తెలుగు త‌మ్ముళ్ళ‌కు సీబీఐ ఉచ్చు త‌ప్ప‌దా ?

0
473

ఏపీ క్యాబినెట్ తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్ట‌బోతోందా ? చ‌ంద్ర‌బాబు టీమ్ పై చ‌ర్య‌లు త‌ప్ప‌వా ? ప‌రిణామాలు చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన అక్ర‌మాల‌పై సీబీఐ ఎంక్వ‌యిరీ వేయాల‌ని మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకున్న తాజా నిర్ణ‌యం చంద్ర‌బాబు అండ్ గ్యాంగ్ ‌కు మింగుడు ప‌డ‌క‌పోవ‌చ్చు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏడాది పాల‌న‌పై విమర్శలు గుప్పిస్తున్న చంద్ర‌బాబు, లోకేష్‌, ఆ పార్టీ నాయ‌కుల దూకుడుకు క‌ళ్ళెం వేసే దిశ‌గా క్యాబినెట్ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులోభాగంగానే టీడీపీ హయాంలో అమలైన చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌ పథకాల్లో జ‌రిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ పథకాల్లో అక్రమాల పరిశీలన కోసం ఏర్పాటైన మంత్రివ‌ర్గ ఉప‌సంఘం తన నివేదికను మంత్రివ‌ర్గానికి సమర్పించింది. అలాగే, నాటి ఐటీ మంత్రిగా నారా లోకేశ్ నేతృత్వంలో నడిచిన ఫైబర్ నెట్ పథకంలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు త‌న నివేదిక‌లో పేర్కొంది. వీటి ఆధారంగా తండ్రీకొడుకులపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఇదే కాదు గ‌తంలో రాజ‌ధాని అమ‌రావ‌తి భూమాయ విష‌యంలోనూ అదే జ‌రిగింది. న‌వ్యాంధ్ర‌లో తొలిసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ, అనేక అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డి, అక్ర‌మాల‌కు తెర‌లేపింద‌ని ఆరోప‌ణ‌లున్నాయి. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించ‌క ముందే చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ అక్క‌డ ముందుగానే నాలుగు వేల ఎక‌రాలను కొనుగోలు చేసి భూదందాకు తెర‌లేపార‌ని వైసీపీ స‌హా ఇత‌ర పార్టీలు ఆరోపించాయి. అయితే వాట‌న్నింటినీ ఖండిస్తూ అవ‌స‌ర‌మైతే ఏ విచార‌ణ‌కైనా సిద్ధ‌మేనంటూ టీడీపీ శ్రేణులు స‌వాల్ చేశారు. ఇక వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ అంశంపై పెద్ద రాద్దాంత‌మే జ‌రి‌గింది. రాజ‌ధాని భూ దందా వ్య‌వ‌హారం తారాస్థాయికి చేరుకోవ‌డంతో టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు. దమ్ముంటే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని స‌వాళ్ళు విసిరారు. ఎట్టకేలకు విపక్షాల డిమాండ్ మేరకే జగన్ సర్కారు భూదందాల వ్యవహారాలను సీబీఐకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌ పథకాల్లో జ‌రిగిన అక్రమాలపై కూడా సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించ‌నుంది. ఈ నిర్ణ‌యం టీడీపీ త‌మ్ముళ్ల మెడ‌కు సీబీఐ ఉచ్చు ఏవిధంగా బిగిస్తుందో చూడాలి.