“ఇంట్లోనే ఉందాం – దేశాన్ని రక్షించుకుందాం” అనే నినాదం వినడానికి విడ్డూరంగా ఉన్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనివార్యం. లాక్ డౌన్ అనే పేరుతో ఈ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. మనదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో ఆచరిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని కాపాడుకోవడానికి తుపాకి పట్టుకొని సరిహద్దుల్లో యుద్ధం చేయనక్కర్లేదు. రిమోట్ పట్టుకొని టీవీ ముందు కూర్చుని ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉంటే చాలు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ యుద్ధం శత్రు రాజ్యం మీద కాదు. కరోనా వైరస్ మీద.ఒక్క రోజు కాదు ఇరవై ఒక్క రోజులు.
పనులన్నీ మానుకుని 21 రోజులపాటు ఇంట్లోనే కూర్చుని ఉండడం అవసరమా అని అనిపిస్తుంది. దీని అవసరాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ వ్యాధి తీవ్రత ఎంతుంది?ఎన్ని దేశాలకు పాకింది? వ్యాధి విస్తరణలో ఉన్న దశలు ఏమిటి? అనే అనే విషయాలను తెలుసుకోవాలి.
ఈ కరోనా వైరస్ 3 నెలల క్రితం చైనా లో పుట్టింది. మూడు నెలల్లోనే ప్రపంచంలోని 200 దేశాలకు పాకింది. మార్చి 28 నాటికి సుమారు 8 లక్షల 35 వేల మందికి సోకింది. 39 వేల మంది మరణానికి కారణమయ్యింది. మనదేశంలో సుమారు 1250 మందికి సోకి, 32 మందిని బలి తీసుకుంది. మూడు నెలల్లోనే ఇంతమందికి సోకి ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తున్న ఈ వైరస్ వ్యాప్తి ఇంకోక నెల ఇలాగే కొనసాగితే జరగబోయే పరిణామాలను ఊహించడం కష్టతరంగా వుంది.
ఈ వ్యాధిని కట్టడి చేయాలంటే ఈ వ్యాధి ఏ విధంగా వ్యాపిస్తుంది. విస్తరించడంలో ఉన్న దశలేమిటి అన్నది విషయం తెలుసుకోవాలి. ఈ వ్యాధి నాలుగు దశల్లో వ్యాపిస్తుంది.
మొదటి దశ ….
విదేశాల నుంచి దిగుమతిదశ.ఈ వైరస్ ఈ దేశం లో పుట్టింది కాదు. చైనా లో పుట్టి, దేశ దేశాలకు పాకుతూ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. ఈ వ్యాధి సోకిన స్వదేశీయులు కానీ,విదేశీయులు గానే ఈ దేశంలోకి రావడంతో ఈ దశ ప్రారంభమైంది. ఈ దశలో కరోనా ను అదుపు చేయడం సులభం. విదేశాలనుండి వచ్చేవారిని 14 రోజులపాటు కట్టడిలో పెట్టి ఆ తర్వాతనే దేశంలోకి అనుమతించి ఉండాలి.
రెండవ దశ…….
విదేశాల నుంచి వచ్చిన ఈ వ్యాధిగ్రస్తుల ద్వారా ఈ దేశంలో ఉన్న వారికి సోకడం రెండవ దశ. ఈ జబ్బును తెచ్చుకున్న విదేశీ ప్రయాణికులు తన కుటుంబ సభ్యులకు, సహచరులకు, మిత్రులకు అంటించడం జరుగుతుంది.
మూడవ దశ….
రెండవ దశలో సోకిన వారి ద్వారా వారిమిత్రులకు, సహచరులకు, కుటుంబ సభ్యులకు అంటుకోవడం.
నాల్గవ దశ
ఎవరి ద్వారా ఎవరికి అంటుకున్నది తెలుసుకోలేని విధంగా సమాజంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించడం.
మన దేశం ప్రస్తుతం రెండవ దశలో ఉంది. మహారాష్ట్ర మూడవ దశలో ఉందేమో అన్న అనుమానం ఉంది. ఇటలీ,అమెరికాలు రెండవ దశను దాటి మూడవ దశలో కి ప్రవేశించాయి. ఆర్థికంగా ,వైద్యపరంగా అభివృద్ధి చెందిన ఈ దేశాలకే ఈ వైరస్ ని కట్టడి చేయడం కష్టమై రోజుకు కొన్ని వేల మంది చనిపోతున్నారు. వైద్య సేవలను సరైన పద్ధతిలో అందించడం కూడా సాధ్యం కావడం లేదు. వీరి పరిస్థితే ఇలా ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందో. జనాభా ఎక్కువగా ఉన్న సాంద్రత ఎక్కువగా ఉన్న మనలాంటి దేశంలో ఈ వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉండవచ్చు. వ్యాధి నిర్ధారణకు కావలసిన పరీక్షలు, ఆసుపత్రిలో చేరి వైద్యం చేయవలసి వస్తే అవసరమైన వైద్య సదుపాయాలు చాలా కస్టమవుతాయి. నిర్ధారణ పరీక్షలు లేక ,వైద్యం అందించడానికి ఆస్పత్రిలో పడకలు సరిపోక ,వెంటిలేటర్లు అందుబాటులో లేక చాలా ప్రాణాల్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మూడు నుంచి నాల్గవ దశలోకి పోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం మరీ కష్టం.
ఈ వ్యాధిని కట్టడి చేయడానికి మన ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ కార్యక్రమం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఈ కార్యక్రమం ద్వారా వ్యాధి ఉన్నవారు ఇంట్లోనే ఉంటూ వేరే వారికి అంటించకుండా ఉండడానికి,వ్యాధి లేని వారు వేరే వారి నుంచి అంట్టించుకోకుండా ఉండే దానికి చాలా అవసరం. కష్టమైనా మనకు ఇష్టం లేకపోయినా లాక్ డౌన్ కార్యక్రమాన్ని ఆచరిద్దాం కరోనాను కట్టడి చేద్దాం.