అత్తగారూ- అరిసెలు (కథ)
‘‘పండుగపోయి వారం అవుతుంటే ఇప్పుడేం అరిసెలత్తయా? అన్నాన్నేను ఉండ బట్టలేక
‘‘ఏం? చేసు కోకూడదా? తిన కూడదా? నా నోరు చవిచెడింది. తినాలనుంది’’ అంది పెంకిగా మా అత్తగారు సక్కుభాయమ్మ (భా అనే అక్షరం పలికేటప్పుడు వత్తి పలక్క పోయామో అయి పోయామే ఆ మాత్రం తెలుగు పలకడం రాక పోతే ఊరుకోండి భాషని కైమా చెయ్యబాకండి వెనకటి మా మేనత్త పినతల్లి కోడం కొత్తగా పెళ్లయ్యి పుట్టింటి నుండి అత్తింటికి వచ్చింది. కొత్త పిల్లగదా వాతా వరణం కొత్తకదా వాళ్ల మామయ్యని చూసి నమస్కారం అందట ఇక చూస్కో ఆ పిల్లని గోడ కుర్చీ వేయించారు. మెడలో పూలదండలు అలానే ఉన్నాయ్ అలాంటి ఆచారం, సాంప్ర దాయం నుండి వచ్చాన్నేను అంటూ ఇంకా కొన్ని ఉదాహరణలతో ఊదరగోడుతుంది. పొగ బెడుతుంది. వచ్చిన వాళ్లు ఎలాగో తప్పించుకుని వెళతారు మరినేనా? ఆమె కోడల్నయినందుకు సచ్చినట్లు పడి ఉండాలి ఉంటాను ఏ మాత్రం నిరసనగా కళ్లు వాల్చనా కనుక్కునేస్తుందండోయ్ మా వారు రాగానే ఏరా కాముడూ! నీ పెళ్లానికి ఇంత నిర్లక్ష్యం ఏమిట్రా? నా మాటని మరీ బొత్తిగా ఎడంచేత్తో తీసిపారేస్తుంది అంటూ మా వారికి మా అత్త సంగతి తెలుసు కాబట్టి ఆవిడ ముందు నన్ను కేకలేస్తారు. నాకు కన్ను గీటుతూ.
‘‘అది కాదత్తయ్యా! బుచ్చిరెడ్డి పాళెం నుండి మీ అక్కగారు పంపినవే మొన్నటి దాకా తిన్నాం ఇంకా మిగిలితే సంపూర్ణమ్మ (మా పని మనిషి) కిఇచ్చాం.
‘‘నా మాట పూర్తికాక ముందే (ఎవరి మాటని పూర్తిగా చెప్పనిస్తుంది గనక)’’ ఇస్తే ఇచ్చాం లేద్దూ రెక్కలు ముక్కలు చేసుకుని మన ఇంటెడు చాకిరీ చేస్తుంది. ఆ మాత్రం ఇస్తే పోయేదేమిటి? నీ పొదుపు నీపుట్టింట్లో చూపించు ఇక్కడకాదు మాది ధారాళంగా ఇచ్చుకునే వంశం… అంటూ తన పూర్వచరిత్ర తిరగతోడుతుంది.
ఇక నేను సచ్చానే సంపూర్ణమ్మకు ఎవరు ఇవ్వొద్దన్నారు. అలా జంబాలు పలుకుతుంది గానీ నేనెప్పుడన్నా మా పని మనిషి కూతురు భార్గవి తలనొప్పక్కా అంటే శారిడాన్ మాత్ర ఇచ్చి వేడి వేడి కాఫీ కలిపి ఇస్తాను ఆ బాదం చెట్టుకింద కూర్చుని తాగిరా, కాసేపు ఆ అరుగు మీద రెస్ట్ తీసుకో అంటాను. మా అత్తగారు ఆ సమయంలో ఏమంటారో తెలుసా అండీ… ఛఛ… మానం మర్యాద మంట కలిసిపోతున్నాయ్. పనోళ్లని అంతచనువిస్తా రా? ఎవరైనా? అలానే నెత్తినెక్కించుకుంటారా ఎక్కడైనా? మరీ విడ్డూరం’’ అంటూ చేతులు బార్లా చాపి నా మీద ధ్వజమెత్తుతుంది. సాధింపు సాయంత్రం మా వారు వచ్చేదాకా కొనసాగుతుంది.
ఇంతకీ అరిసెల సంగతి మర్చిపోయాం. వాస్తవంగానండీ మా అత్తగారికి ఒక్క పని చేతకాదు ఆ రోజుల్లో ఈమె కాపురాని కొచ్చిన ప్పుడు మామామయ్యగారి మేనత్తలు తలచెడి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకేముంది. పనంతా వాళ్లే చేసేవాళ్లు. ఈమెని సున్నితంగా సుకుమారంగా చూసుకున్నారు. అలా రాణి లాగా దర్పం వెలగబెట్టి తనకి ఏ పనీ చేతకాదని ఎవరైనా కనుక్కుంటారని ఆ ఏముందేమరిగా అవి తీసి ఇందులో పొయ్యి ఇవి తీసి అందులో పొయ్యి పోపు గింజలు దట్టించి వెయ్యి నూనె కాస్తా పోయ్యవే నీ అబ్బ సొమ్మేంపోదు ఆ యాలకులు ఇలా పట్రండి. చిదిపి ఇందులో వేద్దాం జీడిపప్పు వేయించారా పక్కన పెట్టు కోండి (ఈలోపు సగం ఆమె నోట్లోకే వెళ్లి పోతాయ్ పుటకూ పుటకూమంటూ ముని పళ్లతో నమిలేస్తుంది. ఆ వెయ్యి… డాల్డా కలపకేవ్ నాకస్సలు నచ్చదు. ఆ పసుపులేటి వారి గోశాలకెళ్లి ఆవు నెయ్యి తెప్పించకూడదే అన్నీ నేనే చెప్పి చావాలి అంతా నేనే చూసు కోవాలి అంటూ ఉస్సూబుస్సూమంటూ తన భారీ శరీరాన్ని కుర్చీలో ఇరికిస్తుంది. అక్కడి నుండే తెప్పించానత్తయ్య అని నేనంటే ముందుగా చెప్పొచ్చుకదే నన్ను ఆయాసపెట్టి తమాషా చూడకపోతే అని మళ్లీనన్నే అం టుంది. నేను ఒక్క నవ్వు నవ్వి పక్కకెళ్లి పోతాను.
అలా పైపైన నటనలతో వంటలూ, పిండి వంటలూ అన్నీ తనే చేస్తున్నట్లు హడావిడి పెట్టిసి అంతా అయ్యాక రుచి చూస్తూ ఆ నేను చెప్పాకదా ఆ బాదం పప్పుపొడి ఉడుకు తుండగా వెయ్యమని అందుకే ఇంత రుచి వచ్చింది. చేసిన వాళ్లు నోళ్లు వెళ్లబెట్టి, నావైపు మీ అత్త భలే గడుసుదమ్మా అని వాళ్ల సంభా వన వాళ్లు తీసుకుని చక్కాపోతారు.
అలా ఇప్పుడు అరిసెలకు పెట్టింది టెం డర్! మా మేనత్త కూతురు సుబ్బరత్నమ్మ మేముంటున్న బాలాజీనగర్‌కి మూడో వీధిలోనే ఉంటుంది. ఆవిడని పిలిపించమని కూచుంది. ఆవిడకు పిండి వంటలు యమాగావచ్చు. మా అత్తగారు పైపై అజమాయిషీ చేసి క్రెడిటంతా కొట్టెయాలని ప్లాను పైగా నాకు రాదని కాదేవ్ మీ వదిన్ని పిలవమనటం నాకు చేతి కింద మనిషి ఉంటేగానీ తోచదు ఎంతటి వంటైనా చిటికెలో చేసేస్తాను. అదీగాక మీ సుబ్బరత్నమ్మ వదిన నా దగ్గర నేర్చుకున్నట్లూ ఉంటుందుని పోనీ పాపం పిల్లలుగలది నా దగ్గర నాలుగు వంటలు నేర్చుకుంటే పిల్లలకి చేసి పెడుతుంది. అంటూ ఎంతో ఉదారంగా పలుకుతుంది. మా సుబ్బరత్నమ్మ వదినకి కబురుపంపాను. టైఫాయిడంటమ్మా అంటూ వచ్చింది సం పూర్ణమ్మ.
‘‘అయ్యో! అయినా ఏంలే మానుకుంటానా ఏమిటి? తినాలని పించింది తినాల్సిందే నమ్మోయ్ ఎలా పెరిగాను ఎలా తిన్నాను ఆ అవన్నీ ఇప్పుడెందుకులే సరేనేవ్ సంఫూర్ణా! ఇలారా! నీకు నేర్పిస్తాను అరిసెలోత్తేది అంది. బాగుంది మా ఆయనకి పళ్లు పీకించటానికి పోతున్నా రేపొస్తానికాడికి ఆ అరిసెలు బురి సెలు వత్తటం నాకు చేతరాదసలు అంటూ సంపూర్ణ తప్పించుకోబోయింది. ‘‘ఓసి నీ సోద్యంకూలా! రేపు భార్గవికి పెళ్లి చేశాక అల్లుడొచ్చి అరిసెలు కాల్చత్తా! అంటే ఏం కాల్చి పెడతావే పిడత కింద పప్పు మీ పక్కనున్న సుజాతమ్మ బర్రెల దగ్గరి పేడ వత్తి పిడకలు కాల్చి పెట్టాల్సిందే ఏం సోయగం పోతున్నావే చక్కగా పిండి వంట నేర్పుతాను రావే అంటే బాపనోడి పెళ్లికి సాయిబులోడు మంత్రాలు చదివినట్టు చదివావ్‌గదే సరే ఏంచేద్దాం! మంగా! నువ్‌రావే నీకన్నా నేర్పిస్తాను అంటూ నన్ను తగులుకుంది.
నా బిక్క ముఖం చూసి సంపూర్ణ ‘‘వామ్మో మంగమ్మ! చెప్పటం మరి చాను మీ వదిన నన్ను యమ అర్జంటుగా రమ్మంది మీ అన్నకి కాఫీ కలిపిచ్చే దిక్కుకూడా లేక ఉసూరుమంటూంది. ఏదన్నా ఇంతకూ రాకన్నాకల బెట్టి రమ్మని పిల్చింది నిన్ను మీ అత్తగారి అరిసెల్లోపడి ఏమారాను బేగీపోమ్మా పాపం’’ అంది కన్నుగీటుతూ నాకర్థమైంది అయ్యో వదినా! అంటూ గబగబ పైటసర్దుకుని చీరకు కుచ్చిళ్లు సరిచేసుకుని వస్తానత్తయ్యా అంటూ ఒకటే దౌడు తీశాను. ఆమె ఊ ఈ అని అనకముందే!
కావాలనే రాత్రి 9గంటలకి వచ్చాను ఎవ్వరూలేరని ఊరుకుని ఉంటుందని అనుకున్నాను హాల్లో తలుపులు వేసి ఉన్నంధువల్ల కాబోలు పొగ చుట్టుకునిపోయి ఉంది. వంటిల్లంతా పొగ ఇంతకీ మా అత్తగారు ఎక్కడున్నారా అని చూద్దునుగదా జగన్మోహినిలో పొయ్యి ముందు కూర్చుని కాళ్లు పొయ్యిలో పెట్టి బాణలిలో ఏవో దేవుతున్న దెయ్యంలాగా పెరట్లో పొయ్యి ముందు కూర్చుని గరిటెతో దబరలో ఏదో కలియబెడుతుంది. శబ్ధానికి ఇటు తిరిగింది.
‘‘ఏంటత్తయ్యా ఇంటి నిండా పొగ?’’ ఆ పిండి వంటలు చేస్తుంటే ఆ మాత్రం రాదూ? అన్నది పక్కనే చాప మీద తెల్లగా వడియాల్లాగా ఏవో ఉంటే ఏంటత్తయ్యా అన్నాను. ఆ మరీ చోద్యమేనీది అరిసెలు! అది గరిటిని ఇంకా బలంగా తిప్పుతూ అరిసెలా? అని ఆశ్చర్యపోతుంటే ‘‘పిండి పాకంలో కలవలేదే విరిగిపోయింది అరిసె షేపులో రాలేదనుకో బాణలిలో అరిసె వేయటం ఊడిపోవటం ఆ పిండినంతా కాల్చిదేవేను ఏమైతది గిన్నెలో వేసుకుని స్పూన్‌తో తింటే సరి!
‘‘ఏంటి అరిసెలు స్ఫూన్‌తో తినాల్నా?’’ అన్నాన్నేను ‘‘ఇప్పుడదే ఫ్యాషన్‌లేవే! అంటుంటే నేనేమంటాను.
కోలపల్లి ఈశ్వర్
నెల్లూరు.