అమలాపురం డివిజన్ లో కరోనా బారిన పడి తొలిసారిగా ఒక వ్యక్తి మరణించడం జరిగిందని అమలాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి.హెచ్. భవానీ శంకర్ తెలిపారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుండి అమలాపురం వచ్చి స్థానికంగా ఒక లాడ్జి లో వుండటం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. అయితే అతనికి విపరీతమైన కరోనా లక్షణాలు వుండటంతో అతన్ని అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలించారని అయితే తరలించే క్రమంలో నిన్న సాయంత్రం ఆ వ్యక్తి మరణించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం మరణించిన వ్యక్తికి ట్రు నాట్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని దీనితో అతని కుటుంబ సభ్యులకు కూడా ఆర్.టీ.పి.సి.ఆర్. పరీక్షకు శాంపిల్స్ తీసుకుని వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆర్.డి. ఓ తెలిపారు. డివిజన్ లో సంభవించిన కరోనా తొలి మరణాన్ని అతి పెద్ద హెచ్చరిక గా భావించి ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ విచక్షణతో మెలగాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్ శాఖలు ప్రజలకు కరోనా పై వినూత్నమైన రీతుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారని ఆర్.డి. ఓ అన్నారు. అధికారులు ఏమిచేసినా ఎంత చెప్పినా ప్రజల ఆరోగ్యం కొరకే అన్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని, కొన్ని రోజులపాటు సరదాలకు,సంతోషాలకు దూరంగా వుండి క్రమశిక్షణ తో మెలగాలని ఆర్.డి. ఓ. విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే మనం కరోనా అత్యున్నత స్థాయికి చేరువలో వున్నామనే విషయాన్ని గుర్తించి కరోనా నుండి బయట పడేందుకు అన్ని జాగర్తలు తీసుకోవాలని ఆర్.డి. ఓ హెచ్చరించారు.అత్యవసరం అయితే గాని బయట తిరగవద్దని,మాస్క్ లు లేకుండా అసలే తిరగవద్దని, సామాజిక దూరం పాటించాలని,అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడుకోవాలని ఆర్.డి. ఓ విజ్ఞప్తి చేశారు.