గుండెను పదిలంగా ఉంచుకుందాం

0
1404

గుండెను పదిలంగా ఉంచుకుందాం

గత 20 సంవత్సరాలుగా గుండె జబ్బుల నివారణ దినోత్సవాల పేరుతో ప్రపంచమంతా కార్యక్రమాలు జరుగుతున్నా గుండె పోటు బాధితుల సంఖ్య తగ్గకపోగా నిత్యం పెరుగుతూనే ఉంది.
గతంలో 60 సంవత్సరాల వయసు పైబడిన వారిలో గుండెపోటు ఎక్కువగా కనిపించేది. ప్రస్తుతం 20 సంవత్సరాల వయసు వారికి కూడా గుండెపోటు వస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఏటా సుమారు 1.71 కోట్ల మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు.వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారే.మన దేశంలో చిన్నవయసులోనే ముఖ్యంగా 30, 40 సంవత్సరాల వయసులోనే ఎంతోమంది గుండెపోటు బారిన పడుతున్నారు.

 

ఎంతగానో అభివృద్ధి చెందిన ఈ రోజులలో ఎందుకిలా జరుగుతుందంటే నివారణ కొరకు మనం తీసుకునే జాగ్రత్తలు కంటే గుండెపోటుకు ప్రధాన కారణమైన మన జీవనశైలి ప్రభావం మనమీద అఎక్కువగా ఉండటం.

 

ప్రతిరోజు లక్షసార్లు లబ్‌డబ్‌ అని స్పందిస్తూ.. రెండు వేల గ్యాలన్ల రక్తాన్ని శుద్ధిచేసి, అరవైవేల మైళ్ల దూరం వరకు ప్రవహించేలా పంపింగ్‌ చేసే పిడికెడు గుండె ఆధునిక మనిషి పరుగు వేగాన్ని అందుకోలేకపోతుంది. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా గుండెపై ఒత్తిడి పెరిగింది. ప్రతిఏటా గుండె జబ్బుల మరణాల రేటు పెరుగుతుంది. జీవనశైలిలో వచ్చిన మార్పులను ఇలాగే కొనసాగిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక హృదయరోగులున్న దేశంగా భారత్‌ మారుతోంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు .

ఇటీవల కాలంలో తలనొప్పి, జ్వరం ఎంత సాధారణంగా వస్తున్నాయో గుండెజబ్బులు కూడా అంతే సాధారణంగా మారిపోయాయి.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం అంటే ఈనెల 29వ తేదీన ప్రపంచమంతా జరుపుకోబోయే ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా గుండెపోటుకు కారణాలు, నివారించుకోవడానికి మార్గాలు, ప్రాథమిక వైద్యం గురించి మరియు వైద్యం గురించి కొన్ని విషయాలు ………

గుండెపోటుకు కారణాలు
గుండెపోటు కలిగించే కారణాలను రెండు రకాగాలుగా విభజించవచ్చు . మనం అదుపులో పెట్ట గలిగినవి ఒక రకం. మన అదుపులో పెట్ట లేనివి రెండవ రకం.

అదుపులో పెట్టలేని కారణాలు  : వంశచరిత్ర…..తల్లిదండ్రులకు కానీ తోబుట్టువులకు గాని గుండెపోటు వచ్చిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలోని సభ్యులకు గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ కుటుంబంలో పుట్టిన వాళ్లు ఈ సమస్య నుంచి బయట పడలేరు.

ప్రాంతీయం…….కొన్ని ప్రాంతాలలోని వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. గుండెపోటు ఎక్కువగా వచ్చే ప్రాంతాల జాబితాలో మన దేశం కూడా ఉంది. ఈ సమస్యని మనమేం చేయలేం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇప్పటికీ పుట్టేసాం.

వయస్సు….. వయస్సు పెరిగే కొద్దీ గుండెపోటు వచ్చేఅవకాశం పెరుగుతుంది. వయసు పెరగడాన్ని మనమేం చేయలేం కదా.
లింగత్వం…..గుండె పోటు వచ్చే అవకాశం మగవారిలో ఎక్కువ. నెలవారి వస్తున్నంత కాలం స్త్రీలకు గుండె పోటు నుంచి చాలా వరకు రక్షణ ఉంటుంది.నెలవారి ఆగిపోయిన తరువాత స్త్రీలలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం దరిదాపుగా మగవారితో సమానంగా ఉంటుంది.
మనం అదుపులో పెట్టగల కారణాలు  :  బరువు…..ఎత్తుకు తగిన బరువు ఉంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ .ఊబకాయం వుంటే గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ. ఎత్తుని సెంటీమీటర్లలో కొలుసుకొని అందులోంచి 100 తీసివేస్తే వచ్చేటటువంటి విలువ ఎంతో అన్ని కేజీలు మాత్రమే మన బరువు ఉండాలి. ఎత్తుకు సరిపడా ఉండవలసిన బరువు కంటే ఎక్కువ ఉన్నవారు ఖచ్చితంగా బరువు తగ్గించుకోవాలి. ఇందుకోసం తిండి తగ్గించుకుని పని పెంచుకోవాలి.
బిపి…….
బిపి ఎక్కువగా ఉన్నవారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువ . బీపీ జబ్బ రావడానికి చాలా సందర్భాల్లో కారణం తెలియకపోయినా బిపి జబ్బును అదుపులో పెట్టుకోవడం మన చేతిలోని పనే .సరైన వైద్యం చేసి బీపీని అదుపులో ఉంచుకుంటే గుండెపోటు వచ్చేఅవకాశం తగ్గుతుంది. బిపి నిశ్శబ్ద హంతకి. ఎటువంటి ఇబ్బంది పెట్టకనే మనిషి ప్రాణం తీయగలదు.బీపీ జబ్బు ఉన్నవారిలో సగం మందికి ఇది ఉన్నట్టుగా కూడా తెలియదు. బిపి జబ్బును గుర్తించిన వారిలో సగం మంది మాత్రమే వైద్యం చేయించుకుంటారు. వైద్యం మొదలు పెట్టిన వాళ్ళలో సగం మంది మాత్రమే వైద్యాన్ని కొనసాగిస్తారు. బిపి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త తీసుకోవాలంటే మంచి ఒకసారి బిపి చూపించుకొని
మధు మేహం…. షుగరు జబ్బు ఉన్న వాళ్లకి గుండెపోటు వచ్చే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. షుగర్ను అదుపులో పెట్టుకో గలిగితే గుండెపోటు అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. షుగరు జబ్బు శరీరంలోని ఏ భాగాన్నైనా దెబ్బతీస్తుంది. షుగర్ జబ్బు ని కుక్క తో పోలుస్తారు. షుగర్ జబ్బు అదుపులో ఉంటే బొచ్చుకుక్క. అదుపు లేకపోతే పిచ్చికుక్క. బొచ్చు కుక్క మనం చెప్పినట్టు మన చుట్టూ తిరుగుతుంది .పిచ్చికుక్క దాని ఇష్టం వచ్చినట్లు కొరికి పారేస్తుంది ది. బొచ్చు కుక్క గా పెంచుకోవడమా లేదా పిచ్చికుక్కగా పెంచుకోవడమా అన్నది మన చేతుల్లో పని. అందుకే కే షుగర్ వ్యాధిగ్రస్తులు తగిన జాగ్రత్తలు తీసుకుని శివరంజని అదుపులో పెట్టుకుని గుండెపోటుని నివారించుకోవచ్చు. షుగరు జబ్బు వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఒక భాగమైతే మన జీవనశైలిలో జాగ్రత్తలు తీసుకుని షుగర్ జబ్బు ని కొంతకాలం దూరంగా నెట్ అవ్వచ్చు. 40 సంవత్సరాలు వయసు కలిగిన వారందరూ సంవత్సరానికి ఒక పర్యాయం రక్త పరీక్ష చేయించుకోండి షుగరు ఉందో లేదో చూసుకుంటే షుగర్ జబ్బు మూడేళ్ల ముందుగానే గుర్తించవచ్చు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని షుగరు జబ్బు ముందుగానే గుర్తించడం, రాకుండా చూసుకోవడం ,వచ్చిన తర్వాత అదుపులో పెట్టుకోవడం ఇలాంటివి చేయగలిగితే షుగరు జబ్బు వల్ల గుండెపోటు వచ్చే అవకాశం లేకుండా చేసుకోవచ్చు.
జీవనశైలి……
గుండెపోటుకు మనం జీవనశైలి ఒక ప్రధానమైన కారణం.ఉప్పు ఎక్కువగా తినడం.మానసిక వత్తిడికి ఎక్కువగా గురి కావడం. సరిపోయినంత నిద్ర లేకపోవడం. తక్కువ పనిచేయడం. అవసరానికి మించి తినడం లాంటిఅనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
ఉప్పు మన జీవితానికి పెద్ద ముప్పుగా మారింది. రోజుకు నాలుగు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తినకూడదు. అంటే నెలకు 100 గ్రాములు ఉప్పు వరకు తినవచ్చు. కానీ మనం సుమారు అరకిలో ఉప్పు తింటున్నాం. ఉప్పును ఎంత వీలైతే అంత తగ్గించుకోవడం మంచిది.
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎనిమిది గంటలనిద్ర అవసరం. శాస్త్రసాంకేతిక రంగాలు అభివృద్ధి చెందే కొద్దీ మనిషికి నిద్ర కరువైపోతుంది .నిద్ర తగ్గితే
గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ.
ధూమపానం….. పొగతాగేవారిలో గుండె పోటు వచ్చే అవకాశం మామూలు వాళ్ళ తో పోల్చుకుంటే మూడు రెట్లు ఎక్కువ పొగాకుకు సంబంధించిన ప్రతి అలవాటు గుండెకు ప్రమాదకరమే.
గుండె పోటు బారిన పడకుండా ఉండాలంటే టూకీగా మనం పాటించవలసిన జాగ్రత్తలు
* పొగ తాగ కూడదు. ఇప్పటికే అలవాటు ఉంటే వెంటనే మానెయ్యాలి. పొగాకును ఏ రూపంలో కూడా వాడకూడదు.
*సమతులాహారం తీసుకోవాలి.
◆కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకోవాలి
◆ రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి
◆ బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
◆ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
◆ మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి*.
◆ తగినంత నిద్ర పోవాలి.
◆ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి
◆ ఉప్పు వినియోగాన్ని వీలైనంత తగ్గించుకోవాలి.
గుండెపోటుకు ప్రాథమిక వైద్యం
గుండె నొప్పి ప్రారంభమైన తరువాత మొదటి గంట చాలా విలువైనది. ఈ గంట సమయంలో వైద్యం చేయగలిగితే చాలా వరకు గుండెపోటు మరణాలను నివారించవచ్చు. ఈ గంట సేపు జరిగే వైద్యాన్ని గుండెపోటు ప్రాథమిక వైద్యం అంటారు. గుండె నొప్పి వచ్చిన వారికి ధైర్యం చెప్పాలి.నడిపించ కూడదు. వీలైతే కదలకుండా పడుకోబెట్టాలి. నడిపించినా,భయపడ్డా గుండె వేగం మరింత పెరిగి గుండెపోటు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది.వీలైనంత త్వరగా నాలుక కింద 325 మిల్లీగ్రాముల యాస్ప్రిన్ మాత్రను చప్పరించాలి.సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద పెట్టుకోవాలి. ఈ మాత్రలు గుండెకు రక్తప్రసరణను పెంచే ప్రయత్నం చేస్తాయి. తద్వారా గుండెపోటు తీవ్రతను తగ్గిస్తాయి.
● ఆస్పిరిన్ మాత్రను అందుబాటులో
వుంచుకోవడం ఎలా?●
గుండె నొప్పి మొదలైన గంటలోపు ఆస్పిరిన్ మాత్ర మాత్రను చప్పరించాలి అన్న విషయం తెలుసుకోవడం ఒక భాగమైతే ,గుండె నొప్పి వచ్చిన ఆ గంటలో వాడడానికి అను కూలంగా ఆ మాత్రలను అందుబాటులో ఉంచుకోవడం మరో ముఖ్యమైన విషయం. గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వారందరూ ఈ మాత్రను ఎప్పుడూ వెంట ఉండే విదంగా చూసుకోవాలి. ఒక మాత్రను జేబులోని పర్స్ లో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను ప్రయాణం చేసే వ్యక్తిగత వాహనంలో ఉంచుకోవచ్చు, ఒక మాత్రను తను పనిచేసే ఆఫీసులో ఉంచుకోవచ్చు ,ఒక మాత్రను తను పడుకొనే మంచం మీద పరుపుకింద ఉంచుకోవచ్చు .ఇలా వారి వారి అనుకూలాన్ని బట్టి ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తే అక్కడ ఆ మాత్రను వెంటనే వినియోగించుకునే విధంగా అందు బాటులో ఉంచుకోవాలి. ఆస్పిరిన్ మాత్రతో పాటు క్లొపిడోగ్రిల్ 75 మిల్లీగ్రాముల మాత్రలు 4 మరియు ఒక్క అటార్వాస్టాటిన్ 80 మిల్లీగ్రాముల మాత్రను కూడా అందుబాటులో ఉంచుకో గల్గితే ఇంకా మంచిది. గుండెనొప్పి వచ్చిన వెంటనే ఈ మాత్రలన్నిటిని వేసుకో గలిగితే మరీ మంచిది . ఈ మాత్రలన్నీ కలిసి గుండెపోటు తీవ్రతను చాలా వరకు తగ్గించగలవు .ఈ విధంగా ఈ మూడు మాత్రలను సామూహికంగా వాడే విధానాన్ని గుండెపోటు లోడింగ్ డోస్ విధానం అంటారు. గుండెపోటు వచ్చిన వెంటనే ఈ మాత్రలను వేసుకుని వీలైనంత త్వరగా డాక్టర్ గారిని సంప్రదించాలి. గుండె నొప్పి తదుపరి వైద్యాన్ని డాక్టర్ గారు చూసుకుంటారు. ఈ సందర్భములో చాలామందికి ఒక అనుమానం రావచ్చు. మనకి వచ్చిన నొప్పి గుండెపోటు కాదేమో, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమో, గుండె నొప్పని భావించి ఈ మాత్రలు వాడితే ప్రమాదమేమన్నా జరుగుతుందేమో అన్న అనుమానం కూడా రావచ్చు. గుండెపోటు కాకపోయినా ఈ మాత్రలు వాడితే ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. ఈ మూడు రకాల మాత్రలను ఒక కవర్లో పెట్టి ,ఏటీఎం కార్డ్ ని, వ్యక్తిగత గుర్తింపు కార్డు ని ఏ విధంగా అయితే జోబులో జాగ్రత్తగా పెట్టుకుంటామొ అదే విధంగా ఈ కవర్ ను కూడా జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. ఏటీఎం కార్డు అత్యవసర పరిస్థితిలో లో డబ్బులు ఇస్తే ఈ మందుల కార్డు అత్యవసర పరిస్థితిలో ప్రాణాన్ని అందిస్తుంది.
గుండె పని విధానాన్ని స్క్రీనింగ్ చేయడం
గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నటువంటి వాళ్లు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మూడు సంవత్సరాలకు ఒకసారి గుండె పనివిధానాన్ని పరిశీలించుకుని గుండెపోటు వచ్చే అవకాశాన్ని ముందుగానే గుర్తించవచ్చు. అందుకొరకు కన్వేయర్ బెల్ట్ మీద పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఈసీజీ తీసే ట్రెడ్మిల్ పరీక్ష, పొట్టకు స్కానింగ్ పరీక్ష చేసే విధంగా గుండెకు ఎకో కార్డియోగ్రామ్ స్కానింగ్ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి .ఈ పరీక్షలను 50 సంవత్సరముల వయసుపైబడిన వారందరూ, గుండెపోటు వచ్చే అవకాశం ఉన్న వారందరూ చేయించుకుంటే గుండెపోటు ముందుగానే గుర్తించి గుండె జబ్బు తీవ్రతను తగ్గించుకోవచ్చు.
గుండెపోటు కారకాలు అన్నిటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ, జీవనశైలి మంచిగా ఉండేటట్టుగా చూసుకుంటూ, గుండెపోటుకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు తరచుగా చేయించుకుంటూ, గుండె నొప్పి వచ్చిన వెంటనే తగిన ప్రాథమిక వైద్యం చేసుకుంటూ డాక్టర్ల సలహా ప్రకారం వైద్యం కొనసాగిస్తే గుండెపోటుని వీలైనంత దూరంగా ఉంచగలం. అప్పుడే నిత్యం మనకు సేవచేసే గుండెను పదిలంగా ఉంచగలం
డాక్టర్ యం. వి.రమణయ్య
రాష్ట్ర అధ్యక్షులు
ప్రజారోగ్య వేదిక
సీనియర్ డాక్టర్ ,రామచంద్రారెడ్డి ఆస్పత్రి, నెల్లూరు.
0
0