ఏదీ నిర్ధారణ కాలేదు* *వింతవ్యాధిపై సాగుతున్న పరిశోధనలు* ఆళ్ల

    0
    483

    *సీసం, నికెల్‌పై అంచనాలు ప్రాథమికం*
    *నీళ్లలో ఈ-కోలిపైనా ఇప్పుడే చెప్పలేం: ఆళ్ల*
    విజయవాడ : ఏలూరులో వారంరోజులుగా కలకలం సృష్టిస్తున్న అంతుచిక్కని వింతవ్యాధికి కారణాలేమిటనేది ఇంతవరకు పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఢిల్లీ ఎయిమ్స్‌, ఐసీటీసీ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చిన నిపుణులతో కూడిన వైద్య బృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. గురువారం ఉదయం ఆళ్ల నాని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏలూరు వింత వ్యాధి బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యసేవల గురించి, ఆహార పదార్థాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు.
    అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఏలూరులో వింతవ్యాధికి గురైన బాధితుల రక్తపరీక్షల రిపోర్టుల ఆధారంగా వారి శరీరాల్లో సీసం, నికెల్‌, ఆర్గానో క్లోరిన్‌ తదితర అవశేషాలు ఉన్నట్టు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు. ఏలూరు ప్రజలు తాగుతున్న నీటిలో ఈ-కోలి బ్యాక్టీరియా, ఇతర కారకాలు ఉన్నట్లుగా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. జాతీయ వైద్య బృందాలు ఇంకా శాంపిల్స్‌ను సేకరిస్తూ మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జాతీయ వైద్యబృందాల ప్రతినిధులతో మాట్లాడినపుడు, శుక్రవారం సాయంత్రానికి నివేదికలు సమర్పిస్తామని చెప్పారు. ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుంది’’ అని వివరించారు. బుధవారం ఇద్దరు బాఽధితులు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరణించడంపై విలేకరులు ప్రశ్నించగా.. వారిద్దరూ ఏలూరులో వెలుగుచూసిన వ్యాధి లక్షణాలతో చనిపోలేదని వైద్యులు చెబుతున్నారన్నారు. ఒకరు కరోనా వైర్‌సతోను, మరొకరు ఊపిరితిత్తుల సమస్యతోను మరణించినట్లు మంత్రి చెప్పారు. బాధితులకు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తుండటంతో, ఇప్పటికే వందల మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారని తెలిపారు