గూడూరు కోర్టుహాలు ముందు జనం గుమిగూడి ఆత్రుతతో ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. అక్కడున్న అందరిలో గుసగుసలు ఒకవైపు వెంకటగిరి జమీందార్లు, ఇంకొకవైపు సామాన్య రైతులు. పొలం పుట్ర పనులు చేసుకోకుండా ఎందుకయ్యా ఈ కేసులు జమిందార్లకు ఎదురొడ్డి గెలుస్తారా ? అంటూ కొంతమంది హితబోధలు. పాపం రైతుల ముఖాల్లో ఆందోళన, భయం స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళ లాయరు ఇంకా రాలేదు వస్తాడో రాడో అంటూ రైతులకు దెప్పిపొడుపులు. ఇంతలో ఎదురుగా డొక్కు సైకిల్లో పాత సాంప్రదాయానికి గుర్తుగా లాయర్ రానే వచ్చాడు. నేరుగా రైతుల దగ్గరికివచ్చి చిన్నపాటి పలకరింపు, ఏమి కాదు నేనున్నానంటూ అభయ మిచ్చి అందరికి అభివాదం చేశారు. అక్కడున్న చిన్నా చితక న్యాయవాదులందరు లేచి నిలబడి ఆయనకు సలాములు చేశారు. భక్తి భావంతో స్వాగతం చెప్పారు. సదరు రైతుల న్యాయవాది సామాన్యవ్యక్తిలా ఒక్కడే నడుచుకొంటూ కోర్టు హాల్లోకి వెళ్ళాడు. చేతిలో కాగితాలు లేవు, జూనియర్ల హడావుడి లేదు, చుట్టూ మంది మార్బలం లేదు, ఆయనొచ్చిన విషయం జడ్జి గారికి తెలిసినట్లుంది. ఆయన కూడా వచ్చారు. వాదోపవాదనలు అంతకుముందే జరిగిపోయాయి కనుక జడ్జిమెంట్ సమయం రానేవచ్చింది. ఆఖరికి కేసు రైతుల పక్షం నిలిచింది. జమీందార్లు ఓడిపోయారు. బయట జయ జయధ్వానాలు పెక్కుటిల్లాయి. రైతులు గెలవరు అనుకొన్న వారు కూడా ఆయనకు అభివాదం చేశారు. రైతుల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసిన వ్యక్తి మరెవరో కాదు ఎస్టేట్ లాండ్ ఆక్ట్, హిందూ లా లో అపార ప్రజ్ఞావంతుడుగా పేరుపొందిన శ్రీ పునుగు శ్రీకంఠం. ఇప్పటి తరానికి తెలియని ఈయన గూడూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడుగా, ప్రభుత్వ న్యాయవాదిగా, రైతుల పక్షపాతిగా అనేక కేసులను విజయవంతంగా గెలిచి, నిస్పక్షపాతంగా సేవచేసిన వ్యక్తిగా చరిత్రపుటల్లో ఎక్కడో మరుగున పడిపోయారు.
పునుగు శ్రీకంఠం వావిళ్ళ వారి త్రిలిజ్ఞ పత్రికా సంపాదకులు అయిన పునుగు సీతారామ శాస్త్రి గారి కుమారులు, మద్రాసు ప్రెసిడెన్సీకాలేజీ పండితులైన చదలవాడ సీతారామశాస్త్రి దౌహిత్రులు. తన చిన్నతనం నుంచి అల్లాడి మహాదేవశాస్త్రి, వేదం వెంకటరాయశాస్త్రులతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నారు. దీంతో సహజంగానే శ్రీకంఠం పాండిత్యప్రతిభకు గురువుల చనువు నగిషీలు దిద్దినట్టయింది. మద్రాసులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసి మెళకువలను వంటబట్టించుకొన్నారు.
న్యాయవాదిగా శ్రీకంఠంకు ఎదురులేకుండా పోయింది. శ్రీకంఠం వాదిస్తుంటే న్యాయశాస్త్రంలో తలపండిన వారు, మద్రాస్ అడ్వకేట్ జనరల్, భారత రాజ్యాంగ రూపకర్తలలో ఒకరైన అల్లాడి కృష్ణస్వామయ్య లాంటి మహామహులు, కొమ్ములు తిరిగిన న్యాయవాదులు సైతం భయపడేవారు. న్యాయశాస్త్రంపై పూర్తి పట్టుండటంతో శ్రీకంఠంగారు తాను అనుకున్నదే, జరుగుతుండటంతో జడ్జీలు సైతం ఆయనతో ఏకీభవించేవారు. ఎలాగైనా శ్రీకంఠాన్ని కోర్టుకు రానీయకుండా ఖర్చులకు డబ్బులిచ్చి ఎక్కడికైనా పంపించి వాయిదా తీసుకోండని ఇతర లాయర్లు జూనియర్లకు చెప్పేవారు. శ్రీకంఠం వాయిదాకు రాలేదంటే గండం గడిచినట్టు భావించేవారు. అంతటి ప్రజ్ఞాశాలి వీరు.
అందరిలాగా వీరికి ప్రిపరేషన్ ఉండేది కాదు. అంతా బుర్రలో ఉండేది. కేసు డైరీలు రాసేవారు కాదు. ఒకసారి ఫైలు చూశారంటే అన్నివిషయాలు పిన్ టు పిన్ గుర్తుపెట్టుకునేవారు. అంతటి జ్ఞాపకశక్తి వారిది. వీరు గెలిచిన కేసులకు వేరే న్యాయవాదులు అయితే వేలల్లో తీసుకొనేవారు. వీరు మాత్రం 1 రూపాయనుంచి 5 లేదా పది రూపాయలు తీసుకొనేవారు. మహా అయితే వంద అంతకంటే ఎక్కువ తీసుకొనేవారు కాదు. అందుకే మిగతా లాయర్లు వట్టి వెర్రివాడు శ్రీకంఠం అనేవారు. భారత న్యాయ శాస్త్రాన్ని తన తల్లిలా భావించే గొప్ప గుణం వీరిది. నేను వ్యాపారం చేయడానికి కోర్టుకు రావడంలేదని చెప్పేవారు. ఇలా న్యాయశాస్త్రాన్ని మనసా, వాచా, కర్మణా తల్లిలాగ భావించే వారు అత్యంత అరుదుగా ఉంటారు.
శ్రీకంఠం పేదల పక్షం వైపు, అందులోను రైతుల పట్ల సానుభూతి కలిగి ఉండేవారు. రైతులకు వ్యతిరేకంగా, జమిందార్లచే బనాయించబడ్డ కేసులే ఎక్కువగా వచ్చేయి. అన్నికేసులను ఒక్కరే చాలా సునాయాసంగా నిర్వహించేవారు. జమీందార్లు, శ్రీకంఠం దగ్గరకు రైతులు వెళ్లకుండా భయపెట్టడమో, ఆశ చూపించి రాజీ చేసుకోవడమో చేసేవారట. ఇంతలా జమీందారులు భయపడేవారు. శ్రీకంఠం గురించి ఒక జమీందారు ‘మహాసముద్రం చెరువు మీదపడితే చెరువు కొట్టుకొని పోతుంది. అలా శ్రీకంఠంగారు సంస్థానాల మీద పడితే అవి కూడా చెరువులమాదిరి కొట్టుకుపోయేటివి’ అని అన్నాడు. అంతటి ప్రతిభ పాటవం శ్రీకంఠం గారిది.
నెల్లూరు జిల్లా జమీన్ రైతు ఉద్యమాన్నిసమర్ధించి ఒక లాయర్గా చాలా సేవచేశారు. న్యాయవాదిగా కాకుండా సాహిత్యంలోనూ వీరికి ప్రవేశముంది. సంస్కృతాంగ్లములో మంచి పట్టుకలవారు కావడంతో సూటిగా అనర్గళంగా, మనసుకు హత్తుకొనే విధంగా మాట్లాడేవారు. రామాయణ మహాభారత ఉపన్యాసాలలో అందెవేసిన చేయి వీరిది. విక్రమసింహపురి మండల సర్వస్వమున నెల్లూరు జిల్లా సంస్థానాలు అనే వ్యాసం రాశారు. వివిధ పత్రికల్లో జమీందారీ పాలనలో రైతుల సమస్యలు, చట్టాల తీరుపై అనేక వ్యాసాలు రాశారు. భావవ్యక్తీకరణ సజీవంగా, భాషశైలి సరళంగా ఉంటూ పామరులకు సైతం అర్ధమయ్యే రీతిలో ఉండేది. ఉత్తముడుగా, ఉదాత్తుడుగా, అమాయకుడుగా, మనసున్నవ్యక్తిగా పేరు గడించినా, సంపాదనలో మాత్రం వెనుకబడిపోయారు. 1963 లో వ్యాధిగ్రస్తులై తాను ఎంతగానో ప్రేమించే గూడూరులో మరణించారు. వీరి ఇద్దరి కుమారుల్లో ఒకరైన అనంతరామన్ వైజాగ్ లో ఉంటున్నారు. రెండవ కుమారుడు రాయలు గూడూరు ఎస్కెఆర్ ప్రభుత్వ కాలేజీలో టైపిస్టుగా పనిచేస్తూ అవివాహితులుగా మరణించారు.
ప్రతిభావంతులందరూ ప్రయోజకులు కాలేరు. ప్రయోజకులందరూ ప్రతిభావంతులు కాలేరు. ప్రయోజకుడుగా రాణించలేకపోయిన ప్రతిభాసంపన్నులైన లాయరు శ్రీకంఠం. శ్రీకంఠంగారి వంటినిండా మెదడే. మెదడు నిండా ‘లా’ యే అని రాసిన జమీన్ రైతు పత్రిక మాటలు అతిశయోక్తికాదనడంలో ఎలాంటి సందేహంలేదు.
Dear Editor sir
Great article about PUNUGU SRIKANTAM
SIR, can you write about his second son
Commodore Punugu anantharaman,. VSM
His son is commander Srikanth
His son in law is also Captain in INDIAN NAVY
Iam commander NVB RAO,
We both did BE together at Govt college of engineering,kakinada from 1965 to 1970 and became commissioned officers in Indian navy in 1970
From Bangalore
Thank you for your response sir . Soon we will work together. Our heartfelt thanks to you who have a great family
Thank you for your article on Sri PUNUGU SRIKANTAM garu a very famous Lawyer in Gudur Town.Your article was inspiring and gave correct information that Lawer SRIKANTAM garu was a great human being always stood for the poor,and never gave importance for earning money as in the case presant day lawyers.-MAMIDIPUDI VENKATESAM.Bangalore.
thank you very much for reply sir. Thanks for your response. What you said is true.They are ideal for today’s generation.
Comments are closed.