అనంతపురంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
అనంతపురం, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ఘనంగా నివాళులర్పణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ ఎదుట అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖ విద్యావేత్త, రాయలసీమ ప్రజా సమాఖ్య అధ్యక్షులు గోర్తి వెంకటస్వామి గారు ఘనంగా నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా గోర్తి వెంకట్ మాట్లాడుతూ, ‘‘డాక్టర్ అంబేద్కర్ ఒక మహానేత మాత్రమే కాక, ప్రపంచం గర్వించదగిన మేధావి. భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించిన గొప్ప రాజనీతిజ్ఞుడు. 2004లో అమెరికా కోలంబియా యూనివర్శిటీ రూపొందించిన ప్రపంచ టాప్ 100 మేధావుల జాబితాలో అంబేద్కర్ ప్రథమ స్థానంలో నిలిచారు’’ అని గుర్తుచేశారు.
‘‘చదువుతో వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందనడానికి అంబేద్కర్ జీవితం గొప్ప ఉదాహరణ. సామాజిక సమానత్వానికి ఆయన పాటించిన మార్గం నేటి తరానికి మార్గదర్శకం. మహిళల హక్కుల పరిరక్షణలో, కార్మికుల సంక్షేమం కోసం ఆయన రాజ్యాంగంలో చేసిన మార్పులు యుగప్రభావం కలిగించాయి,’’ అని పేర్కొన్నారు.
‘‘విద్య, రాజకీయం, సమాజం, ఆర్థిక రంగం, న్యాయవ్యవస్థ ఇలా అన్నింటినీ స్పృశించిన మహోన్నత నాయకుడిగా అంబేద్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకం,’’ అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్తూరు మెయిన్ స్కూల్ హెడ్‌మాస్టర్ గోర్తి వెంకటస్వామితో పాటు ఉపాధ్యాయులు కె.జె.పి. రామన్న, హెచ్. రామాంజనేయులు, ఏ.హెచ్. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.