టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!**ఎం ఎన్ విజయ్ కుమార్

0
169

*
*టీచర్ల పదోన్నతి ఎడతెగని కలేనా!*
*రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు*
*ఎం ఎన్ విజయ్ కుమార్*
*RUPP STATE VICEPRESDENT*….

మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు/ జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం భావ్యం కాదు. ముప్పై సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ పొందని, ఒకే క్యాడర్‌లో ఇరవై సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండీ ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.

తెలంగాణ రాష్ట్రంలో అసంతృప్తికి గురవుతున్న ఒక ప్రధాన వర్గం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గం. కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా వేతనాలు ఇస్తామని ఉద్యమ నేతగాను, ముఖ్యమంత్రిగాను కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రం ఆవిర్భవించగానే పదోన్నతుల పండుగేనని ఉపాధ్యాయుల సర్వీస్‌ రూల్స్‌ రూపకల్పనకు రెండు రోజులు చాలని ఆయన అన్నారు. పదవీ విరమణ నాడు ప్రభుత్వ వాహనంలో ఉద్యోగిని ఇంటి వద్ద దింపి అతనికి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలన్నీ అందే విధంగా ఉండాలనీ, వేరువేరు ప్రాంతాల్లో పని చేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ ఉపాధ్యాయులను ఒకే దగ్గరికు తీసుకురావాలని పాత సంప్రదాయాలకు భిన్నంగా పీఆర్సీ కమిటీలు నివేదిక సమర్పణకు సుదీర్ఘకాలం జాప్యం చేయకుండా 3 నెలల్లోనే నివేదిక అందించేలా చూస్తామని అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి ఉద్యోగులలో ఆశలు రేకెత్తించారు. మొదట్లో ఆయన పేర్కొన్నట్లుగానే ఎంప్లాయీ ఫ్రెండ్లీ పాలనలో భాగంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గానికి తెలంగాణ ఇంక్రిమెంటు; 2015లో 43శాతం ఫిట్‌మెంటుతో పీఆర్‌సీ, రెవెన్యూ ఉద్యోగుల సేవలను ప్రశంసిస్తూ ఒక నెల అదనపు వేతనం, మహిళా ఉద్యోగులకు 90 రోజుల చైల్డ్‌కేర్‌ లీవు, ‘సకల జనుల సమ్మె’ కాలానికి సెలవుల మంజూరు తదితర అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ సంక్షేమ చర్యలను రాష్ట్రప్రభుత్వం అమలు చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 16న వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 18 అంశాల విషయంలో హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు హామీలుగానే ఉండిపోయాయి. సమస్యలను పరిష్కరించటం అటుంచి, వాటిని కనీసం ఆలకించటం లేదనే అసంతృప్తి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గంలో నెలకొన్నది. రెండున్నర సంవత్సరాలైనా పీఆర్‌సీ అమలులోకి రాకపోవటం, ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లు పదవీ విరమణ వయస్సు పెంపు జరగకపోవటం, సిపిఎస్‌ రద్దు అంశంలో ప్రగతి లేకపోవటం, అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా బదిలీలు లేకపోవటం, ప్రమోషన్ల విషయంలో తీవ్ర జాప్యం జరగడం మొదలైన అంశాలు ఉద్యోగుల్లో అసంతృప్తికి దారితీస్తున్నవి. ప్రస్తుతం కరోనా విపత్తుతో నెలకొన్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ వేచిచూసే ధోరణిని అవలంభిస్తున్నారు.

ముఖ్యంగా ఉపాధ్యాయవర్గంలో అసంతృప్తికి ప్రధాన కారణం 2015 జులై నుంచి అంటే దాదాపుగా ‘ఆరు సంవత్సరాల నుంచి’ పదోన్నతులు లేకపోవడం. వీటి విషయంలో మిగతా ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయవర్గం కాస్త ఆలస్యంగా ప్రయోజనం పొందడం ఆనవాయితీగా ఉంది. దీనికి తోడుగా అర్హతలు, అవకాశాలు ఉండి కూడా ఆరు సంవత్సరాలుగా పదోన్నతులు లేకపోవడంతో వారిలో తీవ్ర నిరాశ, నిర్లిప్తతలు నెలకొన్నాయి.

2009 జనవరి 26 నాటి జీఓ. నెం. 15 ద్వారా నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 1 మొదలు తరువాతి సంవత్సరం ఆగస్టు 31 వరకు ఉన్న ఖాళీలకు సంబంధించి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చే వీలు కల్పించింది. 2010 నవంబర్ 20 నాటి జీవో నెం. 67 ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతులు ఏ నెల ఖాళీలకు తదుపరి నెలలో పదోన్నతులు కల్పించే విధంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జీవో నెం. 67 ను రద్దుచేస్తూ, జీవో నెం. 15 ప్రకారం ప్రతి సెప్టెంబర్‌ 1 నుంచి తరువాత సంవత్సరం ఆగస్తు 31 వరకు ఏర్పడిన ఖాళీలను, పదోన్నతుల ద్వారా భర్తీ చేసే విధంగా ప్రభుత్వం 2016 సెప్టెంబర్ 12న జీవో నెం. 32 జారీ చేసింది. అయినప్పటికీ గత ఆరు సంవత్సరాలుగా టీచర్ల ప్రమోషన్లు లేకపోవడంతో అటు టీచర్లకే కాక, విద్యావ్యవస్థకు కూడా తీవ్ర నష్టం జరుగుతోంది. కోర్టు కేసుల పేరుతో ప్రమోషన్లకు సంవత్సరాల తరబడి వాయిదా వేయడం శ్రేయస్కరం కాదు. రాష్ట్రంలోని మిగతా అన్ని శాఖలలో పాత జిల్లాలు, జోన్ల ప్రాతిపదికన ప్రమోషన్స్‌ కల్పిస్తూ ఉపాధ్యాయుల విషయానికి వచ్చేసరికి వివాదాస్పద అంశాలను ముందుకు తేవడం భావ్యం కాదు. 30 సంవత్సరాల సర్వీసులో ఒక్క ప్రమోషన్‌ కూడా పొందకుండా పదవీవిరమణ చేస్తున్న టీచర్లు, ఒకే క్యాడర్‌లో 20 సంవత్సరాలకు పైగా సర్వీస్‌ చేసి అర్హతలు, ఖాళీలు ఉండి కూడా ప్రమోషన్స్‌ పొందలేకపోతున్న ఉపాధ్యాయుల మనోభావాలను ప్రభుత్వo కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ఈ ప్రక్రియ చేపట్టే వారికి పదోన్నతులతో పాటు అంతర్ జిల్లా మరియు సాధారణ బదిలీలు చేపట్టాలని పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఎన్ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు