“గూడు…పదిలం”
గంజాం భ్రమరాంబ
తిరుపతి
” డాక్టర్ గారూ నమస్తే.మీతో నేరుగా చెప్పలేక మెసేజ్ పంపుతున్నాను ఏమనుకోకండి శ్రీధర్ గారు.
మీరు చాలా మంచి డాక్టర్. ఎవరూ కాదనలేరు. వైజాగ్ నుంచి బదిలీమీద ఇక్కడకు వచ్చినప్పటి నుంచీ మా ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. చాలా సంతోషం. మీతో కానీ మీ ఇంటి సభ్యులతో కానీ మాకు ఎటువంటి ఇబ్బందులూ లేవండి.
కానీ..కానీ… మీరు రోజూ కరోనా వ్యాధులకు వైద్యం చేసి వస్తున్నారు. ఒక ప్రత్యేక గదిని కేటాయించుకున్నారు లేండి.
ఏది ఏమైనా.. మా ఇంట్లో నేనూ, మా ఆవిడా మా అమ్మా ..నాన్నా..చూస్తే ముసలివాళ్ళు.. నా కొడుకు , కోడలూ వాళ్ళ పిల్లలేమో ఇద్దరూ ఐదేండ్ల లోపు వారే.
ఎందుకైనా మంచిది. మీరు ఇల్లు ఖాళీ చేస్తే బాగుంటుంది అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు…
మీరు అన్యధా భావించకుండా ఒక నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేయగలరా….? ఇట్లు భుజంగరావు.”
పేషేంట్స్ అందరినీ పరామర్శించి హాస్పిటల్ అంతా ఒక రౌండ్ వేసి తన సీట్ దగ్గరకి వచ్చిన డా. శ్రీధర్ తనకు భుజంగరావు పంపిన తీపి వార్తవిని “ఛ” ఏమిటో వీళ్ళ మనస్తత్వాలు అని నిట్టూర్పు వదిలాడు.
అక్కడే ఉన్న ఇంకొక డాక్టర్ జాన్ తో
“ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా… అర్థరాత్రి.. అపరాత్రి అని చూడకుండా డాక్టర్ అని పరిగెత్తుకువస్తారు.
కరోనా లాంటి భయంకరమైన వ్యాధితో ప్రాణాలు పణంగా పెట్టి మనమిక్కడ యుద్ధం చేస్తుంటే… మానసిక స్థైర్యాన్ని అందించాల్సిపోయి… ఇల్లు ఖాళీ చేయండి.. అంటూ నివేదనలు పంపుతున్నారు” అన్నాడు ఆవేశంగా.
డాక్టర్ జాన్ ” శ్రీధర్ గారూ.. ప్రజలు అంతేనండీ అమాయకులు. ఇదిగో పులి అంటే అదిగో తోక అని అనేస్తారు. మీరేమీ దిగులు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే.. మా మిద్దెపైన ఒక పోర్షన్ ఖాళీగా ఉంది. మా పాపకు పెళ్ళైనాక ఉపయోగపడుతుంది అని అలాగే ఉంచాను. ప్రస్తుతానికి నా రీడింగ్ రూమ్ లా వాడుకుంటున్నాను.
మీరు రేపే షిఫ్ట్ అవ్వొచ్చు. మిగతా విషయాలు తరువాత చేసుకుందాం” అని ఓదార్పుగా చెప్పాడు డా.జాన్.
” మొన్నటికి మొన్న కరోనాకి వైద్యం చేస్తున్న పాపానికి డాక్టర్లపై దాడులు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి వెళితే రాళ్ళ దాడులు, చివరికి కరోనా రోగులకు వైద్యం చేస్తూ చనిపోయిన డాక్టర్ ని ఖననం చేయడానికి కూడా అంగీకరించక ధర్నాలకు దిగిన వైనం చూస్తుంటే ఒళ్ళు కోపంతో రగిలిపోతోంది.
ఉన్న అరాకొరా వసతులతోనే మనం పోరాడుతుంటే వీళ్ళ ధోరణి అసహనానికి గురి చేస్తోంది.
ఎనీ వే… థాంక్యూ జాన్… అవసరానికి మంచి సహాయం చేసావు.రేపే వచ్చేస్తాం. .” అన్నాడు శ్రీధర్.
” నువ్వూ.. మీ ఆవిడ ఇద్దరే కదా! ఫర్నిచర్ కూడా సరిపోతుంది. నువ్వు ఏమీ తీసుకుని రానవసరం లేదు. రెండు మూడు నెలల తరువాత పరిస్థితిని బట్టి మంచి విశాలమైన ఇల్లు చూసి ఒకేసారి ఫర్నిచర్ షిఫ్ట్ చేసుకుందువు గానీ” అని ఆప్యాయంగా చెప్పాడు డా.జాన్.
“అవునవును. అదే మంచిది.అంతకు మించి చేసేదేముందిలే..” అని సాలోచనగా అన్నాడు శ్రీధర్.
************
“డాక్టర్… డాక్టర్… ఎలాగైనా మావాడిని కాపాడండి. ముక్కుపచ్చలారని పిల్లలు ఉన్నారు. దయచేసి ఎలాగైనా మీరే కాపాడాలి “అంటూ కాళ్ళమీద పడిన భుజంగరావుని పైకి లేపాడు శ్రీధర్.
కరోనా నుండి ప్రొటెక్షన్ సూట్ లో ఉన్న శ్రీధర్ ని గుర్తుపట్టలేదతను.
“అసలు ఏమయ్యిందో చెప్పండి” అని అడిగాడు.
” ఇంట్లోనే కూర్చుంటే బోరుగా ఉందని మా వాడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్ళేవాడు. ఇంట్లో వాళ్ళు వద్దని చెప్పినా వినేవాడు కాదు.
నిన్న రాండమ్ గా కొన్ని కుటుంబాలకు కొత్తగా ప్రవేశ పెట్టిన కిట్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు.
మా ఇంట్లో మిగతా అందరికీ నెగటివ్ వచ్చింది. మా అబ్బాయికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. దయచేసి వాడిని కాపాడండి ” అంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు.
సరే సరే… మీరేమీ దిగులు పడకండి. మేమంతా ఉన్నాము కదా.. పాజిటివ్ వచ్చిన ప్రతివారికీ ప్రాణహాని ఉండదు. మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. మేము చూసుకుంటాము బయటకు పంపేసాడు శ్రీధర్.
*******
” సార్..డా. శ్రీధర్ గారు.. నమసే. మా బాబుకు మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చి కాపాడింది మీరేనని తెలుసుకున్నాను. నేను మీ మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తించినా.. అది మనసులో పెట్టుకోకుండా మీరు మా బాబును కాపాడారు. అందుకే మీలాంటి వైద్యులను దైవంతో పోలుస్తారు.
మావాడు వాడి నిర్లక్ష్య ధోరణి వల్ల కరోనాకు గురైతే.. మీర వాడిని మామూలు మనిషిని చేసారు. మీలాంటి ఇంట్లో ఉంటే అనర్థం అనుకున్నాను. కాదు..గొప్ప భరోసా అని మీరు నిరూపించారు.
మిమ్మల్ని నేరుగా కలిసి మాట్లాడే ధైర్యం లేక ఈ మెసేజ్ పంపుతున్నాను. ఇక మీదట మీరు మనింటికి వచ్చేయండి. మీరు ఈ ఊరిలో పనిచేసినన్నిరోజులూ ఆ పోర్షన్ మీదే. మీ వల్లే మా గూడు పదిలంగా ఉంది. దయచేసి నా తొందరపాటును మన్నించి మనింటికి వస్తారు కదూ!!.. ఇట్లు మీ భుజంగరావు .”
****** శుభం******
గంజాం భ్రమరాంబ
తిరుపతి
9949932918