ప్రభుత్వ సేవల పంపిణీలో ప్రజా సంతృప్తి 90 శాతానికి చేరేలా అధికారులు పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
ప్రస్తుతం ప్రభుత్వ సేవలపై ప్రజా సంతృప్తి 72 శాతానికి పెరిగిందని, అక్టోబర్ నాటికి దాన్ని 90 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు, అంగన్వాడీలు, అన్న క్యాంటీన్లు, బీసీ సంక్షేమ హాస్టళ్లు వంటి రంగాల్లో మెరుగైన పనితీరును అభినందించారు.
అదే సమయంలో రెవెన్యూ, విద్య, రవాణా వంటి శాఖలు మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. భూవివాదాల పరిష్కారం కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీ, క్యూ ఆర్ కోడ్ ఆధారిత వ్యవస్థలను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. పారదర్శక పాలన ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


