Story highlights
- ఆత్మకూరు, అక్టోబర్ 29 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
- నామినేషన్ల తిరస్కరణలు, బలవంతపు ఉపసంహరణలు, ఏకగ్రీవాల ప్రకటన వెనుక అధికార దుర్వినియోగం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు.
- ఆత్మకూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు.చేజర్ల మండలంలో పది ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించి తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని…
కలెక్టర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్న మేకపాటి విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు, అక్టోబర్ 29 (కోటకొండ హరికిరణ్ – పున్నమి ప్రతినిధి):ఆత్మకూరు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నామినేషన్ల తిరస్కరణలు, బలవంతపు ఉపసంహరణలు, ఏకగ్రీవాల ప్రకటన వెనుక అధికార దుర్వినియోగం జరిగిందని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. ఆత్మకూరులోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై కలెక్టర్, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు.చేజర్ల మండలంలో పది ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించి తొమ్మిది మంది వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. మర్రిపాడు మండలంలోని మూడు సెగ్మెంట్లలోనూ ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. భీమవరం సెగ్మెంట్‌లో మహిళా అభ్యర్థి సుమారు ఆరు గంటలపాటు ప్రయత్నించినప్పటికీ నామినేషన్ తిరస్కరణకు గురైందని ఆరోపించారు. నామినేషన్ల పరిశీలనలో నిబంధనలను సమానంగా అమలు చేశారా లేదా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.మర్రిపాడు, సంగం, ఏఎస్‌పేట ప్రాంతాల్లో నామినేషన్ల ఉపసంహరణ సమయంలో పోలీసు బలగాలను మోహరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు, కార్యకర్తలను బయటకు పంపించారని విక్రమ్‌రెడ్డి ఆరోపించారు. కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు మూసివేయించడం, సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. అభ్యర్థుల సమ్మతి లేకుండానే ఉపసంహరణలు జరిగినట్లు చూపించి ఏకగ్రీవాలు ప్రకటించారని ఆరోపిస్తూ, సంబంధిత సీసీటీవీ దృశ్యాలను అందించాలని కోరినా స్పందన లేదన్నారు.మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండతో కొందరు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న విక్రమ్‌రెడ్డి, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు స్వయంగా హాజరయ్యారా? ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేసింది ఎవరు? అభ్యర్థుల సమ్మతి తీసుకున్నారా? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాలని కోరారు.ప్రజల మద్దతు ఉందని చెప్పుకునే కూటమి నాయకులు స్వేచ్ఛగా ఎన్నికలను ఎదుర్కోవాలని, ప్రతిపక్ష అభ్యర్థులను పోటీకి దూరం చేయడాన్ని విజయంగా ప్రచారం చేసుకోవడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి నిష్పాక్షికంగా విచారణ జరపాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని విక్రమ్‌రెడ్డి కోరారు.