ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని బీజేపీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఎలాగైనా జెండా పాతాలని ఉవ్విళ్ళూరుతోంది.
అయితే సఫలం కావడం లేదు. ఏపీలో బలమైన పార్టీలుగా వైసీపీ, తెలుగుదేశం పార్టీలే ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీ, జనసేన, లెఫ్ట్ పార్టీలు పార్టీలు కొనసాగుతున్నాయి. వైసీపీ అధికారంలో వుండగా, టీడీపీ ప్రతిపక్షంలో వుంది. ఇప్పటివరకు నెమ్మెదిగా అడుగులు వేస్తోన్న బీజేపీ, ఇప్పుడు దూకుడు పెంచే దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. తెలుగుదేశం పార్టీలో ఒకవైపు వరుసగా నేతల అరెస్టులు, మరోవైపు వలసలతతో ఆ పార్టీ బలహీనపడుతోంది. వైసీపీలోకి మరికొంతమంది టీడీపీ నేతలు జంప్ అయితే టీడీపీ ప్రతిపక్ష హోదాను కోల్పోయే అవకాశముంది. ఇదే అవకాశంగా తీసుకుని బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోంది. అందుకు ఎత్తులు కూడా వేస్తోంది. అందులో భాగంగానే టీడీపీ నేతలు అక్రమాలు చేసివుంటే అరెస్టు చేయడం కరెక్ట్ అంటూ సమర్ధిస్తూనే, వైసీపీ తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. ఏడాది పాలనపై వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎదగాలని భావిస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ 2.0 పాలనలో జరిగిన అభివృద్దిని వివరిస్తూ కరపత్రాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించి, ఆ దిశగా ముందుకుసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం కేంద్రప్రభుత్వం ఎంత సహాయం అందిస్తుందో, తద్వారా ఎంత అభివృద్ది పధకంలోకి దూసుకెళ్ళిందో తెలియజేయాలనే కార్యాచరణతో పావులు కదుపుతోంది. ఇలా ప్రతి దశలోనూ బీజేపీ ప్రభుత్వం చేస్తోన్న కృషిని ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూ, వైసీపీని బుక్ చేయాలని చూస్తోంది. ఏపీ రాజకీయాలు సామాజిక వర్గాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నందువల్ల సామాజిక వర్గాల వారీగా నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలని చూస్తోంది. కేంద్రంలో ఉంది బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇప్పట్లో టీడీపీ కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న తెలుగు తమ్ముళ్ళు కూడా, తమ భవిష్యత్ కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. కమలం కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి… ఆ పార్టీతో కలిసి సాగితే, తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలు కమలదళంలోకి చేరితే బీజేపీకి ఏపీలో మరింత బలం చేకూరుతుంది. ప్రస్తుతానికి తెరవెనక సంప్రదింపులూ, సన్నాహాలూ జరుగుతున్నాయని తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు బూత్‌స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి, వాటిని సమర్ధవంతంగా నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. బీజేపీ సిద్దాంతాలు, ప్రధాని మోడీ ఆలోచనా విధాన్ని క్షేత్రస్థాయిలోనూ బలంగా తీసుకెళ్ళాలని భావిస్తోంది. ఏపీలో 2024 నాటికి ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదగాలని ప్రణాళికతో సాగుతోంది.