खबर की मुख्य बातें
- -అధికారుల టేబుళ్లపైకి ఫైల్ -ఉద్యోగుల చేతులు తడిపేందుకు యత్నాలు -అనుమతుల కోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు సిద్ధం -మంత్రి అనుచరుల చేత అధికారికి ఫోన్లు -సిఫార్సులతో అనుమతులు తెచ్చుకోవాలని ప్రదక్షిణలు -వైసీపీ హయాంలో నిర్వహించిన వారే మళ్లీ రంగంలోకి -టీడీపీ ప్రభుత్వం రాగానే మూయించిన నేతలు -మరోసారి పట్టు…
- సంత నిర్వహణ అనుమతుల కోసం ఫైల్ ఆర్డీవో స్థాయి అధికారి టేబుల్‌పై తుది అనుమతి కోసం వేచి ఉన్నట్లు తెలియవస్తోంది.
- దీని కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టేందుకు కూడా నిర్వాహకులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
-అధికారుల టేబుళ్లపైకి ఫైల్
-ఉద్యోగుల చేతులు తడిపేందుకు యత్నాలు
-అనుమతుల కోసం లక్షలు ఖర్చుపెట్టేందుకు సిద్ధం
-మంత్రి అనుచరుల చేత అధికారికి ఫోన్లు
-సిఫార్సులతో అనుమతులు తెచ్చుకోవాలని ప్రదక్షిణలు
-వైసీపీ హయాంలో నిర్వహించిన వారే మళ్లీ రంగంలోకి
-టీడీపీ ప్రభుత్వం రాగానే మూయించిన నేతలు
-మరోసారి పట్టు వదలని నిర్వాహకులు
నెల్లూరు నగర శివారు ప్రాంతాల్లో లేదా కొవూరు సమీపంలోని పడుగుపాడు ప్రాంతంలో పశువుల సంతను నిర్వహించేందుకు గతంలోని పాత కాపులు మరోసారి యత్నాలను ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవస్తోంది. సంత నిర్వహణ అనుమతుల కోసం ఫైల్ ఆర్డీవో స్థాయి అధికారి టేబుల్‌పై తుది అనుమతి కోసం వేచి ఉన్నట్లు తెలియవస్తోంది. దీని కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టేందుకు కూడా నిర్వాహకులు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే సంబంధిత అధికారులకు, ఉద్యోగులకు లంచాల ఆశ చూపిన నిర్వాహకులు, దీంతో పాటు సిఫార్సులు చేయించడానికి కూడా సిద్ధమైనట్లు తెలియవస్తోంది.
రాష్ట్ర మున్సిపల్ మంత్రి పి. నారాయణకు అత్యంత సన్నిహితమైన ఆ విద్యాసంస్థల మేనేజర్ వద్దకు ఈ నిర్వాహకులు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతూ, ఆయన చేత ఆర్డీవో స్థాయి అధికారికి సిఫార్సుల ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం. 2024కు ముందు నాటి వైసీపీ హయాంలో నిరాటంకంగా జరిపిన ఈ పశువుల సంత నిర్వాహకులు, అప్పట్లో సంబంధిత వైసీపీ ముఖ్య నేతలకు నెలనెలా లక్షల రూపాయలు మామూళ్లు ఇస్తూ తమ వ్యాపారాన్ని సజావుగా కొనసాగించారని ఆరోపణలు ఉన్నాయి. 2024లో వైసీపీ ఓటమిపాలవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో, నాడు వైసీపీలో ఉండి టీడీపీలోకి వచ్చి చక్రం తిప్పుతున్న ఓ ముఖ్య నేతతో మామూళ్ల వద్ద బేరం కుదరకపోవడంతో ఆ నేత పట్టుబట్టి మరీ ఈ సంత నిర్వహణను మూయించారని సమాచారం.
అప్పటి నుంచి అక్కడక్కడ తాత్కాలికంగా సంతను నిర్వహిస్తున్న నిర్వాహకులు, ఇక లాభం లేదనుకుని అధికారికంగా అనుమతులు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలియవస్తోంది. మొదట్లో సాలుచింతల సమీపంలో ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలో ఉన్న మైదాన ప్రాంతంలో ఇదే నిర్వాహకులు సంతను నిర్వహించేవారు. అక్కడ స్థానిక ప్రజల నిరసనలు ఎక్కువ కావడంతో, సంతను నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీ వద్ద పెన్నా నది సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొన్నేళ్ల పాటు నిర్వహించారు. అయితే వైసీపీ అధికారం కోల్పోవడంతో కొత్తగా వచ్చిన టీడీపీ నేత ఈ సంత నిర్వహణను అడ్డుకున్నారు. దీంతో అక్కడి నుంచి మకాం మార్చారు.
ఒక దశలో తాము ఆక్రమించిన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి తమదేనంటూ బుకాయించారు. అయితే అడ్డుకున్న టీడీపీ నేతకు ఈ విషయాలన్నీ తెలుసు కనుక, ఆక్రమించిన భూమిని సర్వే చేయించి అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించారు. విషయాన్ని మున్సిపల్ మంత్రి పి. నారాయణ, నగర కమిషనర్ ల దృష్టికి తీసుకెళ్లి సంతను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అప్పటి నుంచి గత రెండేళ్లుగా సంబంధిత నిర్వాహకులకు సరైన స్థలం దొరకక, అనుమతులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు . ఇలా రెండున్నరేళ్ల కాలం గడిచిన తర్వాత మెల్లమెల్లగా టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకుంటూ, ఎన్ని లక్షలైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధమై మరోసారి తమ యత్నాలు మొదలుపెట్టారు.
అయితే ఇది పేరుకు మాత్రమే పశువుల సంత కాగా, ఈ సంత నుంచి వారంలో రెండుసార్లు, అంటే ప్రతి మంగళవారం, శుక్రవారం వందల సంఖ్యలో లారీల్లో పశువులు సమీప రాష్ట్రాలైన తమిళనాడు, కేరళలోని వధశాలలకు తరలిపోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మార్గ మధ్యంలో లారీల డ్రైవర్లు సంబంధిత పోలీసులకు, చెక్‌పోస్టుల వద్ద సిబ్బందికి తమదైన శైలిలో మామూళ్లు ఇచ్చుకుంటూ పశువులను గమ్యస్థానాలకు తరలించేవారని సమాచారం. అక్కడ పశువులను కబేళాలకు తరలించి వధించి, మాంసాన్ని కిలోల లెక్కన అమ్ముతున్నారని చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా జీవకారుణ్య సంస్థలు గానీ, బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు గానీ ఈ విషయాలపై ఇంతవరకు సరైన దృష్టి పెట్టకపోవడం శోచనీయం. సమీప ప్రాంతాల ప్రజలు మాత్రం ఈ విషయాలపై అప్పుడప్పుడు తమ అసహనాన్ని, నిరసనను వ్యక్తం చేసేవారు. గోవధ నిషేధాన్ని కోరేవారు ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
2024కు ముందు భగత్‌సింగ్ కాలనీ జాతీయ రహదారి సమీపంలో నిర్వహించిన ఈ సంత నుంచి వేలాది పశువులు తరలిపోయాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఈ పశువుల సంతను ఏళ్ల తరబడి నిర్వహించినా, కార్పొరేషన్‌కు గానీ రెవెన్యూ శాఖకు గానీ నిర్వాహకులు ఎలాంటి ఫీజులు చెల్లించిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం రాజకీయ నాయకులకు, అధికారులకు, తదితరులకు మామూళ్లు చెల్లిస్తూ తమ వ్యాపారాన్ని సజావుగా కొనసాగించినట్లు తెలియవస్తోంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి ఇక్కడ చక్రం తిప్పుతున్న నేతకు ఈ విషయాలన్నీ తెలిసి గట్టిగా పట్టుబట్టడంతో నిర్వాహకులు సంతను అర్ధంతరంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గతంలో భగత్‌సింగ్ కాలనీ ప్రాంతంలో వీరు ఆక్రమించి సంతను నిర్వహించిన స్థలంలో ప్రస్తుతం పరిశ్రమల శాఖ భవనాలను నిర్మించింది. దీంతో నెల్లూరు నగర పరిసరాల్లో లేదా పడుగుపాడు పరిసరాల్లో సంత నిర్వహించడానికి నిర్వాహకులు మరోసారి యత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆర్డీవో స్థాయి అధికారి ఈ సంత నిర్వహణకు అనుమతులు మంజూరు చేయకపోవడం, కొర్రీలు పెట్టడంతో మున్సిపల్ మంత్రి పి. నారాయణ ప్రధాన అనుచరులను బుట్టలో వేసుకుని వారి ద్వారా ఆ అధికారికి ఫోన్లు చేయిస్తున్నట్లు సమాచారం.
ఇది పైకి మాత్రమే పశువుల సంతగా కనిపిస్తోందని, అసలు ఇక్కడి నుంచి వారానికి రెండు రోజులు వందల సంఖ్యలో మూగజీవాలు తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు తరలిపోయి అక్కడ బలవుతున్నాయని ఈ వ్యవహారం తెలిసిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయాలను అర్థం చేసుకుని మంత్రి అనుచరులు, అధికారులు ఇలాంటి నిర్వహణకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ ఫోన్ ల సిపారసులకే తలగ్గుతారో లేక మూగ జీవాల పై కారుణ్యమే చూపుతారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది .