిజీవులు, యువత గళమెత్తుతున్నారు.
ప్రొద్దుటూరు అంటే రెండో కాశీ, రెండో ముంబై, కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినిల్లు. దేశ వ్యాప్తంగా ఖ్యాతిగాంచిన దసరా హరివిల్లు ఉత్సవాల కేంద్రం. గాంధీజీ అడుగులు వేసిన భూమి. శివతాండవం రచించిన మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల భూమి. వందల తరాలకు ఆదర్శంగా నిలిచిన డాక్టర్ ఎంవీ రమణారెడ్డి పోరాట పటిమ ఉన్న ప్రదేశం.
అలాంటి ప్రఖ్యాతమైన ప్రొద్దుటూరులో డాక్టర్ ప్రసాదరెడ్డి విగ్రహాన్ని ఉంచడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు – ఆయన ఎవరు? ఉచిత వైద్యం చేశారా? ప్రజాసేవ చేశారా? సామాజికంగా ఏమి అందించారు?
ప్రొద్దుటూరులోని పెద్దలు, గౌరవనీయులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై విసృత చర్చ జరపాలని ప్రజలు కోరుతున్నారు. ప్రొద్దుటూరు చరిత్రను చెడగొట్టే ప్రయత్నాలు అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు.
“చరిత్రను కాపాడండి – గుర్తింపు చెల్లని విగ్రహాలకు చోటు లేదు” అనే పిలుపుతో ప్రజలు ఏకతాటిపైకి వస్తున్నారు.