వెలుగోటి వారి పాలనలో ప్రసిద్ధికెక్కిన మన్నారు పోలూరు శ్రీకృష్ణుని ఆలయం
( పున్నమి ప్రతినిధి. షేక్. రసూల్ అహమద్ ) : బ్రహాండ పురాణకాలములో మణిమంటపక్షేత్రముగా, నూట ఎనిమిది దివ్య తిరుపతులలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం అలఘమల్లారి కృష్ణస్వామి దేవాలయం. ఈ దేవాలయం నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేటకు దగ్గరలో ఉన్న మన్నారుపోలూరు అనే గ్రామములో వెలసి వుంది. సంపదలకు నిలయంగా ఉండే ప్రతి గుడికి ఓ పురాణగాథ ఉన్నట్టే ఈ గుడికి కూడా ఓ పురాణం ఉంది. ద్వాపరయుగంలో సత్రాజిత్తుడనే రాజు తన తపోబలముచే సూర్యుని వలన శ్యమంతకమణిని సంపాదించెను. శ్రీకృష్ణుడు ఆ మణి మహాత్యమును తెలిసుకొని దానిని తనకివ్వవలసినదిగా సత్రాజిత్తు రాజును కోరగా , అందుకు ఆరాజు నిరాకరించెను. తరువాత ఒకనాడు సత్రాజిత్తుని తమ్ముడగు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లగా అడవిలో ఒక సింహము ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని వెళ్లుచుండగా, ఆ ప్రాంతంలో తపస్సు చేసుకొంటున్న జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి మణిని తీసికొనివచ్చి తన కుమార్తె ఐన జాంబవతికిచ్చెను. కానీ మోసముచే శ్రీకృష్ణుడే ప్రసేనుని వధించి శమంతక మణిని దొంగతనంగా తీసుకున్నాడని లోకములో అపవాదు కలిగేను.కొంత కాలము తరువాత ఒకనాడు దండకారుణ్యమునకు వేటకు వచ్చిన కృష్ణుడు జాంబవతి వద్దనున్న శమంతకమణి చూసి, తనపైఉన్న అపవాదును పోగొట్టుటకు , త్రేతాయుగములో శ్రీరామావతారములో జాంబవంతుడికిచ్చిన వరమును చెల్లించుటకు గాను శ్రీకృష్ణుడు జాంబవంతునితో 18 రోజులు మల్లయుద్దము చేసి జాంబవంతుడిని ఓడించి శ్యమంతకమణితో పాటు జాంబవతిని కూడా వివాహమాడెను. అందువలన ఇక్కడ వెలసివున్న కృష్ణస్వామికి అలఘమన్నారి కృష్ణస్వామి అను పేరు కలిగినట్టుగా ప్రచారంలో ఉంది. ఈ క్షేత్రపాలకుడు జాంబవంతుడు. కృష్ణుడు మణిని సత్రాజిత్తునికిచ్చి తనపై ఉన్న అపవాదును పోగొట్టుకొనెను. అప్పుడు సత్రాజిత్తు శ్రీకృష్ణుని మెచ్చుకొని తన కుమార్తె సత్యభామను ఇచ్చి వివాహము చేసి ఆ మణిని తిరిగి శ్రీకృష్ణుడికి కానుకగా ఇచ్చెను.
ఇక చారిత్రకంగా ఈ గ్రామము ఒకప్పుడు వడ్డెరాజులకు ముఖ్యపట్టణంగా ఉండింది. 12వ శతాబ్దములో మనుమసిద్ధి రాజుగారి బంధువు తిక్కరాజు ఉత్సవకాలములో ప్రత్యేక వసతులు కల్పించినట్లు ఈ ఆలయంలో శిలాశాసనము వుండింది. ప్రస్తుతం అది కనపడుటలేదు.కల్నల్ మేకంజి కైఫీయత్తులో ఈ దేవాలయ స్థల పురాణం రాయబడింది. దేవాలయం వెనక వైపు రాజుల కాలంనాటి శిధిల కోట ఆనవాళ్లు ఉన్నాయి. వెంకటగిరి రాజుల కాలంలో ఈ దేవాలయం మహోన్నత స్థాయికి చేరింది. వెంకటగిరి రాజులు ఈ దేవాలయ నిర్వహణకు 5 గ్రామాలతోపాటు వేల ఎకరాలు దానంగా ఇచ్చారు. వెలుగోటివారు మన్నారు పోలూరును తూర్పు దక్షిణ రాజ్యానికి తమ ముఖ్య కేంద్రంగా వాడుకొన్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో దేవదాసీలు ఆలయానికి అనుబంధంగా పనిచేసేవారు. వెంకటగిరి రాజాల దర్బారులో, అలాగే సంస్థానానికి చెందిన ప్రతి ఉత్సవాల్లో మన్నారు పోలూరు దేవాసీలు ఉండేవారు. అత్యంత ఆకర్షణీయంగా ఉండే మన్నారుపోలూరు దేవదాసీల కోసం వెంకటగిరి రాజుల యొక్క అతిధులు అధికారులు ఆఖరికి పామర జనాలు కూడా ఎగబడేవారు. పెద్ద ఎత్తున రంగమంటపాలు వీరికోసం ఉండేవి. దేవదాసీలు దేవాలయంపై వచ్చే ఆదాయం పైన ఆధారపడి వీరు బతికేవారు. జమీందారి రద్దు తర్వాత దేవదాసీల జీవితం దుర్భర స్థితిలోకి నెట్టివేయబడింది.
ఇక దేవాలయంలోని శిల్ప కళ ద్రావిడ శైలిలో కట్టబడింది . ప్రతి శిల్పం ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. నవరసాలకు ప్రతిబింబంగా ఇక్కడి శిల్పకళావైభవం వర్ధిల్లుతోంది. ఇందుకు ఉదాహరణగా గర్వభంగము అయిన గరుత్మంతుడు రోధిస్తున్నట్టు విగ్రహ కనులనుండి నీరుకారుతున్నట్టుగా గోచరిస్తుంది. ఇలా ప్రతి శిల్పం ప్రత్యేకలక్షణము కలిగి ఈ దేవాలయం భారతదేశములో ప్రసిద్ధ పుణ్యక్షేత్రములో ఒకటిగా విరాజిల్లుతోంది.