జులై 1 యాధృచ్చికంగా ఇద్దరు దిగ్గజాలకు జన్మనిచ్చింది. ఒకరేమో నెల్లూరు జిల్లా నుంచి తమ తాతల కాలంలో తమిళనాడుకు వలస వెళ్లిన వారు. ఇంకోరేమో నెల్లూరులోనే పుట్టి పెరిగి ఉద్యోగరీత్యా తమిళనాడుకు వెళ్ళినవారు. ఇద్దరు పురావస్తు శాఖలోనే శాసన అధ్యయన విభాగంలో పనిచేసినవారే. చరిత్రకే పాఠాలు నేర్పి, సరికొత్త విధానాలు రూపొందించి అజరామరమైన కీర్తి ప్రతిష్టలు పొందారు. భారతదేశ చరిత్ర నిర్మాణంలో వీరిద్దరి పాత్ర అసమానమైనది. జులై ఒకటి వి.వెంకయ్య, కృష్ణమాచార్యుల పుట్టినరోజు సందర్బంగా పున్నమి ప్రత్యేక కథనం….
భారతీయ చరిత్ర నిర్మాణంలో శాసనాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. మిగతా ఆధారలకంటే ఖచ్చితమైన సమాచారాన్ని శాసనాలు మాత్రమే ఇస్తాయి. చరిత్రకు ప్రామాణికమైన మూలం మరియు మన గత చరిత్రను పునర్నిర్మించడానికి ఇవి నిచ్చెనలా పనిచేస్తాయి. ఇందులో లిఖిత శాసనాలు పోషించే పాత్ర అతి ముఖ్యమైనది. ముఖ్యంగా మన దేశంలో ఈ శాసనాలు ఏ సందు గొందుల్లో చూసిన ఉంటాయి. గ్రామాల సరిహద్దుల్లో, పాత దేవాలయాల్లో శాసనాలు విరివిగా కానవస్తాయి. ఈ శాసనాలను పరిరక్షించడానికి మరియు వాటిని అధ్యయనం చేయడానికి స్వాతంత్ర్యానికి ముందే భారతీయ పురావస్తుశాఖ ఏర్పడటంతో పాటు శాసన అధ్యయన విభాగం ప్రారంభమైంది. తెలుగుతో సహా మిగతా భాషల శాసన అధ్యయన విభాగం తమిళనాడులోని ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలోని పురావస్తు కార్యాలయంలో వుంది.
వి.వెంకయ్య
పురావస్తు శాఖకు సంబంధించి మన తెలుగువారు అందులో ముఖ్యంగా మన నెల్లూరీయులు ఎంతోమంది భారతీయ చరిత్ర నిర్మాణంలో సేవ చేశారు. వారిలో రావు బహదూర్ వి. వెంకయ్య గారు ఒకరు. వీరి పూర్వీకులు నెల్లూరు నుంచి వలస వెళ్లారు. తిరువణ్ణామలై జిల్లాలోని వాళైయాత్తూర్ గ్రామంలో 1864 జులై ఒకటిన వెంకయ్య జన్మించారు. చదువు నిమిత్తం మద్రాసుకి వచ్చి మాంబళంలో స్థిరపడిపోయారు.
ఆ తర్వాత మద్రాస్ ఎపిగ్రఫీ (శాసన అధ్యయన శాఖ ) లో ఉద్యోగం సంపాదించి డాక్టర్ హుల్ట్జ్ దగ్గర శిష్యరికం చేశారు. తంజావూరులోని బృహదీశ్వర ఆలయంలోని శాసనాలు, పాండ్య దేశాలలోని పల్లవ దేవాలయాలను అధ్యయనం చేయడంలో వెంకయ్య ఒక మార్గదర్శక ప్రయత్నం చేశారు. ఎపిగ్రాఫియా ఇండికాకు విశేష కృషి చేశారు. తంజావూరులోని ప్రసిద్ధ రాజరాజేశ్వర ఆలయం యొక్క సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన శాసనాలను దక్షిణ భారత శాసనాలు వాల్యూమ్ 2 గా ప్రచురించారు . ఇది ప్రపంచంలోని పండితుల ప్రశంసలను పొందింది. ఈ శాసనాల ద్వారా విస్మయపరిచే విషయాలను ప్రపంచానికి తెలియపరచారు . ఆలయ గోడలపై చెక్కబడిన శాసనాల సంపదను నాశనం కాకుండా చాలా ప్రయత్నాలు చేశారు. మరమ్మత్తులు, పునర్నిర్మాణం పేరిట ధ్వంసం చేయబడటాన్ని చాలావరకు నిలువరించారు. పునర్నిర్మాణం యొక్క వినాశకరమైన అభ్యాసాన్ని ఆపాలని వీరు ప్రభుత్వాన్ని పదే పదే విజ్ఞప్తి చేశారు. ఎపిగ్రాఫియా ఇండికా వాల్యూమ్లను IV, V మరియు VIII లను సవరించారు. వివిధ పత్రికలలో అనేక వ్యాసాలను రాశారు.
నెల్లూరు జిల్లా చరిత్రకు వీరు ఎనలేని సేవ చేశారు. వీరు ఏన్సియంట్ హిస్టరీ అఫ్ నెల్లూరు అనే వ్యాసాన్ని రాసారు. నెల్లూరు జిల్లాపై తనకున్న అభిమానంతో తరచు జిల్లాకు వచ్చేవారు. నెల్లూరు జిల్లాలో జైనుల ఉనికిని తెలియపరచి, ఇప్పుడున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ ప్రాంతం ఒక్కప్పుడు జైనుల స్థావరంగా తేల్చారు. సుందరమైన జైన విగ్రహాలు, ప్రాచీన జైన కోనేరు వెలికి తీయడంలో వీరి పాత్ర ఎంతో వుంది. దురదృష్టవశాత్తు 1912 లో 48 సంవత్సరాల వయస్సులోనే వెంకయ్య గారు మరణించారు.
సి. ఆర్. కృష్ణమాచార్యులు
రావు బహదూర్ సి. ఆర్. కృష్ణమాచార్యులు నెల్లూరు జిల్లాలోని గంగవరం గ్రామంలో, వైష్ణవ కుటుంబంలో జూలై 1, 1888 న, జన్మించారు. కృష్ణమాచారి నెల్లూరులోని వి.ఆర్. హైస్కూల్ లో మెట్రిక్యులేషన్ చేసి, మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరారు. ఆ కళాశాలలో ఎఫ్. ఎ పూర్తి చేసిన తరువాత, మద్రాసులోని పచ్చయప్ప కళాశాల నుండి విశ్వవిద్యాలయ పట్టా పొందారు. నెల్లూరులోని ఎం. ఎస్. లోయర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా తన వృత్తిని ప్రారంభించి తరువాత నెల్లూరు కలెక్టరేట్‌లో చేరారు. అక్కడ కొంతకాలం సేవలందించిన తరువాత, ఎపిగ్రాఫికల్ విభాగంలో చేరారు. హెచ్. కృష్ణ శాస్త్రితో కలిసి పనిచేసి, 1925 లో అసిస్టెంట్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది 1931 లో సూపరింటెండెంట్ అయ్యారు. 1942 లో భారతదేశ ప్రభుత్వ ఎపిగ్రాఫిస్ట్ అయ్యారు, తన పదవీకాలంలో శాసన అధ్యయన శాఖను ఆధునిక పద్దతిలో ఆవిష్కరించారు. వందల శాసనాలను వెలికితీసారు.
కృష్ణమాచార్యులు సంస్కృత మరియు తెలుగు భాషలలో ఉత్తమ పండితులు కావడంచేత దక్షిణ భారత భాషలలో అత్యుతమ ఎపిగ్రాఫిస్ట్ గా పేరు గడించారు. 1931 నుండి దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికలు రూపొందించడంలో, శాఖ సిబ్బందిని సమర్ధవంతంగా సమన్వయ పరచడంలో కృష్ణమాచార్యులు అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉండేవారు. పల్లవుల చరిత్రకు సంబంధించి ఖచ్చితమైన శాసన సామాగ్రిని వెలికితీసి పరిశోధన పండితులకు అందించారు. అనేక తామ్ర శాసనాలను భద్రపరిచారు. చాలా విలువైన పత్రాలను సేకరించారు. ఈ ఆవిష్కరణలన్నీ కృష్ణమాచార్యులు యొక్క ఘనతను సూచిస్తున్నాయి. రచనాపరంగా హైదరాబాద్ పురావస్తు సిరీస్ కోసం కన్నడ శాసనాలు, దక్షిణ భారత ఎపిగ్రఫీపై వార్షిక నివేదికకు విషయ సూచిక, శాసనం జాబితాలు, ఎపిగ్రాఫియా ఇండికాలో వ్యాసాలు. ఇలా అన్నిటిలో అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. పురావస్తు అన్వేషణలో, చరిత్రపూర్వ యుగపు ప్రదేశాలను గుర్తించడంలో నేర్పరితనం చూపారు. మొదటిసారిగా దక్షిణ భారతదేశ శాసనాల పట్టిక, ఇండెక్స్, టోపోషీట్స్ లాంటి వినూత్నమైన పద్దతులను ఆవిష్కరించారు. ఈ విధానాలనే భారతీయ పురావస్తు శాఖ నేటికీ పాటిస్తుండడం కృష్ణమాచార్యుల యొక్క గొప్పతనమేనని చెప్పవచ్చు. పదవీ విరమణ తరువాత దక్షిణ భారతదేశంలో చరిత్ర పూర్వప్రదేశాల జాబితాను సిద్ధం చేసే క్రమంలో 1947 ఆగస్టు 31 న మద్రాసులో మరణించారు. కృష్ణమాచార్యుల మరణం భారతీయ ఎపిగ్రఫీకి తీరని లోటుగా పురావస్తు శాఖ పేర్కొంది. నెల్లూరు నుంచి కొంతమంది ఔత్సాహిక పరిశోధకులు అడిగిందే తడవుగా నేటి తెలుగు శాసన అధ్యయన విభాగ అధిపతులు, మన తెలుగువారు అయిన ఎం.యేసుబాబు గారి కృషితో పురావస్తు శాఖ తమ శాసన estampage విభాగానికి సి.ఆర్. కృష్ణమాచార్యుల భవనంగా నామకరణం చేసి వారు లేని లోటును తీర్చుకొని, వారికి ఘనమైన నివాళులర్పించారు.
భారతీయ చరిత్రకు గట్టి పునాదులు వేసిన వెంకయ్య, కృష్ణమాచార్యులు తెలుగు వారు కావడం అందులో మన నెల్లూరీయులు కావడం మనం గర్వించదగ్గ విషయమైనప్పటికీ వారి సేవలను గుర్తించడంలో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ప్రజలు విఫలమయ్యారనే చెప్పవచ్చు.