జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు.మంగళవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు నిర్వహించడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లబ్‌లను మూసివేయిస్తోంది తప్ప ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నాని.. బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పేందుకే స్పందిస్తున్నానన్నారు. పవన్ కల్యాణ్ తనని తాను వకీల్ సాబ్ అనుకుంటే జనం మరో విధంగా భావిస్తున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ సినిమాలు ఆపాలని ఎవరూ కోరలేదని, తనంతట తానే స్వయంగా సినిమాలు ఆపేస్తున్నట్టు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత పుత్రుడు ఒకవైపు, దత్త పుత్రుడు మరో వైపు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. పవన్‌కు మరోసారి ప్యాకేజీ అందడంతో పర్యటనలు వేగవంతం చేశారని ఎద్దేవా చేశారు.